తెలంగాణలో మద్యం ధరలు పెంపు..!?
తెలంగాణ ప్రభుత్వం త్వరలో మద్యం ధరలు పెంచేందుకు సిద్ధమవుతోంది. సామాన్యులు ఎక్కువగా తాగే మద్యం ధరలు పెంచే ఆలోచన లేనట్లు సమాచారం. అధిక ధరల మద్యంపై అంటే బాటిల్ ధర రూ.500 కంటే ఎక్కువగా ఉన్న మద్యంపై 10 శాతం వరకు పెంపు ఉండే అవకాశం ఉంది. దీని ద్వారా ప్రభుత్వానికి దాదాపు రూ. 2000 కోట్ల అదనపు ఆదాయం రానుంది. టెట్రా ప్యాకెట్ల ద్వారా మద్యం అమ్మే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉంది. ఇటీవలే బీర్ల ధరలు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు ఇతర మద్యం ధరలను కూడా పెంచడానికి సిద్ధమవుతోంది. సామాన్య ప్రజలు ఎక్కువగా తాగే ‘చీప్ లిక్కర్’ ధరలను మాత్రం పెంచే ఆలోచన లేదని తెలుస్తోంది. కేవలం అధిక ధర కలిగిన మద్యంపైనే స్వల్పంగా ధరలు పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ అంశంపై లోతుగా చర్చిస్తున్నారు.
మార్కెట్ ధరల ఆధారంగా ఈ కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయి. మద్యం ధరలను పెంచడానికి రెండు లేదా మూడు రకాల ప్రతిపాదనలను అధికారులు ప్రభుత్వానికి సమర్పించనున్నారు. ఏ విధానాన్ని అమలు చేస్తే ఎంత అదనపు ఆదాయం వస్తుందనే వివరాలను కూడా నివేదికలో స్పష్టంగా తెలియజేస్తారు. ప్రభుత్వం ఈ ప్రతిపాదనలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటుంది. బాటిల్ రేటు ఐదు వందల రూపాయల కంటే ఎక్కువ ఉన్న లిక్కర్‌పైన కనీసం 10 శాతం పెంచాలన్నది ప్రభుత్వ ఆలోచనగా చెబుతున్నారు. గత ఆర్దిక సంవత్సరంలో తెలంగాణకు 30 వేల కోట్లకు పైగా మద్యం పైనా ఆదాయం వచ్చింది. ఈ ధరల పెంపు ద్వారా రాష్ట్ర ఖజానాకు ఏడాదికి దాదాపు రూ. 2000 కోట్ల అదనపు ఆదాయం సమకూరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలోనే రాష్ట్ర ప్రభుత్వం బీర్ల ధరలను దాదాపు 15 శాతం వరకు పెంచింది. దీనివల్ల ఒక్కో బీరుపై సగటున రూ. 20 నుంచి రూ. 30 వరకు ధర పెరిగింది. ముడి సరుకుల ధరలు పెరగడం, ఉత్పత్తిదారుల విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం ఐదేళ్ల తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. పొరుగు రాష్ట్రాల్లో అమలవుతున్న మద్యం ధరలను అధ్యయనం చేసిన ఒక ప్రత్యేక కమిటీ కూడా ధరల పెంపునకు అనుకూలంగా నివేదిక సమర్పించింది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. టెట్రా ప్యాకెట్ల ద్వారా మద్యం అమ్మకాలు చేపట్టే అంశం కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉంది. కర్ణాటక వంటి కొన్ని రాష్ట్రాల్లో ఈ విధానం ఇప్పటికే అమల్లో ఉంది. దీనివల్ల ఉత్పత్తి ఖర్చు కొంత మేర తగ్గుతుందని.. తద్వారా వినియోగదారులకు మద్యం ధరలు కాస్త తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అయితే.. ఈ ప్రతిపాదనపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ ఆమోదం లభిస్తే.. మొదట మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేసి.. ఆ తర్వాత వచ్చే ఫలితాల ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉంది.