Saturday, May 4, 2024

ఇండియన్ రైల్వే, ఐఆర్‌సిటిసిల ఆధ్వర్యంలో రైల్వే ప్రయాణికుల కోసం చవకైన భోజనం

  • దక్షిణమధ్య రైల్వే పరిధిలోని 12 రైల్వే స్టేషన్లలో, 18 కౌంటర్ల ద్వారా పరిశుభ్రమై భోజనం అందచేత
  • రూ . 20లకు ఎకానమీ మీల్స్, రూ.50 లకు స్నాక్ మీల్స్ అందజేత

వేసవి కాలంలో ప్రయాణికుల కోసం సరసమైన ధరలో ఆహారాన్ని భారతీయ రైల్వేలు అందిస్తున్నాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఈ భోజనాన్ని 12 రైల్వేస్టేషన్లలో 18 కౌంటర్ల ద్వారా అందిస్తున్నామని రైల్వే అధికారులు తెలిపారు. ఇది ముఖ్యంగా ప్లాట్‌ఫాంల వద్ద జనరల్ కోచ్‌ల వద్ద రైలు ప్రయాణికుల కొరకు సరసమైన, నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని (ఎకానమీ మీల్స్ ) ఆందజేస్తున్నామని రైల్వే అధికారులు తెలిపారు. భారతీయ రైల్వేలు, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సిటిసి) సంయుక్తంగా ప్రయాణికులకు నాణ్యమైన, సరసమైన, పరిశుభ్రమైన భోజనాన్ని అందించాలన్న ఉద్దేశంతో ఈ ఎకానమీ మీల్స్‌ను ప్రవేశపెట్టాయి.

ఇందులో భాగంగా వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని రైలు ప్రయాణికులకు ముఖ్యంగా జనరల్ కోచ్‌లో ప్రయాణించే వారికి సరసమైన ధరలో రెండు రకాల భోజనాన్ని అందిస్తున్నామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం భారతీయ రైల్వేలో ఈ భోజన సదుపాయం 100కి పైగా స్టేషన్‌లలో దాదాపు 150 కౌంటర్ల ద్వారా అందిస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఇందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని హైదరాబాద్, విజయవాడ, రేణిగుంట, గుంతకల్, తిరుపతి, రాజమండ్రి, వికారాబాద్, పాకాల, ధోన్, నంద్యాల, పూర్ణ, ఔరంగాబాద్ మొదలైన 12 రైల్వే స్టేషన్లలో, 18 కౌంటర్ల ద్వారా ప్రయాణికులకు ఈ ఎకానమీ మీల్స్ అందిస్తున్నారు.

ఎకానమీ భోజనం, స్నాక్ మీల్స్….
దీనిని రెండు రకాలుగా అందిస్తున్నారు. అందులో మొదటిది రకం ఎకానమీ భోజనం ఇందులో ప్రయాణికులకు రూ . 20లకు సంతృప్తికరమైన చవకైనా భోజనం అందిస్తారు. రెండోవది స్నాక్ మీల్స్. ఇందులో ప్రయాణికులకు రూ . 50ల ధరతో స్నాక్ మీల్స్ అందిస్తారు. ఈ భోజనం నీటి పాక్కెట్ల లభ్యత ప్లాట్‌ఫాంలపై సాధారణ సెకండ్ క్లాస్ (జిఎస్) కోచ్‌ల దగ్గర ప్రయాణికులు సులభంగా కొనుగోలు చేసే వీలుగా అందచేస్తున్నారు. తద్వారా ప్రయాణికులు ఈ కౌంటర్ల నుంచి నేరుగా ఈ ఎకానమీ మీల్స్‌ను కొనుగోలు చేయవచ్చు. దీని ద్వారా ప్రయాణికులు తమ ప్రయాణానికి ముందు భోజనం కొనుగోలు చేసేందుకై స్టేషన్ వెలుపల ఉన్న ఆహార విక్రయ కేంద్రాల కోసం వెతకాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు.

భారతీయ రైల్వేలో మొదటగా, ఈ సేవలు గత సంవత్సరం దాదాపు 51 స్టేషన్‌లలో ప్రయోగాత్మకంగా విజయవంతంగా అమలు చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ చొరవలో భాగంగా ప్రస్తుతం 100 స్టేషన్‌లలోని దాదాపు 150 విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. భవిష్యత్ లో ఈ పథకాన్ని మరిన్ని స్టేషన్లకు విస్తరించే ప్రణాళికలు చేస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ఎకానమీ భోజన సదుపాయం సాధారణ ప్రయాణికులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయని ఆయన తెలిపారు. దక్షిణ మధ్య రైల్వేలోని 12 స్టేషన్లలో ఇప్పటికే అందుబాటులోఉన్న ఐఆర్‌సిటిసి కిచెన్ యూనిట్ల ద్వారా ఈ భోజనం అందిస్తున్నామని ఆయన తెలియజేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular