Friday, September 20, 2024

ఆసరా పింఛన్లలో అనర్హుల ఏరివేత

ఆ తర్వాతే కొత్త దరఖాస్తుల ఆమోదం..!

గత ఐదేళ్ల నుంచి ఆసరా పింఛన్లు అందుకుంటున్న వారిలో అనర్హులైన చాలా మంది లబ్దిదారులుగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. అటువంటి వారి నుంచి పింఛన్ సొమ్ము మొత్తం రికవరీ చేసేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఇదే అంశం హాట్ టాపిక్‌గా మారింది. అటువంటి వారి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. పింఛన్ పొందేందుకు అనర్హులైనా గ్రామ స్థాయిలో పలుకుబడి ఉపయోగించి పింఛన్లు పొంది ఇన్నాళ్లు లబ్దిపొందుతూ వచ్చారు. అటువంటి వారిని ఏరివేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు అధికారికంగా ఈ అంశంపై ఉత్తర్వులు వెలువడకపోయినా పై నుంచి వచ్చిన ఆదేశాలతో కొందరి పింఛన్లపై విచారణ చేపడుతున్నారు. ఒకే ఇంట్లో రెండేసి పింఛన్లు ఉండడం, అర్హులు కాకపోయినా పింఛన్లు పొందుతున్న వారిని గుర్తించేందుకు ఇప్పటికే జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ కావడంతో అటువంటి వారిని ఏరివేసేందుకు కసరత్తు జరుగుతోంది.

ఆసరా పింఛన్ మొత్తాన్ని మూడు నుంచి నాలుగు వేలకు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల్లో చెప్పిన మేరకు త్వరలో ఆ హామీని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగా ప్రస్తుతం అనర్హులను గుర్తించి ఏరివేయాలని, అనంతరం పెంచిన పింఛన్లు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో పింఛన్లు పెంచుతామని ఇచ్చిన హామీని అమలు చేయలేదని ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శల దాడి చేస్తున్నాయి. పార్లమెంటు ఎన్నికల ప్రక్రియ కారణంగా పింఛన్లు పెంచలేదని ప్రభుత్వం ఇప్పటికే వివరణ ఇచ్చింది. అయితే పింఛన్లు త్వరగా పెంచి లబ్దిదారులకు ఇవ్వాలనే ఒత్తిడి పెరగడంతో ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటోందని తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వ్యక్తులు, ఆస్తులు కలిగి ఉన్నటువంటి వారి నివాసాల్లో ఆసరా పింఛన్లు అందుకుంటున్నారని సమాచారం ఉండడంతో అనర్హులైన లబ్దిదారులను ఏరివేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.

ఇలా అనర్హులు పింఛన్లు తీసుకుంటున్నందున వారిని తొలగించి కొత్తవారికి అవకాశం ఇచ్చేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ చర్యలు తీసుకుంటుంది. కాగా నిజంగా అనర్హులను ఏరివేస్తే మంచిదే గానీ ఈ పేరుతో ఎటువంటి ఆసరా లేని వారిని తొలగించడం సరికాదని పలువురు కోరుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాసరి మల్లమ్మ (80)కు ఆసరా పింఛన్ కింద ఇప్పటి వరకు ఇచ్చిన రూ.1,72,928 లక్షలు వెనక్కు చెల్లించాలని నోటీసు ఇచ్చారు. ప్రభుత్వానికి ఏడు రోజుల్లోగా చెల్లించాలని అధికారులు ఆమెకు జారీ చేసిన నోటీసులో పేర్కొన్నారు. ఇలా అనర్హులు చాలా మంది పలు రకాల ఆసరా పింఛన్లు తీసుకుంటున్నందున వారి గురించి విచారణ చేపట్టి ఏరివేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో వివిధ రకాల ఆసరా పింఛన్లు 44 లక్షల మందికి ప్రభుత్వం అందిస్తోంది. వృద్ధులకు రూ.2 వేలు, వైకల్యం ఉన్న వారికి రూ.3 వేలు చొప్పున లబ్దిదారులకు పంపిణీ చేస్తున్నారు. ఆసరా పింఛన్లు అందుకుంటున్న 44 లక్షల్లో వృద్దులు 15Exclusion of ineligible persons in support pensions,98,729, వితంతువులు 15,06,707, వైకల్యం కలిగిన 5,03,613, బీడీ కార్మికులు 4,24,585, ఒంటరి మహిళలు 1,42,394 మంది ఉన్నారు.

