Saturday, May 4, 2024

అటవీశాఖ భూమి కబ్జా కాకుండా సిఎం రేవంత్ చర్యలు

  • ప్రైవేటు భూమిగా కోర్టులకు తప్పుడు అఫిడవిట్‌లను సమర్పించిన
  • కలెక్టర్, రెవెన్యూ అధికారులపై చర్యలు చేపట్టాలని సిఎం రేవంత్ ఆదేశం
  • సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా అధికారులపై చర్యలు చేపట్టడానికి ప్రభుత్వం సిద్ధం
  • 106 ఎకరాల అటవీశాఖ భూమిపై పూర్తి స్థాయి విచారణకు ప్రభుత్వం ఆదేశం

విలువైన అటవీ భూములను గత ప్రభుత్వంలో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేలా తప్పుడు నివేదికలిచ్చిన బాధ్యులపై విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు తీర్పునివ్వడంతో దానికి అనుగుణంగా బాధ్యులైన అధికారులపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో ఐఏఎస్‌కు పాత్ర కూడా ఉండటంపై సిఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలిసింది. ప్రస్తుతం సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఎంతమంది అధికారులపై చర్యలు ఉంటాయన్నది త్వరలో తేలే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో ఈ వ్యవహారం ఎవరి మెడకు చుట్టుకుంటుందన్న విషయమై ఉత్కంఠ నెలకొంది. ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన వెంటనే ఈ భూమి కబ్జా అయ్యిందన్న విషయం తన దృష్టికి రావడంతో ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. వెంటనే సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేయించి కేసు గెలిచేంత వరకు న్యాయపోరాటం చేయాలని అధికారులను ఆదేశించారు. సిఎం రేవంత్ జోక్యంతో సుప్రీంకోర్టులో జిల్లా కలెక్టర్ సమర్పించిన అఫిడవిట్ ఉపసంహరింపజేశారు. ఈ భూమి రిజర్వు ఫారెస్ట్‌కు చెందినదేనని ఫిబ్రవరి 8 వ తేదీన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అఫిడవిట్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు రెండు రోజుల క్రీతం ఈ కేసులో తీర్పు వెలువరించింది. ఈ భూమి అటవీ శాఖకు చెందుతుందని స్పష్టం చేసింది.

106 ఎకరాల భూమి వివరాలు ఇలా…
భూపాలపల్లి జిల్లా కొంపల్లి గ్రామ పరిధిలో రిజర్వ్ ఫారెస్ట్ లో ఉన్న 106 ఎకరాల భూమిపై హక్కులు తనవేనని ఇరవై ఏళ్ల క్రితం ప్రైవేటు వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. 1994లోనే వరంగల్ ఉమ్మడి జిల్లా కోర్టు అటవీ శాఖకు అనుకూలమైన తీర్పునిచ్చింది. తర్వాత ఆక్రమణదారుడు హైకోర్టును ఆశ్రయించినప్పటికీ అదే తీర్పు వెలువడింది. 2021లో బిఆర్‌ఎస్ హయాంలో ఈ కేసుపై హైకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలైంది. దీని ప్రకారం అప్పుడు ఆ ప్రైవేటు వ్యక్తికి చెందిందని కోర్టు తీర్పునిచ్చింది. అటవీ శాఖ పట్టించుకోకపోవటంతో ఆక్రమణదారుడు తిరిగి కంటెప్ట్ ఆఫ్ కోర్టు కూడా దాఖలు చేశారు.

ఆక్రమణదారులతో చేతులు కలిపిన అధికారులపై విచారణ
ఈ వ్యవహారంపై హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ అటవీ శాఖ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. దానికి భిన్నంగా అక్కడి జిల్లా కలెక్టర్ ప్రభుత్వ అనుమతి లేకుండానే సుప్రీంకోర్టులో రిజాయిండర్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఆ భూమి సదరు ప్రైవేటు వ్యక్తికి చెందుతుందని, హైకోర్టు ఇచ్చిన తీర్పునకు అనుకూలంగా ఈ అఫిడవిట్ తయారు చేసి సమర్పించారు. రెండు ప్రభుత్వ విభాగాలు పొంతన లేకుండా భిన్నమైన అఫిడవిట్లు సమర్పించటంపై అభ్యంతరం తెలిపిన సుప్రీంకోర్టు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి వివరణ కోరింది. ప్రైవేటు వ్యక్తులకు అనుకూలంగా అఫిడవిట్లు దాఖలు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. గత ప్రభుత్వం చర్యలను ఖండించిన సుప్రీంకోర్టు ఆక్రమణదారుకు, ప్రభుత్వానికి రూ.5 లక్షల జరిమానా విధించింది. ఆక్రమణదారులతో చేతులు కలిపిన అధికారులపై విచారణ జరిపి, వారి నుంచి జరిమానాను రికవరీ చేయాలని దానిపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.

గత ప్రభుత్వంలో ఇద్దరు డిఎఫ్‌ఓల బదిలీ
ఈ వ్యవహారంలో ఒక బిఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే ఒత్తిడి చేయడంతోనే ఆ జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులు ఆక్రమణదారులతో చేతులు కలిపి తప్పుడు నివేదికలు తయారు చేసినట్లుగా ప్రస్తుతం ప్రభుత్వ విచారణలో గుర్తించింది. తమకు అడ్డు లేకుండా నివేదికలు తయారు చేయించేందుకు అప్పట్లోనే ఇద్దరు డిఎఫ్‌ఒలను కూడా రాజకీయ జోక్యంతో బదిలీ చేయించినట్లుగా తేలింది. దాదాపు రూ.380 కోట్ల విలువైన అటవీ భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేలా గత ప్రభుత్వం పథకం పావులు కదిపినట్టుగా ప్రభుత్వం గుర్తించింది. అటవీ శాఖ అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ ఏకంగా కబ్జాదారులకు అనుకూలంగా సుప్రీంకోర్టుకు కొందరు అధికారులు తప్పుడు నివేదికలు ఇచ్చినట్టుగా ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో వెల్లడయ్యింది. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన హోదాలో ఉన్న భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కబ్జాదారులతో చేతులు కలపటం, వారికి లబ్ధి చేసేందుకు ఏకంగా సుప్రీం కోర్టులో తప్పుడు అఫిడవిట్ దాఖలు చేయటం ఐఏఎస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular