ఈ ఆశీర్వాదం తమ ఆత్మస్థైర్యాన్ని పెంచింది
మరింత సమర్ధవంతమైన పాలన అందించడానికి ఉత్సాహానిచ్చింది
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల పాలనను ఆశీర్వదిస్తూ ఎనిమిది లోక్ సభ స్థానాలతో పాటు కంటోన్మెంట్ శాసన సభ ఉపఎన్నికల్లో విజయం చేకూర్చిన రాష్ట్ర ప్రజలకు సిఎం రేవంత్‌రెడ్డి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు అందించిన ఈ ఆశీర్వాదం తమ ఆత్మస్థైర్యాన్ని పెంచిందన్నారు. మరింత సమర్ధవంతమైన పాలన అందించడానికి ఉత్సాహానిచ్చిందన్నారు. ప్రజల మద్ధతు కాంగ్రెస్ పార్టీకే ఉందన్న విషయాన్ని ఈ ఎన్నికల ఫలితాలు మరోసారి రుజువు చేశాయని ఆయన తెలిపారు.
కాంగ్రెస్ విజయం కోసం పని చేసిన కార్యకర్తలు, నాయకులు, శ్రేయోభిలాషులకు ఆయన అభినందనలు తెలిపారు. ఇది కార్యకర్తల విజయమని వారి శ్రమ, కష్టాన్ని పార్టీ గుర్తిస్తుందన్నారు. రేపటితో ఎన్నికల కోడ్ ముగుస్తోందని, మళ్లీ ప్రజా ప్రభుత్వ పాలన మొదలవుతుందని సిఎం రేవంత్ తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా అద్భుతమైన పాలన అందిస్తామని ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ప్రజా పాలన ఉంటుందని ఆయన తెలిపారు.