Tuesday, May 21, 2024

దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు

  • దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు
  • మోడీ గ్యారంటీ అంటే అభివృద్ధికి గ్యారంటీ

ఈ లోక్‌సభ ఎన్నికలు దేశ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్‌​నగర్ ఎంపీ అభ్యర్థి డీకే ఆరుణకు మద్ధతుగా నారాయణపేటలో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, ఇండియా కూటమి, బీఆర్ఎస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు. ‘నా పాలమూరు సోదరసోదరీమణులకు హృదయపూర్వక నమస్కారాలు. జోగులాంబ తల్లి పాదాలకు నమస్కరిస్తున్నా’ అంటూ ప్రధాని నరేంద్ర మోడీ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. మోడీ గ్యారంటీ అంటే అభివృద్ధికి గ్యారంటీ, మోడీ గ్యారంటీ అంటే దేశ భద్రతకు గ్యారంటీ అని, మోడీ గ్యారంటీ అంటే విశ్వవేదికపై భారత గౌరవానికి గ్యారంటీ, మోడీ గ్యారంటీ అంటే ఇచ్చిన హామీలు నెరవేరతాయనే గ్యారంటీ అని స్పష్టం చేశారు.

కేంద్రం ఇచ్చిన నిధులు అవినీతి ఏటీఎంలోకి

గత పదేళ్లలో తెలంగాణకు రూ.లక్షల కోట్లు ఇచ్చామని ప్రధాని మోడీ పేర్కొన్నారు. తాము ఇచ్చిన నిధులు అవినీతి ఏటీఎంలోకి వెళ్లాయని, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకుందని, ఇప్పుడు కాంగ్రెస్‌ దోచుకుంటోందని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం పేరిట లూటీ చేసిందని, ఇప్పుడు కాంగ్రెస్‌ కూడా బీఆర్ఎస్ దారిలోనే లూటీ చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ వసూలు చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ఎన్నో అబద్ధపు హామీలిచ్చి తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని కులాల పేరిట, మతాల పేరిట విభజించాలని చూస్తోందని, దేశం ఏమైపోయినా కాంగ్రెస్‌కు అవసరం లేదని, దానికి రాజకీయ లబ్ధి మాత్రమే కావాలని ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ ఎన్నికలొస్తేనే తన ప్రేమ దుకాణం తెరుస్తారని ఎద్దేవా చేశారు. 4 మతపరమైన రిజర్వేషన్లు ఇస్తే మత మార్పిడులు పెరుగుతాయని, ఈ ఎన్నికలు దేశ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలని స్పష్టం చేశారు. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ వ్యతిరేకమని కాంగ్రెస్‌కు తెలుసు అని, మతపరమైన రిజర్వేషన్లను అంబేద్కర్ కూడా తిరస్కరించారని, అయినప్పటికీ కాంగ్రెస్ ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తానంటోందని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ముస్లింలకు ఇవ్వడమే కాంగ్రెస్ ఎజెండా అని మోడీ ఆరోపించారు. కాంగ్రెస్‌కు హిందువులపైగానీ, దేశంపైగానీ ప్రేమలేదని, వంచితుల కోసం మోడీ చౌకీదార్‌లా ఉంటారన్నారు. మహబూబ్‌నగర్ నుంచి డీకే అరుణను గెలిపించాలని.. ఆమెకు వేసే ప్రతి ఓటు తనకే చెందుతుందన్నారు. డీకే అరుణపై స్వయంగా ముఖ్యమంత్రే దారుణ వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. వారికి ఓటు ద్వారానే జవాబివ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా మోదీ గ్యారంటీ అంటే ఏంటో వివరించారు. కాంగ్రెస్ పార్టీ యువరాజుకు అమెరికాలో ఓ రాజగురువు ఉన్నాడని, దక్షిణ భారతీయులను ఆఫ్రికన్లతో పోల్చి అవమానిస్తున్నాడు. జాతి వివక్షతతో మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలకు హిందు దేవుళ్లను పూజించటం, అయోధ్యకు వెళ్లటం నచ్చదన్నారు. హిందువులను రెండో తరగతి పౌరులుగా గుర్తిస్తున్న కాంగ్రెస్.. ఈ దేశాన్ని కులాల వారీగా విభజించాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అభివృద్ధికి వ్యతిరేకమైన కాంగ్రెస్ పార్టీని ఓడించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. “ మీకు తెలిసినవారందరికీ మోడీ నమస్కారాలు తెలియజేశారని చెప్పండి’’ అంటూ ప్రధాని మోడీ తన ప్రసంగాన్ని ముగించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ఎన్నికల కోడ్ ముగియగానే జిల్లాల పునర్విభజన సరైనదేనా..?

Most Popular