Thursday, November 14, 2024

Illegal registrations తప్పుడు ఎల్‌ఆర్‌ఎస్ ధ్రువీకరణ పత్రాలతో అక్రమ రిజిస్ట్రేషన్‌లు…?

  • అక్రమ లే ఔట్‌లకు ఇంటి నెంబర్‌లు….!
  • వెంచర్ యజమానులతో కలిసి రిజిస్ట్రేషన్‌ల దందా
  • ప్రభుత్వానికి కోట్లలో నష్టం
  • పురపాలక శాఖ, హెచ్‌ఎండిఏల స్క్రూటీనిలో బయటపడ్డ నిజాలు
  • ప్రభుత్వానికి నివేదించిన అధికారులు
  • విచారణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం
  • ఇబ్రహీంపట్నం, పెద్ద అంబర్‌పేట్, మేడ్చల్‌లో లక్షల పైచిలుకు అక్రమ రిజిస్ట్రేషన్‌లు
  • గ్రామ పంచాయతీ లే ఔట్‌ల రిజిస్ట్రేషన్‌లకు సంబంధించి వివరాలు ఇవ్వాలని
  • ఆ శాఖ ఐజీ ఆదేశించినా పట్టించుకోని సబ్ రిజిస్ట్రార్‌లు

పాత తేదీల్లో ఎల్‌ఆర్‌ఎస్ ధ్రువీకరణ పత్రాలను తయారు చేయించి లక్షల పైచిలుకు గజాల ఓపెన్ ప్లాట్లకు సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్లు చేశారు. కొందరు సబ్ రిజిస్ట్రార్‌లు చేసిన ఈ అక్రమాల వల్ల సుమారుగా ప్రభుత్వానికి రూ.1,000ల నుంచి రూ.2 వేల కోట్ల నష్టం వాటిల్లిందని ప్రభుత్వం గుర్తించింది. పలు గ్రామ పంచాయతీల్లోని అక్రమ లే ఔట్‌లకు ఎల్‌ఆర్‌ఎస్ ఉంటేనే రిజిస్ట్రేషన్ చేయాలని గతంలో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి 2020లో అప్పటి ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్ లేని ప్లాట్ల యజమానులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. (ఉదా…ఒక వెంచర్‌లో 100 ప్లాట్లు ఉంటే ఆ ప్లాట్లలో 20 ప్లాట్లు అమ్ముడుపోయి మిగతా 80 ప్లాట్లు అలాగే రిజిస్ట్రేషన్‌లు కాకుండా ఉంటే ఆ ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేయవద్దని 2020లో అప్పటి ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఎల్‌ఆర్‌ఎస్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, వెంచర్‌ల యజమానుల నుంచి సుమారుగా 25 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తులను హెచ్‌ఎండిఏ, పురపాలక శాఖ అధికారులు స్క్రూటీని చేసి సుమారుగా 5 లక్షల దరఖాస్తులకు సరైన ధ్రువీకరణ పత్రాలను సమర్పించలేదని పక్కనబెట్టారు.

అధికారుల నోటీసులకు స్పందించని వెంచర్‌ల యజమానులు
ఈ నేపథ్యంలోనే వాటికి సరైన ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలని ఆయా పాట్ల, వెంచర్‌ల యజమానులకు అధికారులు మేసెజ్ పంపించారు. ఇందులో కొన్ని అక్రమ లే ఔట్‌లకు సంబంధించిన ప్లాట్లు కూడా ఉండడంతో ఆయా వెంచర్‌ల యజమానులు అధికారులు పంపించిన మేసెజ్‌లకు, నోటీసులకు స్పందించలేదు. దీంతో అధికారులు ఆయా వెంచర్‌ల గురించి ఆరా తీయగా పాత తేదీల్లో ఎల్‌ఆర్‌ఎస్ ధ్రువీకరణ పత్రాలను తయారుచేసి పలువురు గ్రామ పంచాయతీ లే ఔట్‌ల యజమానులు సబ్ రిజిస్ట్రార్‌లతో కలిసి రిజిస్ట్రేషన్‌లు చేయించుకున్నట్టు పురపాలక, హెచ్‌ఎండిఏ అధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని ఇరు శాఖల అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలోనే దీనిపై విచారణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలిసింది. ఈ అక్రమ రిజిస్ట్రేషన్‌ల వల్ల ప్రభుత్వానికి వేయి నుంచి రూ.2 వేల కోట్ల ఆదాయానికి నష్టం వచ్చిందని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ప్రస్తుతం నాలుగేళ్లుగా ఎల్‌ఆర్‌ఎస్ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉండడంతో ఆయా వెంచర్‌ల యజమానులు ప్రభుత్వానికి కట్టాల్సిన ఫీజును తప్పించుకోవడానికి ఈ అక్రమాలకు పాల్పడినట్టు అధికారులు గుర్తించారు.

