ఇథనాల్ ఫ్యాక్టరీ పచ్చని పల్లెల్లో ఇథనాల్ ఫ్యాక్టరీ కార్చిచ్చును రాజేసింది. ఏడాదికాలంగా ఇరు గ్రామాల ప్రజలకు కంటిమీద కును లేకుండా చేస్తోంది. ప్రశాంత వాతావరణంలోని పల్లెల్లో జీవనం కొనసాగిస్తున్న గ్రామాల ప్రజలను రోడ్డున పడేలా చేసింది. పచ్చని పంట పొలాల మధ్య విషాన్ని చిమ్మే ఫ్యాక్టరీ ఏర్పాటును నిరసిస్తూ ఏడాదికాలంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయినా ఇటు నాయకులు గానీ, అటు ప్రభుత్వంగానీ స్పందించిన దాఖలాలు లేవు. చివరికి రెండు రోజులుగా చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది.
ఏడాదికాలంగా ఆగని ఆందోళనలు
దిలావర్‌పూర్, గుండంపెల్లి గ్రామాల మధ్య పచ్చని పంట పొలాల నడుమ నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు నిలిపివేయాలని ఇరు గ్రామాల ప్రజలు ఏడాది కాలంగా ఆందోళన చేస్తున్నారు. దిలావర్‌పూర్ మండల కేంద్రంలో ధర్నా కార్యక్రమాన్ని ఏడాదిగా కొనసాగిస్తున్నారు. నాయకులు, అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఫలితం లేకపోవడంతో రెండు రోజులుగా ఆందోళన ఉధృతం చేశారు. భైంసా- నిర్మల్ జాతీయ రహదారిపై మంగళవారం నుంచి నిరసనను కొనసాగిస్తున్నారు. దీంతో పెద్ద ఎత్తున ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు వాహనాలను దారి మళ్లించారు. రహదారిపైనే వంటలు చేసుకొని భోజనాలు చేశారు. అధికారులు నచ్చ చెప్పినప్పటికీ రైతులు శాంతించలేదు. నిర్మల్ ఆర్డీవో రత్న కళ్యాణి రైతులను శాంతింప చేసే ప్రయత్నం చేయడంతో రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఒక దశలో ఆర్డీవో వాహనంపై రైతులు దాడి చేశారు.
సీఎం పేషీకి ఇథనాల్ వివాదం
నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ మండలం గుండంపెల్లి గ్రామాల మధ్య నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును నిరసిస్తూ ఇరు గ్రామాల ప్రజలు ఏడాదికాలంగా ఆందోళన చేస్తున్నారు. పలుమార్లు కలెక్టర్ కార్యాలయం ముందు తమ నిరసనను తెలిపి వినతి పత్రాలను అందజేశారు. జిల్లా కలెక్టర్ అధికారులు, రైతులతో సమావేశాన్ని ఏర్పాటు చేసినప్పటికీ రైతులకు సరైన సమాధానం రాకపోవడంతో వారు ఆందోళనలను విరమించలేదు. రెండు రోజులుగా ఆందోళనను ఉధృతం చేయడంతో నిర్మల్ జిల్లా కలెక్టర్ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు.
దిలావర్‌పూర్‌లో ఉద్రిక్తత
నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ మండల కేంద్రంలో బుధవారం ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఒక దశలో పోలీసులకు ప్రజలకు తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. జిల్లా ఎస్పీ జానకి షర్మిల నేతృత్వంలో భారీగా పోలీసులను మోహరించి భద్రత ఏర్పాట్లు చేపట్టారు. రెండు రోజులుగా ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని నిరసిస్తూ రైతులు చేపట్టిన ఆందోళన ఉగ్రరూపం దాల్చడంతో పోలీసులు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆందోళన చేపట్టిన రైతులను ప్రజలను పోలీసులు అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ బుధవారం ఉదయం నుంచి రైతులు, ప్రజలు దిలావర్‌పూర్ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. న్యూస్ కవరేజ్ కోసం వెళ్లిన పాత్రికేయులను సైతం పోలీసులు అరెస్టులు, అదుపు చేయడం కనిపించింది. అరెస్టు చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలని, విడుదల చేసే వరకు ఆందోళన విరమించేది లేదని ప్రజలు తెగేసి కూర్చున్నారు. మహిళలు పురుగుమందు డబ్బాలు చేతబట్టి ఆందోళనకు దిగారు. చినికి చినికి గాలి వానలా తయారైన ఇథనాల్ ఫ్యాక్టరీ వివాదం అధికారులకు, పోలీసులకు తలనొప్పిగా తయారైంది.
పలువురి అరెస్టు
దిలావర్‌పూర్‌లో బుధవారం ఉదయం పలువురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. కోపోద్రిక్తులనై గ్రామస్తులు పోలీసులను నిలదీశారు. అడ్డుకునే ప్రయత్నం చేశారు. అరెస్టు చేసిన వారిని విడిచిపెట్టాలని పోలీసు వాహనాలపై రాళ్లతో దాడి చేసినట్లు తెలిసింది. దీంతో పోలీసుల తమ వాహనాల్లో అక్కడి నుంచి వెళ్లిపోవడం కనిపించింది. అరెస్టు చేసిన వారిని పోలీసులు సోన్, నిర్మల్ తదితర పోలీసు స్టేషన్లకు తరలించారు.