రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నది. స్కిల్ యూనివర్సిటీకి అదానీ గ్రూప్ తరపున ఇచ్చిన రూ. 100 కోట్ల విరాళాన్ని తిరిగి ఇచ్చింది. దీనిపై ఆదివారం ప్రీతి అదానీ (అదాని ఫౌండేషన్ ఛైర్మెన్)కి ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జయేష్ రంజన్ లేఖ రాశారు.
ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదవటం ఇప్పుడు దేశంలో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో.. గౌతమ్ అదానీతో రేవంత్ రెడ్డి సర్కార్ చేసుకున్న వ్యాపార ఒప్పందాలు, తెలంగాణలో అదానీ పెట్టుబడులు, ఇచ్చిన విరాళాల గురించి కూడా తెలంగాణలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈనేపథ్యంలోనే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో అదానీ పెట్టుబడులు, సర్కారుతో వ్యాపాల ఒప్పందాలపై మాట్లాడిన ఆయన.. చట్టానికి లోబడే వ్యాపారాలను తెలంగాణలో అనుమతి ఇస్తామని, అది అదానీ అయినా అంబానీ అయినా సరే అంటూ వ్యాఖ్యానించారు. అదానీపై వస్తున్న అవినీతి ఆరోపణలు నిజమేనని నిరూపితమైతే.. తెలంగాణలో ఆయన పెట్టుబడులపై పునరాలోచన చేస్తామని కామెంట్స్ చేశారు.
రాష్ట్రంలో అదానీకి ఇప్పటి వరకు ఇంచు భూమి కూడా కేటాయింపులు చేయలేదు. కానీ, స్కిల్ యూనివర్సిటీకి అదానీ రూ.100 కోట్ల విరాళం ఇచ్చారు. ఇటీవల అదానీపై కేసు నమోదవడం, దేశ వ్యాప్తంగా చర్చగా మారిన నేపథ్యంలో ఈ విరాళాన్ని తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆమోదం చెప్పడం లేదు. అంతేకాకుండా ఇప్పటికే అదానీ వ్యవహారంలో చాలా విమర్శలు వస్తున్నాయి. గతంలోనూ తెలంగాణలో అదానీ కార్యకలాపాలు సాగాయని, అప్పుడు అదానీ డబ్బులు కొందరికి వ్యక్తిగతంగా ముట్టాయని ప్రచారం జరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే అదానీ విరాళాన్ని ప్రభుత్వం తీసుకునేందుకు నిరాకరిస్తున్నది.
తిరస్కరిస్తున్నాం – సీఎం రేవంత్ రెడ్డి
దేశ వ్యాప్తంగా అదానీపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆయన విరాళాన్ని తిరస్కరిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ప్రకటించారు. సీఎంగా తనకు, తన మంత్రివర్గానికి చెడ్డపేరు రావద్దని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమి అదానీపై వివాదానికి, తెలంగాణ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అంబానీ, అదానీ, టాటా ఎవరికైనా తెలంగాణ రాష్ట్రంలో వ్యాపారం చేసుకునే హక్కు ఉందన్నారు. అదానీ ఇచ్చిన రూ.100 కోట్లు.. ముఖ్యమంత్రి, మంత్రులకు ఇచ్చినట్లు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. స్కిల్ యూనివర్సిటీకి అదానీ ప్రకటించిన రూ.100 కోట్లు స్వీకరించ కూడదని తమ ప్రభుత్వం నిర్ణయించిందని ఈ సందర్బంగా ఆయన ప్రకటించారు. స్కిల్ యూనివర్సిటీకి రూ.100 కోట్లు బదిలీ చేయవద్దని అదానీ సంస్థకు తెలంగాణ ప్రభుత్వం తరఫున లేఖ సైతం రాసిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
గత కొన్ని రోజులుగా అదానీ అంశంపై తీవ్ర దుమారం రేగుతోందని సీఎం రేవంత్ గుర్తు చేశారు. అదానీ నుంచి తెలంగాణ ప్రభుత్వం.. నిధులు సేకరించినట్లు ప్రచారం జరుగుతోందన్నారు. అయితే చట్టబద్ధంగా నిర్వహించే టెండర్లలో అందరికీ సమాన అవకాశాలు ఉంటాయని ఆయన చెప్పారు. నిబంధనల మేరకే టెండర్లు పిలిచి ప్రాజెక్టులు ఇస్తున్నామని పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగానే అదానీ నుంచి పెట్టుబడులు స్వీకరించినట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. అనవసర వివాదాల్లోకి రాష్ట్ర ప్రభుత్వాన్ని లాగ వద్దని ఈ సందర్బంగా ప్రతిపక్షాలకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.