2012 వరకు మాన్యువల్‌గా….
2012 వరకు మాన్యువల్ గా అధికారులు ఎల్‌ఆర్‌ఎస్ ధ్రువీకరణ పత్రాలను జారీ చేయగా వాటినే ప్రస్తుత రిజిస్ట్రేషన్‌లకు సబ్ రిజిస్ట్రార్‌లు వాడారని, పాత ఎల్‌ఆర్‌ఎస్ ధ్రువీకరణ పత్రాన్ని పిడిఎఫ్‌లోకి మార్చి ఆ నెంబర్ ఆధారంగా వేరే నెంబర్ సృష్టించి ఈ దందాకు పాల్పడినట్టుగా ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ఈ దందా ఇబ్రహీంపట్నం, అబ్ధుల్లాపూర్‌మెట్, చంపాపేట్, భువనగిరి, చౌటుప్పల్, సంగారెడ్డి, పెద్ద అంబర్‌పేట్, ఉమ్మడి నల్లగొండ, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి మెదక్, రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలతో పాటు, మేడ్చల్, మల్కాజిగిరి, సంగారెడ్డి తదితర ప్రాంతాల్లో అధికంగా ఈ అక్రమ రిజిస్ట్రేషన్‌లు జరిగినట్టు ప్రభుత్వం గుర్తించింది.

ఉన్నతాధికారి ఆదేశాలు బేఖాతర్
అయితే గ్రామపంచాయతీ లే ఔట్‌లకు సంబంధించి ఇప్పటివరకు ఎన్ని రిజిస్ట్రేషన్‌లు జరిగాయి, ఎప్పటినుంచి జరిగాయి, ఒకవేళ రిజిస్ట్రేషన్‌లు చేస్తే ఎన్ని చేశారని స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ నవీన్‌మిట్టల్ ఏప్రిల్‌లో మెమోనెంబర్ జి1/1009/2024, తేదీ 30.04.2024ను అన్ని జిల్లాల డిస్ట్రిక్ రిజిస్ట్రార్‌లకు, డిఐజీలకు, సబ్ రిజిస్ట్రార్‌లకు ఒక మెమోను పంపించారు. 45 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సబ్ రిజిస్ట్రార్, డిస్ట్రిక్ రిజిస్ట్రార్‌లు దీనిపై నివేదిక ఇవ్వాలని ఆయన ఆదేశించారు. కానీ, ఇప్పటివరకు ఏ సబ్ రిజిస్ట్రార్ కూడా స్పందించలేదు. దీంతో తాజాగా ఈనెల 02వ తేదీన గతంలో తాము అడిగిన వివరాలను ఈనెల 19వ తేదీలోగా ఇవ్వాలని ప్రస్తుత ఐజీ డా.జ్యోతి బుద్ధప్రకాశ్ కూడా అన్ని జిల్లాల సబ్ రిజిస్ట్రార్‌లకు ఆదేశాలు జారీ చేశారని అయినా ఇప్పటివరకు ఒక్క జిల్లా నుంచి కూడా నివేదిక రాలేదని సమాచారం.

ఇబ్రహీంపట్నంలో పనిచేసిన ఓ సబ్ రిజిస్ట్రార్…
అయితే ఇబ్రహీంపట్నంలో సుమారుగా 7 సంవత్సరాలు పనిచేసిన ( ప్రస్తుతం మేడ్చల్ 2 సబ్ రిజిస్ట్రార్ పనిచేస్తున్న) ఓ సబ్ రిజిస్ట్రార్ ఏకంగా లక్ష పైచిలుకు గజాలకు అక్రమంగా రిజిస్ట్రేషన్‌లు చేశారని ఆయనపై ప్రభుత్వానికి భారీగా ఫిర్యాదులు వచ్చాయి. ఈ సబ్ రిజిస్ట్రార్ తరువాత సంవత్సరం పాటు ఇబ్రహీపట్నంలో పనిచేసిన ( ప్రస్తుతం హైదరాబాద్ పరిధిలో ఆజంపురా సబ్ రిజిస్ట్రార్ పనిచేస్తున్న) మరో సబ్ రిజిస్ట్రార్ కూడా సుమారుగా 30 నుంచి 50 వేల గజాల పైచిలుకు గజాలను అక్రమంగా పంచాయతీ లే ఔట్‌లకు సంబంధించి రిజిస్ట్రేషన్‌లు చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీరితో పాటు అబ్ధుల్లాపూర్‌మెట్‌లో గతంలో పనిచేసి (ప్రస్తుతం సదాశివపేట్‌లో పనిచేస్తున్న) ఓ సబ్ రిజిస్ట్రార్ కూడా తిమ్మాయిగూడ, నాచారం, గౌరెల్లి, బాటసింగారం (కొత్తగూడెం) లతో పాటు పలు గ్రామ పంచాయతీల్లో చేసిన లే ఔట్‌లలోని ప్లాట్లను ఈ సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేశారని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు అందింది. భువనగిరిలో పనిచేసి ప్రస్తుతం (చండూరులో పనిచేస్తున్న ఓ సబ్ రిజిస్ట్రార్ )పై కూడా తాజాగా యాదాద్రి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు అందడం విశేషం. వీరితో పాటు పలువురు సబ్ రిజిస్ట్రార్‌లపై తాజాగా ఈ రిజిస్ట్రేషన్‌లకు సంబంధించి అవినీతి ఆరోపణలు రావడం గమనార్హం.

