Saturday, April 19, 2025

రైతు రుణమాఫీపై సంభ్రమాశ్చర్యానికి లోనైన రైతులు

  • వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారి సాధకబాధలను అడిగి తెలుసుకున్న సిఎం రేవంత్‌రెడ్డి
  • రైతుల కుటుంబం గురించి అప్యాయంగా అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి

సచివాలయం నుంచి రైతులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. వివిధ జిల్లాల రైతుల నుంచి రుణమాఫీకి సంబంధించి వారి అభిప్రాయాలను సేకరించారు. సిఎం రేవంత్‌రెడ్డి మాట్లాడినప్పుడు కొందరు రైతులకు మాటలు రాలేదు. వారు సంభ్రమాశ్చ ర్యానికి లోనయ్యారు. తాము ఈ నిజాన్ని నమ్మలేకపోతున్నామని, కాంగ్రెస్ ఇచ్చిన హామిని నిలబెట్టుకుందని వారు సిఎం రేవంత్‌ను, ప్రభుత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తారు. ఇలా రైతుల కుటుంబ వివరాలను కూడా సిఎం రేవంత్ అప్యాయంగా అడిగి తెలుసుకున్నారు.
తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు కట్టి ఆదిలాబాద్ జిల్లాకు నీళ్లు ఇస్తాం…
రైతు మహేందర్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ప్రాణహిత నదిపై తుమ్మిడి హెట్టి వద్ద ప్రాజెక్టు కట్టి ఆదిలాబాద్ జిల్లాకు నీళ్లు ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం బండ్లనాగాపూర్ గ్రామానికి చెందిన రైతు మహేందర్‌తో ముఖ్యమంత్రి ముచ్చటించారు. వారి మధ్య సంభాషణ ఇలా…
సిఎం: ఎంత భూమి ఉంది మహేందర్?
మహేందర్: ఎకరం భూమి ఉంది సార్….
సిఎం: రుణం ఎంత ఉంది..?
మహేందర్: రూ.50 వేలు ఉంది సర్….ఏకకాలంలో రుణం తీరుతున్నందుకు సంతోషంగా ఉంది.
సిఎం: రైతుల కష్టాలు, ఆదివాసుల కష్టాలు తెలుసుకుంటారన్న ఉద్ధేశ్యంతోనే సీతక్కను మీ జిల్లాకు ఇన్‌చార్జి మంత్రిగా వేశాను. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నావా..?
మహేందర్: ఉన్నాను.
సిఎం: రైతు రుణమాఫీ గురించి సోషల్ మీడియా ద్వారా చెబుతావా..?
మహేందర్: చెబుతాను.
సిఎం: ధన్యవాదాలు..మీ జిల్లాలో ప్రాణహితపై తుమ్మడిహెట్టి వద్ద ప్రాజెక్టు కట్టి నీళ్లు ఇస్తాం.
వరంగల్ సభకు రైతులను తీసుకొస్తా: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో రైతు ఎల్లయ్య
వరంగల్‌లో నిర్వహించనున్న రాహుల్ గాంధీ కృతజ్ఞత సభకు తాను రావడంతో పాటు ఇతర రైతులను తీసుకువస్తానని వరంగల్ చెందిన రైతు ఎల్లయ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియజేశారు. వరంగల్ జిల్లాకు చెందిన రైతు ఎల్లయ్యతో సిఎం రేవంత్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. వారిద్దరి మధ్య సంభాషణ ఇలా…
ఎల్లయ్య: ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేయడం దేశ చరిత్రలోనే పండుగ రోజులా కనిపిస్తోంది.
ముఖ్యమంత్రి: రుణమాఫీ డిక్లరేషన్ వరంగల్‌లోనే చేశాం తెలుసా..?
ఎల్లయ్య: తెలుసు సర్, వరంగల్ ఆర్ట్ కాలేజీ గ్రౌండ్‌లో రాహుల్ గాంధీ వచ్చిన సభలో చేశారు. ఆ మాటను నిలబెట్టుకున్నారు.
ముఖ్యమంత్రి: ఆ సభకు వచ్చావా..?
ఎల్లయ్య: వచ్చా…
ముఖ్యమంత్రి: వరంగల్‌లో సభ పెట్టి రాహుల్ గాంధీని పిలుద్దామా..?
ఎల్లయ్య: పిలిచి కృతజ్ఞతలు తెలుపుదాం.
ముఖ్యమంత్రి: సభకు వస్తావా..?
ఎల్లయ్య: నేను తప్పకుండా వస్తా. వరంగల్ జిల్లా అంటేనే రైతులు. సభకు నాతో పాటు రైతులను తీసుకువస్తా.
పిల్లలను మంచిగా చదివించాలి: ఖమ్మం జిల్లా రైతు సీతారాంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఇప్పటికే అప్పుల్లో ఉన్నానని, రుణమాఫీతో ఎంతో సంతోషంగా ఉందని ఖమ్మం జిల్లా రఘనాధపాలెం మండలం వి.వెంకటాయపాలెం గ్రామానికి చెందిన రైతు కుతుంబాక సీతారాం తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రైతు సీతారాంతో మాట్లాడారు. వారిద్దరి మధ్య సంభాషణ ఇలా…
సీతారాం: రుణమాఫీతో సంతోషం కలిగింది. యువ రైతులకు సాగు చేయాలన్న సంకల్పాన్ని మీరు కల్పించారు.
సిఎం: సీతారాం ఎంత భూమి ఉంది.? ఎంత అప్పు ఉంది..?
సీతారాం: నాలుగున్నర ఎకరాల భూమి, రూ.78 వేల అప్పు ఉంది.
సిఎం: మొత్తం రుణమాఫీ అవుతోంది. మీకు ఎలా ఉంది..?
సీతారాం: చాలా సంతోషంగా ఉంది. మీరు చల్లగా ఉండాలి.
సిఎం: పిల్లలు ఎంతమంది సీతారాం?
సీతారాం: ఇద్దరు పాపలు. పెద్ద పాప ఇంటర్, చిన్న పాప పదో తరగతి చదువుతున్నారు.
సిఎం: ఇద్దరిని మంచిగా చదివించు, చదువు ఆపొద్దు..
సీతారాం: ఆపను సర్, మంచిగా చదివిస్తా.
గత ప్రభుత్వాల తీరుతో నమ్మకం పోయింది: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో బోధన్ రైతు రవి
రుణమాఫీతో ఎంతో సంతోషంగా ఉందని, రైతుల తరఫున పాదాభివందనం చేస్తున్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో బోధన్ రైతు రవి అన్నారు. వారిద్దరి మధ్య సంభాషణ ఇలా…
రవి: నాకు మాటలు రావడం లేదు. గతంలో ప్రభుత్వాలు, పార్టీలు రుణమాఫీపై హామీ ఇచ్చి నెరవేర్చకపోవడంతో వడ్డీలు పెరిగి అప్పులు మిగిలిపోయాయి. రుణమాఫీపై ఎవరు హామీ ఇచ్చినా నమ్మే పరిస్థితి లేకుండా పోయింది. ఇప్పుడు నమ్మకం కలిగింది. సంతోషంగా ఉంది. మరో రాజశేఖర్ రెడ్డిలా రేవంత్ రెడ్డిని చూస్తున్నాం. రైతుల ఆశీస్సులతోనే రైతు రాజ్యం ఉంటుంది.
సిఎం: మీ నిజామాబాద్ జిల్లాకు రూ.225 కోట్లు రుణమాఫీ కింద ఇస్తున్నాం.
రవి: నాట్లు వేసుకుంటూ మిఠాయిలు పంచుకున్నాం.
సిఎం: అంకాపూర్ చికెన్ తినిపిస్తావా…? (సరదాగా…)
రవి: తప్పకుండా.. అంతా అదృష్టం ఎలా వదులుకుంటాం సర్.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com