బిఆర్‌ఎస్ గొడవలోకి ప్రభుత్వాన్ని ఎందుకు లాగుతున్నారు
కాంగ్రెస్ జోలికొస్తే ఊరుకోం
పార్టీలు మారిన వారికి కండువా కప్పే సంప్రదాయాన్ని తెచ్చిందే కెసిఆర్
టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌కు కాంగ్రెస్ సీనియర్ నేత, టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తమ నాయకుడు, సిఎం రేవంత్ రెడ్డి జోలికొస్తే నాలుక కోస్తామని ఆయన హెచ్చరించారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన గాంధీ, కౌశిక్ వివాదం బిఆర్‌ఎస్ పంచాయితీ అని, కాంగ్రెస్ కార్యకర్తలను ఎందుకు రెచ్చగొడుతున్నారని ఆయన ప్రశ్నించారు. ఏదైనా పబ్లిక్ ఇష్యూ ఉంటే మాట్లాడాలి కానీ, బిఆర్‌ఎస్ గొడవలోకి ప్రభుత్వాన్ని ఎందుకు లాగుతున్నారని ఆయన నిలదీశారు. కాంగ్రెస్ జోలికొస్తే ఊరుకోమని జగ్గారెడ్డి వార్నింగ్ ఇచ్చారు. పొలిటికల్ పవర్ లేకపోవడంతో కెటిఆర్, బిఆర్‌ఎస్ నేతలకు ఏమీ అర్థం కావడం లేదని, అందుకే కెసిఆర్ ఫ్యామిలీ రోడ్లపై పడి దూకుతున్నారన్నారు.
అలాగే లోకల్- నాన్-లోకల్ కామెంట్లపై మాట్లాడుతూ 10 ఏళ్లు అధికారం అనుభవించిన తర్వాత ఇప్పుడు ప్రాంతీయవాదం అంటూ మాట్లాడడం విడ్డూరమన్నారు. అసలు పార్టీలు మారిన వారికి కండువా కప్పే సంప్రదాయాన్ని తెచ్చిందే కెసిఆర్ అని, పార్టీలు మారిన వాళ్లకి ఆయన మంత్రి పదవులు కూడా కట్టబెట్టారని జగ్గారెడ్డి గుర్తు చేశారు. అలాంటప్పుడు ఈ వివాదంలో ముందుగా సమాధానం చెప్పాల్సింది కూడా ఆయనే అని వ్యాఖ్యానించారు. అనంతరం ఇరువురి ఇళ్ల వద్ద పోలీసు బందోబస్తుపై కూడా జగ్గారెడ్డి స్పందించారు. వినాయక చవితి ఉత్సవాలు జరుగు తున్నాయని, ఇలాంటి సమయంలో పోలీసులు వినాయక ఉత్సవాలు చూసుకోవాలా? బిఆర్‌ఎస్ నేతల పంచాయతీని చూడాలా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. బిఆర్‌ఎస్ నాయకులు ఎలుగుబంటి కరిచినట్టు ప్రవర్తిస్తున్నారన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలను రెచ్చగొడితే సహించేది లేదన్నారు.
18 మంది ఎంపిలు, 25 మంది ఎమ్మెల్యేలను బిఆర్‌ఎస్‌లో…
ఖైరతాబాద్ వినాయకుడిని చూపించేవి టీవీలు ఇప్పుడు బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేల పంచాయతీలను చూపిస్తున్నాయని, ఖైరతాబాద్ వినాయకుని ప్రజలు చూడకుండా చేశారని జగ్గారెడ్డి విమర్శించారు. హరీష్ రావు నీకు బుర్ర పనిచేయడం లేదా అని జగ్గారెడ్డి మండిపడ్డారు. ఆంధ్రా ఎమ్మెల్యే లను పార్టీలోకి తీసుకున్నది మీరేనని, మీరే ఆంధ్రోళ్లకు టికెట్ ఇచ్చారని, అధికారం పోయేసరికి నిద్రపోవడం లేదని ఆయన ఎద్దేవా చేశారు.
బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేల పద్ధతి కల్లు తాగిన కోతి లెక్క ఉందని ఆయన మండిపడ్డారు. కౌశిక్ పంచాయతీ విషయంలో రేవంత్ రెడ్డికి, ఉత్తమ్‌కుమార్ రెడ్డికి మధ్య క్లారిటీ ఉందన్నారు. ఎమ్మెల్యేలకు డైరెక్ట్ కండువా కప్పిన సంస్కృతి ఉమ్మడి రాష్ట్రంలో లేదన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాతే ఇది మొదలైందని జగ్గారెడ్డి విమర్శించారు. 2014 నుంచి 18 వరకు నలుగురు ఎంపిలు, 25 మంది ఎమ్మెల్యేలు, 18 మంది ఎమ్మెల్సీలను కెసిఆర్ పార్టీలో చేర్చుకున్నారన్నారు. సీఎల్పీ విలీనం కూడా కెసిఆర్ చేశారని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కలుపుకొని విలీనం చేసేంది కెసిఆర్ అని జగ్గారెడ్డి దుయ్యబట్టారు