Friday, December 27, 2024

రూ. 60 వేల కోట్ల భూమి మాయం

ధ‌ర‌ణితో దండిగా తినేశారు
తెర‌పైన అధికారిక బృందం
తెర చాటున అప్ప‌టి మంత్రులు
ఇప్ప‌టికే కొన్ని భూముల వివ‌రాలు వెలుగులోకి
ప్ర‌భుత్వ భూమిని అప్ప‌నంగా అప్ప‌గించారు
ఈడీ ముందు ఫిర్యాదుల ప‌రంప‌ర‌

బీఆర్ ఎస్ హ‌యాంలో ప్ర‌భుత్వ భూముల‌న్నీ క‌బ్జాకు గుర‌య్యాయ‌ని ద‌ర్యాప్తు సంస్థ‌లు అంచ‌నా వేస్తున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కూ కొన్నిచోట్ల విచార‌ణ చేయ‌డంతో.. ల‌క్ష‌ల కోట్ల భూములు రికార్డులు మారిపోయాయని, ధరణి పోర్టల్‌ ద్వారా కొంత మంది అధికారులు ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడంతో సుమారు రూ.60 వేల కోట్ల విలువైన భూములు అన్యాక్రాంతం అయ్యాయని తాజాగా వెలుగులోకి వ‌చ్చింది. ఏకంగా రిటైర్డ్‌ రెవెన్యూ అధికారుల సంఘం దీనిపై ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా ఇప్ప‌టికే ఈడీ కూడా కొన్ని భూముల వివ‌రాల‌ను బ‌య‌ట‌కు తీసుకున్న‌ది.
గత ప్రభుత్వం భూముల రికార్డుల కోసం ప్రవేశ పెట్టిన ధరణి పోర్టల్ పై అనేక ఫిర్యాదులు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ధరణిపై సంచలన స్కామ్ బయటకు ప‌డుతున్న‌ట్లు అంచ‌నా వేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టల్‌ ను ప్రవేశ పెట్టిన తరువాత కొంత మంది రెవెన్యూ అధికారులు, ఉన్నత అధికారులు ఈ ధరణి పోర్టల్ ద్వారా అక్రమాలకు పాల్పడ్డారని.. చట్టవిరుద్ధంగా ప్రభుత్వ భూములను ప్రైవేటు సంస్థలకు, వ్యక్తులకు అప్పగించారని ఆరోపణలు వచ్చాయి.

60వేల కోట్ల భూములు మాయం
కేవ‌లం రంగారెడ్డి జిల్లాలోనే దాదాపు రూ.60 వేల కోట్ల విలువైన భూములు ప్రైవేట్ వ్యక్తుల చేతులోకి వెళ్ళాయని అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. వీటి వివ‌రాల‌ను రిటైర్డ్‌ రెవెన్యూ అధికారుల సంఘం.. ఈడీకి అప్ప‌గించింది, ఈ భూదందాపై విచారణ జరిపించాలని కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌, సీఎం రేవంత్‌ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, హైకోర్టు చీఫ్‌ జస్టిస్ తో పాటు పలు విచారణ ఏజెన్సీలకు వివ‌రాల‌తో కూడిన ప‌త్రాల‌ను పంపించారు. రంగారెడ్డి జిల్లా గుట్టల బేగంపేటలోని సర్వే నెంబ‌ర్ల‌ను చేర్చి.. ధరణి స్కామ్ ను వివ‌రించారు. దీని విలువ రూ. 60వేల కోట్లుగా అంచ‌నా వేశారు.

ఎక్కడెక్క‌డ‌..?
స‌ర్వే నెంబర్ 63లోని 42ఎకరాలు, గోపనపల్లి గ్రామంలో సర్వే నెంబర్ 124/10లో 50 ఎకరాలు, సర్వే నెంబర్ 36, 37లో 600 ఎకరాలు, హఫీజ్‌పేట సర్వే నెంబర్ 80లో 20 ఎకరాలు, మోఖిలా దగ్గర సర్వే నెంబర్ 555లో బిల్లాదాఖల భూములు 150 ఎకరాలు, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా, కూకట్‌పల్లి మండలం ఎల్లమ్మబండ(శంశిగూడ) పరిధిలో సర్వే నెంబర్ 57లో 92 ఎకరాలను చట్టవిరుద్ధంగా విక్రయించారని విజిలెన్స్‌ కమిషన్‌కు ఇచ్చిన రిపోర్ట్‌లో పేర్కొన్నారు.

అమోయ్ అండ్ టీం
బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలామంది ఐఏఎస్‌లు అడ్డగోలుగా వేల కోట్లు సంపాదించారని కాంగ్రెస్ ప్ర‌భుత్వం కూడా భావిస్తున్న‌ది. ప్ర‌ధానంగా రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ధరణిలో అడ్డూ అదుపు లేకుండా కోట్ల విలువ చేసే భూముల మాటున దోచేసిన‌ట్లు ఆరోప‌ణ‌లున్నాయి. ఈ క్రమంలోనే కమీషన్ల రూపంలో భారీగా డబ్బులు పొగు చేసుకున్నారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.. రాష్ట్రానికి చెందిన ఐఏఎస్​లపై దృష్టి పెట్టింది. ఇప్పటికే రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్‌కి నోటీసులు ఇచ్చింది. అటు అప్పటి సీఎస్​, సీసీఎల్​ఏ కమిషనర్​కు సైతం భూ దందాల్లో పాత్ర ఉందని అనుమానిస్తున్నది. భూదాన్​ భూముల్లో ఐఏఎస్​ అధికారి అమోయ్​ కుమార్​ కీలకంగా వ్యవహరించారని విచార‌ణ‌లో ఈడీ గుర్తించింది. అప్పటి ఉన్నతాధికారుల సహాకారంతో విచ్చలవిడిగా భూ దందా చేసినట్లు విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే ఈడీ ఆయనపై దృష్టి పెట్టింది. తాజాగా అమోయ్ మీద‌ మరో ఎఫ్ఐఆర్ నమోదు కానున్న‌ట్లు స‌మాచారం. ఈడీ, పోలీసుల జాయింట్ ఇన్వెస్టిగేషర్‌తో భూ ఆక్రమాలకు పాల్పడిన అధికారులు, ప్రజాప్రతినిధులను అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారనే సంకేతాలు అందుతున్నాయి. రంగారెడ్డి జిల్లా మహేశ్వ రం మండలంలోని నాగారం భూదాన్ భూముల కేసును పోలీసులు మళ్లీ రీఓపెన్ చేయనున్నారు. సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులైన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు. ప్రధానంగా అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ పేరును ఎఫ్ఐఆర్‌లో చేర్చే అవకాశాలున్నాయి. ఈ క్రమంలోనే ఈడీ అధికారులు మనీలాండరింగ్ యాక్ట్ కింద అరెస్టులకు రంగం సిద్ధం చేశారు. ఈ కేసుతో పాటు ఈడీకి అందిన 12 ఫిర్యాదుల ఆధారంగా స్థానిక పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదు చేయనున్నారు.

ఒక్కో చోట్ల వేల కోట్ల భూమి
సివిల్ నేచర్ పేరుతో క్లోజ్ చేసిన నాగారం కేసు సహా ఇలాంటి కేసుల్లో తిరిగి విచారణ ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్నది. దీనిపై సీపీ సుధీర్ బాబు కూడా గతంలోనే లీకు ఇచ్చారు. కేసు దర్యాప్తులో ఈడీ అధికారులకు పూర్తి సహకారం అందించాలని సూచించారు. దీంతో 42 ఎకరాల 33 గుంటల భూదాన్ భూములకు సంబంధించిన కేసు రికార్డులను స్థానిక పోలీసులు మళ్లీ బయటకు తీస్తున్నారు. విచారణ జరపడంతో పాటు సంబంధిత అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు. ఈ కేసును సివిల్ నేచర్ పేరిట గలేడాది మహేశ్వరం పోలీసులు క్లోజ్ చేశారు. ఈ మేరకు కోర్టుకు ఫైనల్ రిపోర్ట్ అందించారు. దీంతో మాజీ తహసీల్దార్ జ్యోతి సహా మరికొంత మంది నిందితులపై నమోదైన ఎఫ్ఎఆర్ గతేడాది ఆగస్టులో క్లోజ్ అయ్యింది. అయితే దీంట్లో అప్పటి కలెక్టర్ అమోయ్ కుమార్ పేరు ప్రస్తావనకు రాలేదు. అయితే, ఈడీ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. 181 సర్వే నెంబర్ పరిధిలోని సుమారు 43 ఎకరాల భూదాన్ భూములను అమోయ్ కుమార్ ఆదేశాల మేరకు అప్పటి తహసీల్దార్ జ్యోతి.. పలువురు రియల్టర్లు, ప్రజా ప్రతినిధులకు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసినట్టు ఈడీ గుర్తించింది.