చంపాపేట్ పరిధిలోని వక్ఫ్‌బోర్డు భూములకు జూలైలో భారీగా….
ఈ సంవత్సరం జూలై నెలలో బదిలీలు జరుగుతాయని ముందే తెలుసుకున్న ఓ సబ్ రిజిస్ట్రార్ తాను పనిచేసే చంపాపేట్ పరిధిలోని వక్ఫ్‌బోర్డు భూములను, పంచాయతీ లే ఔట్‌లను, అనుమతి లేని అపార్ట్‌మెంట్‌లలోని ప్లాట్లను అడ్డగోలుగా రిజిస్ట్రేషన్ చేశారని చంపాపేటకు చెందిన రియల్టర్‌లు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఇదే సబ్ రిజిస్ట్రార్ గత నెల కుత్భుల్లాపూర్ పరిధిలో సుమారుగా 8 రోజుల పాటు డిప్యూటేషన్‌పై పనిచేసి 10 ఏళ్లుగా ఆ ప్రాంతంలో ఏ సబ్ రిజిస్ట్రార్ చేయని విధంగా పంచాయతీ లే ఔట్‌లు, అసైన్డ్, కోర్టు పరిధిలో ఉన్న భూములకు రిజిస్ట్రేషన్‌లు చేసి భారీగా ముడుపులు తీసుకున్నారని స్థానిక రియల్టర్‌లు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలిసి కూడా ఆ సబ్ రిజిస్ట్రార్‌ను ప్రోత్సహించారని, ఆ సబ్ రిజిస్ట్రార్ కూడా తనకు ఓ డిఐజి అండదండలు ఉన్నాయని అందరికీ చెప్పుకొని ఈ దందాను చేసినట్టుగా తెలిసింది. ప్రస్తుతం చంపాపేటలో రెండు నెలలుగా పనిచేస్తున్న ఓ సబ్ రిజిస్ట్రార్‌పై కూడా ఇదే విధంగా అవినీతి ఆరోపణలు వస్తుండడం విశేషం.

అక్రమ లే ఔట్‌లకు ఇంటినెంబర్‌లు…
కొందరు సబ్ రిజిస్ట్రార్‌లు ఒక అడుగు ముందుకేసి ఎల్‌ఆర్‌ఎస్ లేని వెంచర్‌లలోని ప్లాట్లకు మున్సిపల్, పంచాయతీల నుంచి ఇంటినెంబర్‌లను తీసుకొని వాటి ఆధారంగా ఎల్‌ఆర్‌ఎస్ లేకుండానే ఆయా ప్లాట్లకు రిజిస్ట్రేషన్‌లు చేశారని పురపాలక శాఖ గుర్తించింది. ఇలా మేడ్చల్ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి శివార్ల సబ్ రిజిస్ట్రార్ పరిధిలో ఎక్కువగా జరుగుతున్నట్టుగా తెలిసింది. ముఖ్యమంగా అబ్దుల్లాపూర్ మెట్, పెద్ద అంబర్‌పేట్, ఇబ్రహీంపట్నం, మేడ్చల్ సబ్ రిజిస్ట్రార్, సంగారెడ్డి సబ్ రిజిస్ట్రార్ పరిధితో పాటు నల్లగొండ, సూర్యాపేట, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్. ఆదిలాబాద్ జిల్లాలోని కొన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో ఈ తంతు యథేచ్ఛగా జరిగినట్టుగా ప్రస్తుతం ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడం విశేషం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular