8 పార్లమెంట్ స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థులు
లోక్‌సభ ఫలితాల్లో కాంగ్రెస్ సత్తా చాటింది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన హస్తం నేతలు, అదే జోష్‌తో లోక్‌సభ ఎన్నికల్లోనూ పాల్గొన్నారు. ఇందుకు అనుగుణంగానే రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు దూసుకెళ్లారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో కేవలం 3 స్థానాల్లోనే విజయం సాధించగా, ఈసారి ఆ సంఖ్య 8కి చేరింది. ఖమ్మం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియ్యంకుడు రామసహాయం రఘురామిరెడ్డి 4 లక్షల 62 వేల ఓట్ల తేడాతో సమీప ప్రత్యర్ధి, బిఆర్‌ఎస్ సిట్టింగ్ ఎంపి నామా నాగేశ్వరరావును ఓడించారు. అక్కడి నుంచి బిజెపి తరఫున బరిలో తాండ్ర వినోద్‌రావు మూడోస్థానానికే పరిమితమయ్యారు. నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్థి కుందురు రఘువీర్ రెడ్డి విజయదుందుభి మోగించారు.
సమీప ప్రత్యర్థి బిజెపికి చెందిన సైదిరెడ్డిపై 5 లక్షల 51 వేల పైచిలుకు ఓట్ల తేడాతో గెలుపొందారు. వరంగల్‌లో ఆరూరి రమేశ్ (బిజెపి) అభ్యర్థిపై కడియం కావ్య (కాంగ్రెస్) విజయ దుందుభి మోగించారు. వరంగల్‌లో కడియం కావ్య రెండు లక్షల పైచిలుకు ఓట్ల తేడాతో విజయం సాధించారు. బిజెపికి చెందిన ఆరూరి రమేశ్, బిఆర్‌ఎస్ అభ్యర్థి సుధీర్‌కుమార్ రెండు, మూడు స్థానాలకే పరిమితమయ్యారు. మహబూబాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ బిఆర్‌ఎస్ అభ్యర్థి కవితపై 3 లక్షల 24 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఘనవిజయం సాధించారు. జహీరాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్ షెట్కార్ 45 వేల పైచిలుకు ఓట్ల తేడాతో విజయం సాధించారు. భువనగిరిలో కిరణ్ కుమార్ రెడ్డి (కాంగ్రెస్) 1.95 లక్షలకు పైగా మెజార్టీతో జయకేతనం ఎగురవేశారు. నాగర్ కర్నూల్‌లో 88 వేలకు పైగా ఆధిక్యంతో మల్లు రవి (కాంగ్రెస్), పెద్దపల్లిలో 1.31 లక్షలకు పైగా మెజార్టీతో గడ్డం వంశీకృష్ణ (కాంగ్రెస్) విజయం సాధించారు.
ఖాతా తెరవని బిఆర్‌ఎస్
తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు గాను 8 సీట్లను కాంగ్రెస్ గెలుచుకోగా 8 సీట్లను బిజెపి గెలుచుకుంది. ఈ లోక్‌సభ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ ఖాతా తెరవలేదు. పోటీ చేసిన ఒక్క స్థానాన్ని ఎంఐఎం (అసదుద్దీన్ ఒవైసీ) నిలబెట్టుకున్నారు. వరుసగా ఐదోసారి హైదరాబాద్ ఎంపిగా అసదుద్దీన్ గెలిచారు. ఇక నల్గొండ, ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్, జహీరాబాద్, భువనగిరి, నాగర్‌కర్నూల్, పెద్దపల్లిలో కాంగ్రెస్ విజయం సాధించింది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మల్కాజిగిరి, సికింద్రాబాద్, మెదక్, మహబూబ్‌నగర్, చేవెళ్లలో భాజపా జయకేతనం ఎగురవేసింది.