టీఎస్, న్యూస్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ లిక్కర్ స్కామ్ సీబీఐ కేసులో శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారారు. 164 సెక్షన్ కింద ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ముందు శరత్ చంద్రారెడ్డి వాంగ్మూలం ఇచ్చారు. ఈడీ కేసులో శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారిన సంగతి తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇప్పటికే మాగుంట రాఘవ, దినేష్ అరోరా అప్రూవర్ గా మారారు. ఆ జాబితాలో శరత్ చంద్రారెడ్డి చేరారు. తెలంగాణలో భూముల కొనుగోలు లావాదేవీల వ్యవహారాల్లో శరత్ చంద్రారెడ్డిని ఎమ్మెల్సీ కవిత బెదిరించారని సీబీఐ అభియోగాలు మోపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారారు. ఈ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసింది. తీహర్ జైలులో ఉన్న కవితపై సీబీఐ కూడా విచారించి, అరెస్ట్ చేసింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కేజ్రీవాల్ కుట్రతోనే లిక్కర్ స్కాం జరిగిందని ఈడీ అభియోగాలు మోపింది.
కవితకు కష్టాలు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ నిందితుడిగా ఉన్న శరత్ చంద్రారెడ్డి.. శుక్రవారం రౌస్ అవెన్యూ కోర్టు సీబీఐ బెంచ్ జడ్జి కావేరి భవేజా ఎదుట శరత్ చంద్రారెడ్డి వాంగ్మూలం ఇచ్చారు. ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పాత్ర ఏంటో సీబీఐ.. ప్రత్యేక కోర్టుకు తెలిపింది. కవితే రూ. 100 కోట్లు చెల్లించినట్లు సీబీఐ కస్టడీ రిపోర్ట్‌లో పేర్కొంది. శరత్ చంద్రారెడ్డి .. కవిత జాగృతి సంస్థకు రూ. 80 లక్షల ముడుపులు చెల్లించినట్లు రిపోర్ట్‌లో వెల్లడించారు. డబ్బుల కోసం శరత్ చంద్రారెడ్డిని కవిత బెదిరించారని, ల్యాండ్ డీల్ చేసుకోకపోతే తెలంగాణలో బిజినెస్ ఎలా చేస్తావో చూస్తానని శరత్ చంద్రారెడ్డిని కవిత బెదిరించినట్లు కస్టడీ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. అసలు భూమే లేకుండా వ్యవసాయ భూమి కొనుగోలు చేసినట్లు అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్ పత్రాలు సృష్టించారంది. నకిలీ భూ విక్రయం పేరుతో శరత్ చంద్రారెడ్డి నుంచి రూ. 14 కోట్లు కవిత తీసుకున్నారని సీబీఐ ఆరోపించింది. స్వయంగా నిందితులంతా అప్రూవర్లు గా మారి .. బెదిరిస్తేనే డబ్బులు ఇచ్చామని చెప్పడంతో కవితకు అనేక సమస్యలు చుట్టుముట్టినట్లుగా కనిపిస్తోంది.
సౌత్ టీంలో అప్రూవర్స్
ఢిల్లీ లిక్కర్ స్కాం అనేక మలుపులు తిరుగుతోంది. వరుసగా ఒకరి తర్వాత ఒకరు అప్రూవర్లుగా మారుతున్నారు. ముఖ్యంగా సౌత్ లాబీలో సీబీఐ, ఈడీ గుర్తించిన నిందితుల్లో ఒక్క కల్వకుంట్ల కవిత తప్ప దాదాపుగా అందరూ అప్రూవర్లు అయ్యారు. అంటే.. ఒక్క కవిత మాత్రమే నిందితురాలిగా మిగిలారు. ఈ మొత్తం వ్యవహారంలో కవిత పూర్తిగా ఇబ్బందుల్లో పడబోతున్నట్లుగా అంచనా వేస్తున్నారు. ఈ స్కాంలో అరుణ్ రామచంద్ర పిళ్లై కూడా అప్రూవర్ గా మారి ఈడీకి వాంగ్మూలం ఇచ్చారు. ఈయన కవిత తరపున బినామీగా వ్యవహరంచారని ఈడీ చెబుతోంది. ఆయన కూడా గతంలో తాను కవిత బినామీనేనని అంగీకరంచారు. తర్వాత తన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకుంటానన్నారు. మళ్లీ ఇప్పుడు పూర్తిగా మనసు మార్చుకుని అప్రూవర్ గా మారారు. కవిత మద్యం బినామీ వ్యాపారం మొత్తం పిళ్లై పేరు మీదుగా సాగిందని ఈడీ, సీబీఐ చెబుతున్నాయి.
