నేటి నుంచి క్రోధి నామ సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు శుభం కలగాలని, ప్రజల ఆశలు ఆకాంక్షలన్నీ నెరవేరాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. కొత్త సంవత్సరంలో కాలం కలిసి రావాలని, సమృద్ధిగా వానలు కురిసి, రైతుల రైతుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరియాలని ముఖ్యమంత్రి అభిలాషించారు. నూతన సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మెరుగైన అభివృద్ధి సాధించి, దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. మన సంస్కృతీ, సంప్రదాయాలు చాటిచెప్పేలా ఉగాది పండుగను సంతోషంగా జరుపుకోవాలని సిఎం రేవంత్ పిలుపునిచ్చారు.
ఉగాది పండుగ సకల శుభాలను పంచాలి: డిప్యూటీ సిఎం భట్టి
రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది పండుగ సకల శుభాలను పంచాలన్నారు. ప్రజల జీవితాల్లో సుఖ శాంతులు తీసుకురావాలని, కష్టాలు, నష్టాలు తొలగి ఆనందమయ జీవితాలకు ఈ పండుగ నాంధి కావాలని ఆయన ఆకాంక్షించారు. ఇందిరమ్మ రాజ్యంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న గ్యారంటీల వల్ల లబ్ధి పొందుతున్న ప్రజల జీవితాల్లో ఆనందాలు నిండాలన్నారు. ఈ క్రోధి నామ సంవత్సరంలో సమృద్ధిగా వర్షాలు కురువాలని, పంటలు బాగా పండాలని, రైతులు బాగుండాలని, సకల వృత్తుల వారు ఆనందంగా ఉండాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసినందున నిరుద్యోగులకు ఈ ఏడాది ఉద్యోగ నామ సంవత్సరం కావాలని ఆయన అన్నారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహా, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావులు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.