వీరు కాకుండా మరికొందరు గీతకార్మికులు, చేనేత కార్మికులు, హెచ్‌ఐవి బాధితులు కూడా ఆసరా పింఛన్లు అందుకుంటున్నారు. ఈ పింఛన్లను కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2,016 నుంచి రూ.4 వేలకు, రూ.3,016 నుంచి రూ.6 వేలకు పెంచుతామని హామీ ఇచ్చింది. ఈ మేరకు పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పింఛన్ల కోసం ప్రజాపాలన కార్యక్రమంలో పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. 44 లక్షల మంది పింఛనుదారుల కోసం ప్రతినెలా రూ.1000 కోట్లు ఖర్చవుతోంది. కొత్తగా పింఛన్ల కోసం తాజాగా 24.84 లక్షల అర్జీలు వచ్చాయి. ఇప్పటికే 44 లక్షల మంది పింఛనుదారులు ఉండగా, కొత్త వాటిని ఆమోదిస్తే ఆ సంఖ్య 69 లక్షలకు చేరే అవకాశం ఉందని అధికార వర్గాల సమాచారం.

రెండు పింఛన్లు అందుకున్నందుకే మల్లమ్మకు తొలగించాంః మంత్రి సీతక్క
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపాలిటికి చెందిన దాసరి మల్లమ్మకు 2014 నుంచి ఆసరా పెన్షన్ అందుతోంది. అయితే దాసరి మల్లమ్మ అవివాహిత కుమార్తె డి.రాజేశ్వరి వైద్య ఆరోగ్య శాఖలో ఏఎన్‌ఎంగా పనిచేస్తూ అక్టోబర్ 2010లో మరణించింది. ఫ్యామిలి పెన్షన్ కింద నెలకు రూ.24,073 పింఛన్ మల్లమ్మకు అందుతోంది. మల్లమ్మ ఇద్దరు కుమారుల్లో ఒకరు ప్రభుత్వ ఉద్యోగం చేస్తుండగా మరోకరు ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారు. కుమారుడితో పాటు సొంత పక్కా ఇంట్లో మల్లమ్మ నివసిస్తుంది. అయితే ఒకే వ్యక్తి రెండు రకాల పెన్షన్లు తీసుకోవడానికి నిబంధనలు అంగీకరించవని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క వివరణ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధాప్య, ఫ్యామిలి పెన్షన్లను 1826 మంది పొందుతున్నట్లు ట్రెజరీ శాఖ ఈ మధ్యనే గుర్తించి వారందరికి రికవరీ నోటీసులు పంపింది. ఆ ప్రక్రియలో భాగంగానే వృద్ధాప్య, ఫ్యామిలి పెన్షన్లను అందుకుంటున్న దాసరి మల్లమ్మకు సైతం అధికారులు నోటిసులు పంపినట్లు స్పష్టం చేశారు. వాస్తవాలు ఈ రకంగా ఉంటే, ప్రభుత్వం మీద బురద జల్లడమే పనిగా పెట్టుకున్న కొందరు ప్రభుత్వానికి దురుద్దేశాలను ఆపాదిస్తూ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని సీతక్క మండిపడ్డారు.

ఎందరో అర్హులకు పెన్షన్లు అందించకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని గుర్తు చేశారు. ఒక పంట కూడా సరిగా పండని అడవిలో కొండలు గుట్టలతో కూడిన పోడు భూమి ఐదు ఎకరాలకు మించి ఉందన్న కారణం చూపి ఇచ్చిన పెన్షన్లను గత ప్రభుత్వం రద్దు చేసింది. ఆటోలు, కార్లు నడుపుకుని బతికే కుటుంబాలకు రేషన్ కార్డుతో పాటు పెన్షన్‌లకు కోతలు పెట్టిందని అన్నారు. కాని తమ ప్రభుత్వం మానవీయకోణంలో ఆలోచించి అర్హులందరికి పెన్షన్ అందించడమే లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. ప్రతి పైసా అర్హులకే దక్కాలన్నది మా ప్రభుత్వ సంకల్పమని అన్నారు. అందులో భాగంగానే లీకేజీలను అరికట్టడంతో పాటు ఎప్పటికప్పుడు లబ్దిదారుల జాబితాను అప్ డేట్ చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుతూ సంక్షేమ ఫలాలు అర్హులకు, అవసరం ఉన్నవాల్లకే దక్కెలా ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటూ మానవీయకోణంలో పాలన సాగిస్తున్నామని వివరించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

Lavanya Tripati New Pics

Ishita Raj Insta Hd Pics

Nabha Natash New photos