ఇప్పటికే MP Magunta Srinivasulareddy, Sarath Chandra Reddy ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, శరత్ చంద్రారెడ్డి కూడా ఈడీ ముందు అప్రూవర్లు అయ్యారు. వారిద్దరూ సౌత్ లాబీ నుంచి కీలకం. ఇక కవిత ఆడిటర్ గా పని చేసిన బుచ్చిబాబు కూడా అప్రూవర్ అయ్యారని ఈడీ వెల్లడించింది. ఆయన దగ్గర నుంచి స్టేట్ మెంట్లు కూడా మళ్లీ తీసుకున్నారు. ఇదే సమయంలో సీబీఐ విచారణ జరుగుతున్న సమయంలో శరత్ చంద్రారెడ్డి కూడా అప్రూవర్‌గా మారారు. లిక్కర్ స్కాంలో సౌత్ లాబీ పేరుతో ఉన్న గ్రూపులో ఈడీ, సీబీఐ ఉదహరించిన వారంతా అప్రూవర్లుగా మారారు. వ్యాపారం చేసినట్లుగా చెబుతున్న వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఆయన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు శరత్ చంద్రారెడ్డి కూడా చాలా రోజుల పాటు జైల్లో ఉండి.. బెయిల్ తెచ్చుకుని అప్రూవర్లుగా మారారు. ఈ కేసులో ఇక కవిత మాత్రమే అప్రూవర్ కాలేదు. దీంతో ఆమె ఒక్కరినే అందరూ కలిసి టార్గెట్ చేస్తున్నారా అన్న అనుమానం రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది.
కవిత కూడా అప్రూవర్..?
ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరవింద్ కేజ్రీవాల్‌ను ఈసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా ఉండేందుకు బీజేపీ బిగ్ స్కెచ్ వేసినట్లుగా స్పష్టమవుతున్నది. రాహుల్ గాంధీ కంటే తమకు కేజ్రీవాల్‌తోనే ఎక్కువ డేంజర్ అన్నట్టుగా బీజేపీ భావిస్తున్నది. కేజ్రీవాల్ ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా బయటికొస్తే.. ఢిల్లీతో బాటు పంజాబ్, హర్యానా, పంజాబ్, గుజరాత్, గోవా వంటి రాష్ట్రాల్లో బీజేపీకి గట్టి పోటినిస్తారు. అందుకే, అతన్ని ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా.. జైలులోనే ఉండేలా బీజేపీ ప్లాన్ చేసినట్లు సమాచారం.
ఈ క్రమంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అప్రూవర్‌గా మారేలా బీజేపీ ప్లాన్ చేస్తోందని అధికారిక వర్గాల సమాచారం. ఎందుకంటే, ఢిల్లీ లిక్కర్ స్కాంలో రూ.41 కోట్లు ఎక్కడికెళ్లిందో తెలిసింది కానీ.. మిగతా 59 కోట్లు ఎక్కడికి వెళ్లాయనేది ఎమ్మెల్సీ కవితకు తప్ప ఎవరికీ తెలియదు. ఆమె ఢిల్లీ లిక్కర్ స్కాంలో వాస్తవాలు చెబుతుందా? అప్రూవర్‌గా మారుతుందా? అనే విషయం అతి త్వరలో తెలుస్తుంది. ఒకవేళ తను గనక అప్రూవర్‌గా మారితే.. కేజ్రీవాల్‌కు ఉచ్చు బిగిసుకున్నట్లే. ఒకవేళ కవిత అప్రూవర్‌గా మారితే.. తను కూడా తప్పు చేసినట్లు అవుతుంది కదా.. మరి, అలాంటప్పుడు ఈసారి జరిగే ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పై ఎలాంటి ప్రభావం పడుతుందో?.