విపక్షాల విమర్శలను దీటుగా ఎదుర్కోవాలి
ప్రతీ విషయంలో పూర్తి అవగాహన పెంచుకోండి..
అసెంబ్లీ సమావేశాలకు విధిగా హాజరు కావాలి
కొందరి వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు రావొద్దు..
సిఎల్‌పి భేటీలో సీరియస్ అయిన సిఎం రేవంత్
అసెంబ్లీ సమావేశాలకు అందరు ఎమ్మెల్యేలు తప్పనిసరిగా హాజరు కావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ప్రతిపక్షాలు గందరగోళం చేసేందుకు ప్రయత్నిస్తాయని, సంయమనంతో వ్యవహరించాలని సీఎం సూచించారు. అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని పలు సూచనలు చేశారు. సభలో వ్యవహరించాల్సిన విధానంపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. ప్రజా ప్రభుత్వంలో ఇవి రెండో పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలని, అత్యంత కీలకమైనవిగా సీఎం స్పష్టం చేశారు. ఈ 15నెలల్లో ప్రజా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై పూర్తిగా చర్చించుకునేందుకు ఈ సమావేశాల్లో అవకాశం ఉందన్నారు.
రాజకీయాలు అంటే పిల్లలాటలు కాదు..
సభ్యులందరూ కచ్చితంగా రావాల్సిందేనని, ప్రతిపక్షాల విమర్శలను దీటుగా ఎదుర్కోవాలన్నారు. సమావేశాల్లో సభ్యులంతా సమన్వయంతో ముందుకెళ్లాలన్నారు. అంశాల వారీగా ప్రిపేర్ అయి సభకు రావాలని తెలిపారు. సభ్యుల హాజరుపై ప్రభుత్వ విప్‌లు పర్యవేక్షించాలని సూచించారు. కొందరు ఎమ్మెల్యేలు అసెంబ్లీని నిర్లక్ష్యం చేస్తున్నారని ఈ సందర్భంగా సీఎం అసహనం వ్యక్తం చేశారు. హాజరైతేనే సభలో ఏం జరుగుతుందో తెలుస్తుందన్నారు.
సీఎల్పీ భేటీలో మాట్లాడుతుండగా బయటకు వెళ్లిన నాగార్జునసాగర్ ఎమ్మెల్యే జయవీర్‌పై సీఎం అసహనం వ్యక్తం చేశారు. కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ’చాలామంది సీరియస్ గా పనిచేయట్లేదు. ఒకసారి గెలవడం గొప్పకాదు. మరోసారి అసెంబ్లీకి రావడమే గొప్ప. చాలా మంది బీఆర్‌ఎస్ పట్ల సైలెంట్ గా ఉంటున్నారు. వాళ్ల గురించి నాకు బాగా తెలుసు. రాజకీయాల్లోకి వొచ్చిన తర్వాత అన్నింటికీ ధైర్యంగా ముందుకెళ్లాలి’ అంటూ చెప్పుకొచ్చారు సీఎం రేవంత్. మీటింగ్ మధ్యలో నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జయవీర్ బయటకు వెళ్లడంపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు.
’ఓ వైపు నేను ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే అతనేంటి అలా వెళ్తున్నారు. ఇంత నాన్ సీరియస్ గా ఉంటే ఎలా.. మనం మరోసారి గెలవాలంటే చాలా సీరియస్ గా పనిచేయాల్సిందే. రాజకీయాలు అంటే పిల్లలాటలు కాదు. అందరం కలిసి పనిచేస్తేనే మరోసారి మన ప్రభుత్వం వొస్తుంది. కొందరి వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు రావొద్దు. ఇక నుంచి అందరూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాలి. వొచ్చే నెల 6వ తేదీ నుంచి అన్ని జిల్లాల ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి లంచ్ మీటింగ్ పెట్టుకుందాం. అందరి పనితీరుపై చర్చిద్దాం’ అంటూ సీరియస్ గా క్లాస్ తీసుకున్నారు.