- నేడు హైదరాబాద్ రానున్న కెసి వేణుగోపాల్
- నేడు కాంగ్రెస్ నాయకులు, ఎంపి అభ్యర్థులతో కెసి సమావేశం
- మూడు పెండింగ్ సీట్లపై చర్చ
- రాష్ట్రంలో తాజా పరిస్థితిని వివరించనున్న
- కాంగ్రెస్ వ్యూహాకర్త సునీల్ కనుగోలు
- నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల బలాబలాలపై కెసి దిశానిర్ధేశం
ఎంపి ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలకు పదును పెడుతోంది. అందులో భాగంగా ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ నేడు (ఆదివారం) హైదరాబాద్ కు వస్తున్నారు. శంషాబాద్ నోవాటెల్ లో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులతో కెసి సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో సిఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపి అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, 17 లోక్‌సభ స్థానాల నియోజకవర్గం ఇన్‌చార్జీలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. కాంగ్రెస్ వ్యూహాకర్త సునీల్ కనుగోలు కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాంపై వేణుగోపాల్ స్థానిక నేతలకు దిశానిర్ధేశం చేయనున్నారు. రాష్ట్రంలో తాజా పరిస్థితిని సునీల్ కనుగోలు ఈ సమావేశంలో వివరించనున్నట్టుగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా రాష్ట్రంలో ఖమ్మం, హైదరాబాద్, కరీంనగర్ మినహా అన్ని సీట్లకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ఈ సమావేశంలో ఖమ్మం సీటుపైనా పీటముడి వీడే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. మిగతా స్థానాల్లో ఉన్న ప్రతిబంధకాలు ఏమిటీ? వాటిని ఎలా అధిగమించాలన్న అంశాలపైనే ప్రధానంగా చర్చించనున్నట్టుగా తెలిసింది.
హైకమాండ్ సూచనల మేరకు హైదరాబాద్‌లో మీటింగ్
ఇంకా అభ్యర్థులను ప్రకటించని (ఖమ్మం, హైదరాబాద్, కరీంనగర్) మూడు స్థానాలకు సంబంధించి అభ్యర్థులకు సంబంధించి తుది జాబితాను కూడా నేడు ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఢిల్లీలో జరపాల్సిన సమావేశాన్ని హైకమాండ్ సూచనల మేరకు హైదరాబాద్‌లో జరపాలని నిర్ణయించినట్టుగా తెలిసింది. ముగ్గురు పెండింగ్ అభ్యర్థులను ఖరారు చేయడానికి ఢిల్లీలోని ఏఐసిసి కార్యాలయంలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ఉన్నప్పటికీ దానికి బదులుగా ఏఐసిసి పెద్దల సూచనల మేరకు నేరుగా కెసి వేణుగోపాల్ హైదరాబాద్‌కు వచ్చి అభ్యర్థులను ఫైనల్ చేయనున్నట్టుగా తెలిసింది. ఖమ్మం. కరీంనగర్, హైదరాబాద్ నియోజకవర్గాల అభ్యర్థులను ఖరారు చేయడంతో పాటు ఇప్పటికే ఫైనల్ అయిన 14 స్థానాల అభ్యర్థులతో కెసి వేణుగోపాల్ భేటీ కానున్నట్టుగా సమాచారం.
వచ్చే నెలలో నల్లగొండ, భువనగిరిలో బహిరంగ సభలు
అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో ఊపు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ సారి లోక్ సభ సీట్లను ఎక్కువ గెలుచుకోవాలన్న లక్షంతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా ఇక్కడకు పార్టీ అగ్రనేతలను ఆహ్వానించడంతో పాటు వారితో భారీ సభలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఇటీవల తుక్కుగూడలో జరిగిన సభకు పార్టీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ హాజరై మేనిఫోస్టో తెలుగు ప్రతిని విడుదల చేసిన సంగతి తెలిసిందే. వచ్చే నెలలో నల్లగొండ, భువనగిరి పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో రెండు భారీ సభల నిర్వహణకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది.
చౌటుప్పల్ సభకు ప్రియాంకగాంధీ
నల్లగొండ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని మిర్యాలగూడలో, భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని చౌటుప్పల్‌లో ఒకే రోజు జరిగే ఈ సభకు ముఖ్య అతిథిగా ప్రియాంకగాంధీ హాజరవుతారని సిఎం రేవంత్ రెడ్డి ఇదివరకే ప్రకటించారు. రాహుల్‌గాంధీ సైతం రాష్ట్రంలో ప్రచారానికి రానున్నారు. దీనికితోడు ఏఐసిసికి చెందిన ముఖ్యనేతలు ఆయా పార్లమెంటరీ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఇప్పటికే మంత్రులు తమకు కేటాయించిన లోక్‌సభ నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో సన్నాహాక సమావేశాలు జరుగుతున్నాయి.
పార్లమెంటరీ నియెజకవర్గాల వారీగా సిఎం సమీక్షలు
పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బిజీగా మారిపోయారు. సిఎం రేవంత్ పార్లమెంటరీ నియెజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించడం, కీలక నేతల ఇళ్లకు వెళ్లి దిశానిర్ధేశం చేయడంలో బిజీగా మారారు. అదే సమయంలో వివిధ పార్టీల వారిని పార్టీలో చేర్చుకోవడంపై దృష్టి పెట్టారు. ఆయా పార్లమెంటరీ నియోజకవర్గాల్లో కీలక నేతలకు తన నివాసంలో కండువాలు కప్పుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి దోహదపడాలని సూచిస్తున్నారు. అంతర్గత సమస్యలపైనా దృష్టి సారిస్తూ కలిసి పనిచేసేలా ఒక్కతాటిపైకి తెస్తున్నారు. ఏదీ ఏమైనా భారీ మెజార్టీతో 14 సీట్లతో విజయం సాధించడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి వ్యూహాలకు పదునుపెడుతున్నారు.
ఖమ్మం సీటుపైనే ఉత్కంఠ..!
ఇదిలా ఉంటే హైదరాబాద్ స్థానం ఎంఐఎంకు కంచుకోట. మళ్లీ మజ్లిస్ నుంచి అసదుద్దీన్ బరిలో ఉన్నారు. ఈ సీటును ఈసారి ఎలాగైనా గెలవాలని బిజెపి ప్రయత్నిస్తోంది. ఇక్కడ మాధవిలతను బిజెపి పోటీలో దింపింది. ఇక బిఆర్‌ఎస్ నుంచి గడ్డం శ్రీనివాస్ యాదవ్ ( బిసి)ని బరిలోకి దింపారు. కాంగ్రెస్ కూడా బలమైన అభ్యర్థిని నిలబెట్టాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో టెన్నిస్‌స్టార్ సానియామీర్జాను బరిలోకి దింపాలని కాంగ్రెస్ చూస్తోంది. ఆమె పేరు దాదాపు ఖరారైనట్లు సమాచారం. ఇక ఖమ్మంలో గట్టి పోటీ నెలకొంది. ఇక్కడ మంత్రుల బంధువులు బరిలోకి వచ్చారు. డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క భార్య నందిని, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు, తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు పోటీ పడుతున్నారు. అలాగే మరో వ్యక్తి పేరు కూడా వినిపిస్తోంది. ఇక కరీంనగర్ సీటుపై కూడా తీవ్ర కసరత్తు చేస్తున్నారు. అయితే ఖమ్మం సీటుపైనే ఉత్కంఠ నెలకొందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.