టాలీవుడ్ అగ్ర హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగు సినీ పరిశ్రమ నందమూరి బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవ వేడుకను అట్టహాసంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు తరలివచ్చి నందమూరి బాలకృష్ణ నట జీవితం, ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంధ్రశేఖర్, ఏంపీ భరత్. మెగాస్టార్ చిరంజీవి, ఏపీ సినిమాటోగ్రఫీ మంతి కందుల దుర్గేశ్, మోహన్ బాబు, వెంటకటేశ్, అలనాటి నటి సుమలత. కన్నడ నటుడు శివరాజ్ కుమార్, మంచు విష్ణు, రానా, నాని, విజయ్ దేవరకొండ, దర్శకుడు అనిల్ రావిపూడి, డైరెక్టర్ బుచ్చిబాబు, దర్శకుడు బోయపాటి శ్రీను, నటుడు సిద్దు జొన్నలగడ్డ, అల్లరి నరేశ్, అడివి శేష్ తదతరులు కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్బంగా మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బాలయ్య బాబు 50 సంవత్సరాల వేడుకలో పాలు పంచుకోవడం చాలా ఆనందంగా ఉందన్న చిరు.. ఇది బాలకృష్ణకు మాత్రమే కాదు, తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఒక వేడుక అని అన్నారు. అరుదైన రికార్డు బాలయ్య సొంతం చేసుకున్నందుకు సంతోషంగా ఉందన్న చంరిజీవి.. ఎన్టీఆర్‌కు ప్రజల మదిలో ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు. ఆయన కుమారుడిగా బాలకృష్ణ తండ్రి చేసిన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించడం మామూలు విషయం కాదని.. తండ్రికి తగ్గ తనయుడిగా ఆయన తన ప్రత్యేకత చాటుకున్నారని కొనియాడారు. సాధారణంగా అభిమానులు గొడవలు పడుతుంటారని, హీరోల మధ్య ఎటువంటి మంచి బంధం ఉంటుందో తెలియడం కోసం కొన్ని వేడుకలు చేసుకునేవాళ్లమని చంరిజీవి గుర్తు చేసుకున్నారు. అందుకే మా అభిమానులు కూడా కలిసి కట్టుగా ఉంటారని.. మా ఇంట్లో ఎటువంటి శుభకార్యం జరిగినా బాలయ్య బాబు వస్తారని చెప్పారు చిరంజీవి.
అంతే కాదు మాతో కలిసి సరదాగా డ్యాన్స్ కూడా చేస్తారని చెప్పుకొచ్చారు. 50 సంవత్సరాల ఈ ప్రయాణంలో ఇంకా హీరోగా నటించే ఘనత ఒక్క బాలయ్యకే సొంతమని పొగడ్తలతో ముంచెత్తారు చిరంజీవి. భగవంతుడు ఆయనకు ఇదే శక్తిని ఇస్తూ 100 ఏళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుడిని కోరుకుంటున్నానని చెప్పారు. రాజకీయ, వైద్య రంగాలలో ఇలా సేవ చేయడం న భూతో న భవిష్యత్.. మేమంతా ఒక కుటుంబంలాంటి వాళ్లం.. ఫ్యాన్స్ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నానని అన్నారు చిరంజీవి. తాను ఇంద్ర సినిమా చేయడానికి బాలకృష్ణ సమరసింహారెడ్డి మూవీనే ఆదర్శమని చిరంజీవి అన్నారు. బాలకృష్ణతో కలిసి ఒక ఫ్యాక్షన్ మూవీ చేయాలని ఉందని తన మనసులో మాటను బయటపెట్టారు. చిరంజీవి ఈ మాట చెప్పగానే సినీ ప్రముఖులతో పాటు అభిమానులంతా కేరింతలు కొట్టారు. ఇక వేడుకకు వచ్చిన సినీ, రాజకీయ ప్రముఖులు బాలయ్య బాబుతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.