Wednesday, May 1, 2024

మాజీ సిఎం కెసిఆర్ జిల్లాల పర్యటనపై కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు ఫైర్

ఎన్నికల సమయంలో కెసిఆర్‌కు రైతులు గుర్తొస్తారని కాంగ్రెస్ నాయకుల ఎద్దేవా
మాజీ సిఎం కెసిఆర్ జిల్లాల పర్యటనపై కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు ఫైర్ అయ్యారు. నాలుగు నెలలుగా బయటకు రాని కెసిఆర్, ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ప్రజలను తప్పుదోవ పట్టించడానికి రైతుల పరామర్శ పేరుతో జిల్లాల పర్యటన చేయడం విడ్డూరంగా ఉందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో పర్యటనలో భాగంగా కెసిఆర్ ఆదివారం నల్లగొండ, జనగాం, సూర్యపేట జిల్లాలో పర్యటించగా ఈ పర్యటనపై ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య మాట్లాడుతూ ఎన్నికల సమయంలో మాత్రమే కెసిఆర్‌కు రైతుల కష్టాలు గుర్తుకు వస్తాయని ఆయన ఎద్దేవా చేశారు. వేల కోట్లు పెట్టి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును గంగలో కలిపి తెలంగాణను అప్పుల పాలు చేసిన ఘనత కెసిఆర్‌దేనని ఆయన విమర్శించారు. అధికారంలో ఉండి రైతులకు రుణమాఫీ చేయని కెసిఆర్ ఏ ముఖం పెట్టుకుని మళ్లీ రైతులకు దగ్గరకు పోతున్నారని ఆయన ప్రశ్నించారు.

కెసిఆర్ దేవరుప్పలకు రావడం సినిమా షూటింగ్‌లా ఉంది: ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
కెసిఆర్ దేవరుప్పలకు రావడం సినిమా షూటింగ్ లా ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి విమర్శించారు. కెసిఆర్ పర్యటనపై ఆమె మాట్లాడుతూ బిఆర్‌ఎస్ నాయకులంతా దేవరుప్పల వద్ద ఉన్న ధరావత్ తండాలోని ఒకే రైతు దగ్గరకు ఎందుకు వస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. హరీష్ రావు, యర్రబెల్లి దయాకర్ రావు అక్కడికే వచ్చారని, ఇప్పడు కెసిఆర్, తర్వాత కెటిఆర్, హిమాన్షు కూడా ఇక్కడికే వస్తారేమోనని ఆమె ఎద్దేవా చేశారు. అక్కడ ఉన్న రైతు సత్తెమ్మకు 8 ఎకరాల పొలం ఉంటే అందులో రెండు ఎకరాలు మాత్రమే వ్యవసాయం చేశారని, అందులో కూడా అర్ధ ఎకరం లోపల ఎండిపోయిందని, ఆ పొలంలో నాలుగు బోర్లు వేయడం, వీరందరూ ఒకే రైతు దగ్గరకు రావడం పలు అనుమానాలకు తావిస్తుందన్నారు.

కెసిఆర్ వీధి నాటకాలు బంద్ చేయాలి
కెసిఆర్ ఊరూరు తిరిగి వీధి నాటకాలు బంద్ చేయాలని భువనగిరి కాంగ్రెస్ ఎంపి అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కెసిఆర్ తుంగతుర్తి నియోజకవర్గం వెలుగుపల్లి కి వచ్చి ఎండిపోయిన పంటపొలాలు చూడాలనుకుంటున్నారని, మీ నాటకాలు బంద్ చేయాలని ఆయన సూచించారు. కెసిఆర్ సందర్శించాలని అనుకుంటున్నా పొలాల వద్ద ఉన్న రుద్రమదేవి చెరువుకు కేవలం 9 కిలోమీటర్ల దూరంలో బయ్యన్నవాగు ఉందని, అందులో 7 కిలోమీటర్ల మేర వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో పూర్తి అయ్యిందన్నారు. మరో రెండు కిలో మీటర్లు తవ్వితే ఈరోజు రుద్రమదేవి చెరువుకు నీళ్లు అందుతాయని పదేళ్లు అధికారంలో ఉండి రెండు కిలోమీటర్లు కాలువలు తవ్వలేక ఇప్పుడు వచ్చి పంట పొలాలు సందర్శిస్తున్నారని చామల మండిపడ్డారు. అలాగే గతంలో మీరు, మీ అల్లుడు ప్రచారాలకు వచ్చినప్పుడు మాట్లాడిన వీడియోలు చూసుకోవాలని, ఇప్పుడున్న బిజెపి అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ కూడా మీ వెంట ఉన్నారని, దానిని రిజర్వాయర్ చేసి మూడున్నర టిఎంసీల నీళ్లు తెచ్చి ఆ ప్రాంతం సస్యశ్యామలం చేస్తామని చెప్పి పదేళ్లలో ఒక్కనాడు కూడా పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు.

కెసిఆర్ పర్యటనను తప్పుబట్టిన ఎమ్మెల్యే నాయిని
కెసిఆర్ పర్యటనను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తప్పుపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కనీసం నాలుగు నెలలు కూడా కాకుండానే ఎండిపోయిన పంటల పేరుతో కెసిఆర్ రాజకీయం చేయడాన్ని ఆయన మండిపడ్డారు. ఎన్నికల కోసం కెసిఆర్ రైతుల దగ్గర ముసలి కన్నీళ్లు పెట్టుకుంటున్నారన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో 90 శాతం కలవాలని నిర్మాణం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే మిగిలిన 10 శాతం కాలువల నిర్మాణం చేసి ఉంటే ఇప్పుడు రైతుకు ఈ ఇబ్బందులు వచ్చేదా కెసిఆర్ అనాలోచిత చర్యలతోనే పాలకుర్తి రైతులకు నష్టం జరిగిందని ఆయన ఆరోపించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular