ఇనామ్దార్ వంశపారంపర్య అర్చకుల సంఘం డిమాండ్
తమ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని ఇనామ్దార్ వంశపారంపర్య అర్చకుల సంఘం డిమాండ్ చేసింది. తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు చెందిన వందలాది మంది వంశపారంపర్య అర్చకులు 2008లో సవరించిన 30/87 సవరణ చట్టాన్ని అమలు చేయడంతో పాటు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న డిమాండ్లను పరిష్కరించడానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందించడానికి హైదరాబాద్లో బుధవారం సమావేశమయ్యారు. 2008లో సవరించిన చట్టం దైవానికి తరతరాలుగా సేవ చేసే వంశపారంపర్య హక్కులను పునరుద్ధరించింది.
కానీ, దురదృష్టవశాత్తు ఇంకా అవి అమలుకు నోచుకోలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిఓ ఎంఎస్ 439 0f 2019 ద్వారా సవరించిన చట్టం ఎలా అమలు చేశారో ఎపి అర్చక సమాఖ్య అధ్యక్షుడు ఆత్రేయ బాబు ఈ సమావేశంలో వివరించారు. 30/87 ఎండోమెంట్స్ చట్టాన్ని సవరించడానికి ఉద్యమాన్ని ఒంటరిగా నడిపించిన డాక్టర్ ఎంవి సౌందరరాజన్ కృషిని ప్రతి ఒక్కరూ ప్రశంసించారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిసేందుకు చేపట్టిన ప్రయత్నాలను, వాటి అమలుకు సంబంధించిన హామీలను సిఎస్ రంగరాజన్ వివరించారు. తెలంగాణ ప్రాంత అవసరాలతో కూడిన ముసాయిదా జిఓ రూపొందించబడిందని, దానిని త్వరలో సిఎం రేవంత్ రెడ్డికి సమర్పించనున్నామని రంగరాజన్ ఈ సమావేశంలో వివరించారు.
పట్టాదార్ పాస్ పుస్తకాల్లోని ఎంజాయర్ అనుభవ దారు కాలమ్లో వారి పేర్లను పునరుద్ధరించడం, వారిని రైతుబంధుకు అర్హులుగా చేయడం వంటి వంశపారంపర్య అర్చకుల అనేక డిమాండ్లలో ఉన్నాయని, ఈ డిమాండ్ల సాధనకు ఇనామ్దార్ అర్చకులతో కూడిన ఒక అడహాక్ కమిటీ పని చేస్తుందని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశంలో శ్రీకృష్ణయ్య, కారంపూడి నరసింహాచార్యులు, భద్రకాళి శేషు, ఎస్టి ఆచార్య, బి రామశర్మ, జగదీష్, ఖమ్మం వాసుదేచారి తదితరులు పాల్గొన్నారు.