- ‘ఛలో గాంధీభవన్’ పేరుతో కాంగ్రెస్ రాష్ట్ర కార్యాలయం ముట్టడి
- బాధితులతో చర్చలు జరిపిన మంత్రి పొన్నం, పిసిసి అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్
- 317 జీఓ బాధితులకు అన్యాయం జరగనివ్వం
- రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
- డెడ్‌లైన్ ద్వారా సమస్యలు పరిష్కారం కావు
- పిసిసి అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్
గాంధీ భవన్ వద్ద 317 జీఓ బాధితులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే డీఎస్సీ ఫలితాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎంపికైన అభ్యర్ధులకు ఈ నెల 9వ తేదీన నియామక పత్రాలు కూడా అందజేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే 317 జీఓ బాధితులు ‘ఛలో గాంధీభవన్’ పేరుతో కాంగ్రెస్ రాష్ట్ర కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. అందులో భాగంగా బుధవారం నాంపల్లిలోని గాంధీభవన్ ఎదుట ఉపాధ్యాయులు, ఉద్యోగులు ధర్నాకు దిగారు. తమ సమస్యలకు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులతో వారు ఆందోళన నిర్వహించారు.
సిఎం రేవంత్ రెడ్డి 317 జీఓను వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు 317 జీఓను సమీక్షిస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు గడిచినా తమ సమస్య పరిష్కరించడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2024 డిఎస్సీ అభ్యర్ధులు నియామకం అయిన తర్వాత తమను సర్ధుబాటు చేసేందుకు ఖాళీలు ఉండవని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే వారి నియామకాలకు ముందే తమను స్థానికత ఆధారంగా జిల్లాలకు పంపించాలని ఉపాధ్యాయ, ఉద్యోగులు డిమాండ్ చేశారు.
గాంధీ జయంతి రోజు అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు: మంత్రి పొన్నం
గాంధీభవన్ ఎదుట నిరసన చేపట్టిన 317 జిఓ బాధితులతో మంత్రి పొన్నం ప్రభాకర్, పిసిసి అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ 317 జిఓను తీసుకొచ్చిన వారే ఇప్పుడు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. 317 జిఓ సబ్ కమిటీ సంఘం సభ్యుడిగా చెబుతున్నా 317 జీఓ బాధితులకు అన్యాయం జరగనివ్వమన్నారు. 317 జీఓ బాధితుల కోసం ప్రభుత్వం సబ్ కమిటీని వేసిందని ఆయన తెలిపారు.
పలు కారణాల వల్ల ఈ సమస్య పరిష్కారం వాయిదా పడిందని, కమిటీ అనేక అంశాలపై అధ్యయనం చేసిందని, గాంధీ జయంతి రోజు అబద్ధం ఆడాల్సిన అవసరం తనకు లేదన్నారు. 317 జీఓ సమస్య పరిష్కారం కోసం కట్టుబడి ఉన్నామని, కమిటీ సభ్యుడు శ్రీధర్ బాబు అమెరికా వెళ్లడం, అసెంబ్లీ సమావేశాల వల్ల కమిటీ సమావేశాలు జరగలేదని, బాధితులకు న్యాయం చేయాలని తమకు ఉందని, బిఆర్‌ఎస్ నాయకుల మాటలు నమ్మవద్దని మంత్రి పొన్నం తెలిపారు.
సమస్యను కచ్చితంగా పరిష్కరిస్తాం: పిసిసి అధ్యక్షుడు
త్వరలోనే 317 జీఓ సమస్యను పరిష్కరిస్తామని పిసిసి అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ హామీ ఇచ్చారు. 317 జీఓపై ప్రభుత్వం దృష్టి సారించిందని ఆయన స్పష్టం చేశారు. మంత్రి దామోదర రాజనర్సింహ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఉపసంఘం వేసిందన్నారు. 2021 డిసెంబర్‌లో ఈ జీఓను అప్పటి బిఆర్‌ఎస్ ప్రభుత్వ తీసుకొచ్చిందని, సమస్యను తాము పరిష్కరిస్తామని పిసిసి అధ్యక్షుడు వారికి హామీ ఇచ్చారు. మీ సమస్యలన్నీ నాకు తెలుసు.
ఒకదాని వెనుక ఒకటి మీ సమస్యలను పరిష్కరిస్తాం. కొత్త టీచర్ ఉద్యోగాలతో మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. కెటిఆర్ లాగ తాము మాట ఇవ్వమని ఇస్తే తాము మాట తప్పమని ఆయన పేర్కొన్నారు. శాంతియుతంగా నిరసనలు చేస్తున్నారు, తాము వద్దని అనుకోవడం లేదన్నారు. ప్రతిపక్షం ఉండాలని తాము కోరుకుంటున్నామని, డెడ్‌లైన్ ద్వారా సమస్యలు పరిష్కారం కావన్నారు. నేడు దామోదర రాజనర్సింహను కలవండి మీ సమస్య పరిష్కారం అవుతుందని పిసిసి అధ్యక్షుడు వారికి హామీనిచ్చారు.