- విజేతను నిర్ణయించనున్న ఓటర్లు…
- 40 రోజుల్లో విడతల వారీగా రాష్ట్రానికి తరలివచ్చిన
- ప్రధాని మోడీ, అమిత్ షా, రాహుల్‌గాంధీ, ప్రియాంక, మల్లికార్జున ఖర్గేలు
- గెలుపుపై ఎవరికీ వారే ధీమా…
- ఏ పార్టీ ఓట్లు చీలుతాయే తెలియని అమోమయంలో పార్టీలు
నేడు రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ముక్కోణపు పోటీ జరుగనుండగా నువ్వా, నేనా అన్న చందంగా పోటాపోటీగా ప్రచారం జరిగింది. ఈ ప్రచారంలో భాగంగా బిఆర్‌ఎస్, బిజెపి, కాంగ్రెస్‌కు చెందిన అగ్ర నాయకులు తెలంగాణకు తరలివచ్చారు. అయితే ఇంత ఉధృతంగా జరిగిన ప్రచారంలో ఓటరు ఎవరి వైపు ఉంటారు, ఏ పార్టీ ఓట్లు చీలుతాయన్న విషయం నేడు జరిగే ఓటింగ్‌పై ఆధారపడి ఉంది. దీంతోపాటు మూడు పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలను గుప్పిస్తూ చేసిన ప్రచారం వల్ల చివరకు ఓటరు ఎటువైపు మొగ్గుతారు, అభ్యర్థులు ఎవరు గెలుస్తారని జూన్ 04వ తేదీన తేలనుంది.
ఓటర్ల నాడీని గుర్తించలేక పోయిన పార్టీలు
బిజెపి నుంచి ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ నుంచి రాహుల్‌గాంధీ, ప్రియాంక, మల్లికార్జున ఖర్గేలు రాష్ట్రానికి రాగా, బిఆర్‌ఎస్ నుంచి మాజీ సిఎం కెసిఆర్, మాజీ మంత్రి కెటిఆర్‌లు సుడిగాలి పర్యటనలు చేశారు. అన్ని జిల్లాలో కార్నర్‌మీటింగ్‌లు, సభలు, రోడ్ షోలతో అగ్ర నాయకులు పర్యటించారు. ఈ నేపథ్యంలోనే ఎవరికీ వారే గెలుపు తమదంటే తమదని ప్రజలను నమ్మించేలా హామీలను గుప్పిస్తూ ప్రత్యర్ధి పార్టీల మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి తమవంతు ప్రయత్నం చేశారు. ఈ ప్రచారంలో భాగంగా ఏ పార్టీ ఓట్లు చీలుతాయో కచ్చితంగా అంచనా వేయలేక పోయిన పార్టీలు, ఓటర్లు ఎటువైపు ఉన్నారన్నది తేల్చులేకపోతున్నారు.
జూన్04వ తేదీన తేలనున్న భవితవ్యం
శనివారం సాయంత్రంతో ప్రచారానికి తెరపడినా ప్రలోభాలు, డబ్బు పంపిణీతో ఓటర్లను ఆకట్టుకోవడానికి మూడు పార్టీల నేతలు చివరి ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఈ మూడు పార్టీల అభ్యర్థుల భవితవ్యాన్ని నేడు ఓటర్లు ఈవిఎంలలో భద్రపరచనున్నారు. ఈ నేపథ్యంలోనే 40 రోజుల ప్రచారంలో భాగంగా ముక్కోణపు పోటీలో (మూడు పార్టీలకు) సంబంధించి ఓటరు ఎటువైపు ఉంటారన్నది జూన్04వ తేదీన తేలనుంది.
ప్రధాని మోడీ 8 సార్లు రాష్ట్రానికి రాక
తెలంగాణ పర్యటనలో భాగంగా ఈ 40 రోజుల పర్యటనలో ప్రధాని మోడీ 8 సార్లు రాష్ట్రానికి రావడంతో పాటు పలు జిల్లాలో జరిగిన సభల్లో ఆయన పాల్గొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా 5 సార్లు తెలంగాణకు ప్రచారం నిమిత్తం వచ్చారు. ఇక కాంగ్రెస్ తరపున సిఎం రేవంత్ రెడ్డి అన్నీ తానై సుమారుగా 27 రోజుల్లో 57 సభలు, కార్నర్ మీటింగ్‌లు, రోడ్ షోలతో ప్రచారాన్ని హోరెత్తించారు. మరోవైపు కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే, రాహుల్ కూడా ఇక్కడ జరిగిన సభల్లో పాల్గొన్నారు. నాలుగు నుంచి ఐదుసార్లు వాళ్లు రాష్ట్రానికి వచ్చి కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ప్రచారంలో పాల్గొన్నారు.
ఈసారి భారాస అభ్యర్థుల విజయం కోసం కెసిఆర్‌తో పాటు కెటిఆర్ కూడా ప్రచారంలో ఉధృతంగా పాల్గొన్నారు. కెసిఆర్ 17 రోజులు బస్సు యాత్రలో పాల్గొనడంతో పాటు సుమారు 50 సభలు, సమావేశాలు, కార్నర్‌మీటింగ్‌లు, రోడ్ షోలతో ప్రచారంలో పాల్గొన్నారు. మాజీ మంత్రి కెటిఆర్ సైతం 50 పైచిలుకు కార్నర్ మీటింగ్‌లతో పాటు రోడ్డు షోలు, సభల్లో పాల్గొన్నారు. ఇలా మూడు పార్టీలకు చెందిన కీలక, అగ్ర నేతలు అభ్యర్థుల విజయం కోసం అహర్నిశలు శ్రమించారు. ఈ నేపథ్యంలోనే నేడు జరిగే ముక్కోణపు పోటీలో విజేత ఎవరన్నది త్వరలో తేలనుంది.