శంకర్ హిల్స్ లో మ‌రోటి
వట్టినాగులపల్లిలో మొత్తం 33 సర్వే నెంబర్లలో 460 ఎకరాల్లో శంకర్ హిల్స్ ఉంటుంది. 3,328 ప్లాట్స్ 1983 నుంచి 1986 వరకు అమ్మకాలు జరిగాయి. కానీ, 2013లో కొంతమంది తమకు విక్రయించారని ప్లాట్స్ మీదకు వచ్చారు. ఇలా టైటిల్ వివాదంలో ఉన్న భూములకు అప్పటి రంగారెడ్డి కలెక్టర్ ఫినిక్స్, దాని అనుబంధ రియల్ ఎస్టేట్ సంస్థకు మేలు చేసేలా ప్రొహిబిటెడ్ లిస్ట్‌లో నుంచి తీసివేసి రాత్రికి రాత్రి ధరణిలో పేర్లు నమోదు చేశారని ఆరోపణలు ఉన్నాయి.

అంతా భూ దందాలే
భూదాన్ భూముల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని అనుమానిస్తున్నారు. ధరణిని అడ్డుపెట్టుకుని దందా సాగిన‌ట్లుగా విమ‌ర్శ‌లున్నాయి. దీని వెనుక కీలక పాత్రధారిగా అమోయ్ కుమార్ ఉండగా, సూత్రధారులు ఎవరనేది ఈడీ నిగ్గుతేల్చే పనిలో ఉంది. అంతేకాదు, అమోయ్ కుమార్‌కు సంబంధించిన ఫైళ్ల తారుమారు వ్యవహారాలకు సంబంధించి కూపీ లాగుతోంది. ఇలాంటి సమయంలో ఈడీకి వరుస ఫిర్యాదులు అందడం హాట్ టాపిక్‌గా మారింది. కొండాపూర్‌లోని 88 ఎకరాలకు సంబంధించి తాజాగా అమోయ్ కుమార్‌తో సహా ఐఏఎస్ నవీన్ మిట్టల్, మాజీ సీఎస్ సోమేష్ కుమార్‌పై ఈడీకి కంప్లైంట్ చేశారు. మజీద్ బండిలో సర్వే నెంబర్ 104 నుంచి 108 వరకు ఉన్న 88 ఎకరాలను బాలసాయి ట్రస్ట్‌కు ఓ కుటుంబం దానం చేసింది. దాంట్లో 42 ఎకరాలను భూపతి అసోసియేట్స్‌ అనే ప్రైవేట్ సంస్థకు బదలాయిస్తూ గత ప్రభుత్వంలో జీవో 45ని జారీ చేశారు. దీనిపై తాజాగా బాధితులు ఈడీకి ఫిర్యాదు చేశారు. తమకు చెందిన భూమికి సంబంధించి ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి అప్పటికప్పుడు జీవో ఇచ్చేసి ముగ్గురు మోసం చేశారని ఆరోపించారు. వారి దగ్గరున్న ఆధారాలను కూడా ఈడీకి సమర్పించారు.

గుట్టల బేగంపేట భూములపై..!
గుట్టల బేగంపేట భూములపై అమోయ్‌ కుమార్‌ ఇచ్చిన ఉత్తర్వుల్ని హైకోర్టు కొట్టేసింది. నిషేధిత జాబితాలో సర్వే నెంబర్‌ 63లోని 52 ఎకరాల విలువైన భూముల్ని 2022లో డీనోటిఫై చేస్తూ నాటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ ఉత్తర్వులు ఇచ్చారు. ప్రైవేట్‌ భూమిగా పేర్కొనడాన్ని సవాల్‌ చేస్తూ 2022లో హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. దానిపై ఇప్పుడు తీర్పు వచ్చింది. నాటి కలెక్టర్‌ అమోయ్‌ కుమార్‌ ఉత్తర్వుల్ని అప్పుడు న్యాయస్థానం తప్పుబట్టింది.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com