కేంద్రంలో కాంగ్రెస్‌ను గెలిపిస్తే ప్రజల జీవితాలు బాగుపడుతాయని, కాంగ్రెస్‌ను గెలిపించి రాజ్యాంగాన్ని కాపాడాలని కాంగ్రెస్ ఎన్నారై రాజేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. గాంధీభవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బిజెపి గెలిస్తే రాజ్యాంగం మారుస్తుందని, బిజెపికి అబద్దాలు గ్యారంటీ అని, కాంగ్రెస్‌కు నిజాలు గ్యారంటీ అని, బిజెపి గెలిస్తే మళ్లీ ఎన్నికలు ఉండవని ఆయన అన్నారు. గ్రౌండ్ లెవల్ ఒపీనియన్‌తో తెలంగాణలో కాంగ్రెస్ 14సీట్లు గెలుస్తుందని ఆయన జోస్యం చెప్పారు.
మణిపూర్ ఘటనతో భారతదేశం అల్లకల్లోలం: గంపా వేణుగోపాల్
మణిపూర్ ఘటనతో భారతదేశం ఆందోళనకర పరిస్థితుల్లో ఉందని అమెరికా సైతం పేర్కొందని, దీనికి కారణం ప్రధాని మోడీనని ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ గంపా వేణుగోపాల్ ఆరోపించారు. తెలంగాణ ఇచ్చేటప్పుడు కాంగ్రెస్ విభజన హామీలను పొందు పరిచినా మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో గల్ఫ్ కమిటీ ఏర్పాటు చేస్తుందన్నారు. రాబోయే ఎన్నికల్లో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావాలని కోరుకుంటున్నామన్నారు. పది ఏళ్ల నుంచి కెసిఆర్ రుణ మాఫీ చేయకపోవడం వల్ల రైతుల సిబిల్ స్కోర్ పోయిందన్నారు.
దీంతో ఎన్నారై పిల్లలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కాంగ్రెస్ గెలిస్తే సిబిల్ స్కోర్ ను పెంచేందుకు కృషి జరుగుతుందన్నారు. ఎన్నారై కన్వీనర్, భీంరెడ్డి మాట్లాడుతూ మోడీ కరోనా సమయంలో విమానాల్లో డబుల్ చార్జీలు వసూల్ చేశారన్నారు. 19 ఏళ్లలో గల్ఫ్ కార్మికులకు, ఎన్నారైలకు బిజెపి ప్రభుత్వం ఏమీ చేయలేదన్నారు. కాంగ్రెస్ గెలిస్తే వారికి న్యాయం జరుగుతుందన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అనుకూలంగా, బిజెపికి వ్యతిరేకంగా ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు.