Monday, May 20, 2024

జూన్ 4వ తేదీన ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంది

కేంద్రంలో అధికారంలోకి రాగానే రైతులకు మద్ధతు ధర

ఆగస్టు 15వ తేదీ నాటికి రెండు లక్షల రుణమాఫీ

అధికారంలోకి వస్తే మహిళలను లక్షాధికారులను చేస్తాం

డిగ్రీ చదివిన ప్రతి ఒక్క నిరుద్యోగికి శిక్షణ ఇస్తాం

నిరుద్యోగులకు శిక్షణ భృతి కింద రూ.8500లు అందచేస్తాం

నర్సాపూర్, సరూర్‌నగర్ జనజాతర సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ

దేశంలో జూన్ 4వ తేదీన ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని, ఆగస్టు 15వ తేదీన నాటికి 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతులకు మద్ధతు ధర గ్యారంటీగా ఇస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ హామీనిచ్చారు. గురువారం నర్సాపూర్, సరూర్‌నగర్‌లో జరిగిన జనజాతర సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ అధికారంలోకి వస్తే ఉపాధి హామీ కూలీ వేతనం రోజుకు రూ.400 వందలకు పెంచుతామని, ఆగస్టు 15 నాటికి రెండు లక్షల రుణమాఫీ జరుగుతుందని, మద్ధతు ధరను చట్టబద్ధత చేస్తామని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రజలకు ఏం కావాలో ఢిల్లీలో తాను చేసి పెడతానని ఆయన హామీనిచ్చారు. తాము అధికారంలోకి వస్తే మహిళలను లక్షాధికారులను చేస్తామని రాహుల్ హామీ ఇచ్చారు.

మహిళల అకౌంట్‌లో లక్ష రూపాయలు వేస్తాం

మహిళల అకౌంట్‌లో లక్ష రూపాయలు వేస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ తెలిపారు. ప్రపంచంలో ఏ ప్రభుత్వం కూడా ఇలా చేయలేదని విప్లవాత్మకమైన మార్పునకు తాము శ్రీకారం చూడతున్నామన్నారు. నిరుద్యోగుల కోసం తాము అద్భుతమైన పథకాన్ని తీసుకువస్తున్నామని రాహుల్ తెలిపారు. డిగ్రీ చదివిన ప్రతి ఒక్కరికి శిక్షణ ఇచ్చి ఉద్యోగం కల్పిస్తామన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే వరకు శిక్షణ భృతి కింద రూ.8500లను అందిస్తామని రాహుల్ హామీనిచ్చారు. ప్రభుత్వ కాలేజీలు, వర్సిటీల్లో ఈ ప్రక్రియ ఉంటుందన్నారు. దేశంలోని పేదల జాబితా తయారు చేస్తామని ఇందుకోసం తెలంగాణలో ప్రతి గ్రామానికి వెళ్తామని, రైతులు, కూలీలు, దళితులు, ఆదివాసీల జాబితాను కూడా తయారు చేస్తామని, ప్రతి కుటుంబం నుంచి ఒక మహిళ పేరును ఎంపిక చేసి ఆ మహిళ ఖాతాలో రూ లక్ష వేస్తామని, ఇలా ప్రతి నెలా రూ. 8,500ల చొప్పున జమ చేస్తామని రాహుల్ తెలిపారు.

ప్రజల సొమ్ము 25 మందికి పంచిన మోడీ

బిజెపి గెలిస్తే రాజ్యాంగం రద్దు చేస్తారని, భారత రాజ్యాంగం కేవలం పుస్తకం కాదని, అది పేద ప్రజల చప్పుడని రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. రిజర్వేషన్లు వచ్చింది మన రాజ్యాంగం వల్లేనని, ప్రజలకు అధికారం ఇచ్చింది ఈ రాజ్యాంగమేనని, ఈ రాజ్యాంగం కోసం అంబేద్కర్, గాంధీ, నెహ్రూ లాంటి వాళ్లు తమ చెమటను, రక్తాన్ని దారపోశారని ఆయన అన్నారు. ఎందరో త్యాగాల ఫలితంగా రూపుదిద్దుకున్న రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ రక్షిస్తుందని ఆయన పేర్కొన్నారు. బిజెపి నేతలు రాజ్యాంగాన్ని సమూలంగా మార్చేస్తామని చెబుతున్నారని, ఈ ఎన్నికలు రెండు అలయన్స్ ల మధ్య జరుగుతున్నాయని రాహుల్ తెలిపారు. ఒకటి రాజ్యాంగాన్ని రక్షించే ఇండియా సమూహమని, రెండోది రాజ్యాంగాన్ని మార్చేయాలనుకునే ఎన్డీఏ అని ఆయన పేర్కొన్నారు. ప్రాథమిక హక్కులన్నీ మనకు రాజ్యాంగం ద్వారానే లభించాయని, అలాంటి రాజ్యాంగాన్ని మార్చితే తాము ఊరుకోబోమని రాహుల్ హెచ్చరించారు. అదానీ, అంబానీ లాంటి 25 మంది కోసం మోడీ రాజ్యాంగాన్ని నడిపారని, ప్రజలకు చెందిన లక్షల కోట్లను పెట్టుబడి దారులకు మోడీ పంచారని ఆయన ఆరోపించారు. పదేళ్ల పాటు ప్రధాని మోడీ అదానీ కోసం పనిచేశారని, దేశంలో విమానాశ్రయాలు, పోర్టుల, ప్రభుత్వ రంగ సంస్థలను ఆదానీకి కట్టబెట్టారని రాహుల్ ఆరోపించారు. దేశంలో సంపదకు కొదవలేదని, ఇన్ని రోజులు ప్రజల డబ్బులను మోడీ పెట్టుబడిదారులకు పంచారన్నారు. మేనిఫెస్టోలో పెట్టిన అన్ని అంశాలను అమలు చేస్తామని, తప్పుడు నిర్ణయాలతో మోడీ నిరుద్యోగం పెంచారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

రెండు సిద్ధాంతాల మధ్య ఈ ఎన్నికలు…

ఈ ఎన్నికలు రెండు సిద్ధాంతాల మధ్య జరుగుతున్నాయని రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. ఒక వైపు రాహుల్ గాంధీ, సోనియాగాంధీ , ఖర్గే , రేవంత్ రెడ్డిలు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఆదివాసీలు, గిరిజనులు, వెనుకబడిన వర్గాల కులగణనను చేస్తే నిజాలు బయటకు వస్తాయని రాహుల్ తెలిపారు. దేశంలో యాభై శాతం మంది ఓబిసిలు, 15 శాతం మంది దళితులు, 8 శాతం ఆదివాసీలున్నారని రాహుల్ తెలిపారు. 15 శాతం మైనార్టీలు, 8 శాతం జనరల్ కేటగిరీ ఉన్నారని, వీరిని కలిపితే మొత్తం 90 శాతం అవుతుందన్నారు. దేశంలో తొంభై శాతం ఉన్న ఆదివాసీలు, వెనుకబడిన వర్గాలకు ప్రాతినిధ్యం లేదన్నారు. అందులో భాగంగానే దేశంలో కులగణన చేయాలన్నదే తమ సంకల్పం అన్నారు. దేశంలో వెనుకబడిన వర్గాల వారి శక్తి ఎంతో తేలాల్సి ఉందన్నారు. కులగణన తర్వాత దేశంలో రాజకీయ చైతన్యం వస్తుందని, దేశంలో తొంభై శాతం సంపద రెండు శాతం మంది దగ్గర ఉందని, దేశాన్ని వారే శాసిస్తున్నారని రాహుల్ తెలిపారు.

చారిత్రాత్మక రాజకీయ చైతన్యానికి కాంగ్రెస్ శ్రీకారం

చారిత్రాత్మక రాజకీయ చైతన్యానికి కాంగ్రెస్ శ్రీకారం చుట్టబోతుందని రాహుల్ తెలిపారు. పేదల స్వప్నాన్ని సాకారం చేసి చూపెట్టబోతున్నామని రాహుల్ తెలిపారు. ప్రపంచంలో ఏ దేశంలో ఇలాంటి ప్రయత్నం ఇప్పటివరకు చేయలేదన్నారు. ఒక్క దెబ్బతో దేశంలో పేదరికాన్ని నిర్మూలించ బోతున్నామన్నారు. ప్రధాని మోడీ దేశంలో కోట్లాది మందిని నిరుద్యోగులు గా మార్చారని, మొదటి ఉద్యోగం పక్కా అన్న నినాదంతో ముందుకు వస్తున్నామని రాహుల్ గాంధీ తెలిపారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ఎన్నికల కోడ్ ముగియగానే జిల్లాల పునర్విభజన సరైనదేనా..?

Most Popular