Saturday, November 16, 2024

రెడ్లకు పిసిసి పదవి ఇస్తే నేనే ముందుంటా

  • రెడ్లకు పిసిసి పదవి ఇస్తే నేనే ముందుంటా
  • పిసిసి మార్పునకు ఇంకా సమయం ఉంది
  • జగ్గారెడ్డి దేనికి కక్కుర్తి పడడు
  • సిఎం రేవంత్ పాలనకు100 మార్కులు
  • జిమ్మిక్కులతో అధికారంలోకి రావాలన్నదే మోడీ, అమిత్ షా విధానం
  • కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి

పిసిసి పదవి అడగడం నాకు కొత్త ఏమీ కాదనీ, రెడ్లకు ఇవ్వాల్సి వస్తే తాను మొదటిస్థానంలో ఉంటానని, ఎస్సీ, ఎస్టీ, బిసిల్లో ఎవరికీ ఇచ్చినా పర్వాలేదని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. అవకాశం వచ్చిన ప్రతి సారి అడుగుతానని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. పిసిసి మార్పునకు ఇంకా సమయం ఉందని ఆయన చెప్పారు. మంగళవారం జగ్గారెడ్డి గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ జగ్గారెడ్డి దేనికి కక్కుర్తి పడడన్నారు. ఎంపి ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయ్యాకే పిసిసి మార్పు ఉండొచ్చన్నారు. ప్రస్తుతం పిసిసి అధ్యక్షుడు, సిఎం ఒక్కరే ఉంటే బాగుంటుందని రేవంత్‌రెడ్డి కంటిన్యూ అవుతున్నారని ఆయన తెలిపారు. సిఎం రేవంత్ పాలనకు100 మార్కులు వేస్తున్నానని ఆయన తెలిపారు. బస్టాండ్‌లో తాను ఎక్కాల్సిన బస్సు వచ్చినప్పుడు ఎక్కుతానని ఆయన స్పష్టం చేశారు.

పార్టీ ఫిరాయింపులపై నేను మాట్లాడలేను
బిజెపి, బిఆర్‌ఎస్ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఎవరెన్ని మాటలు మాట్లాడినా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ సీట్లు గెలుచుకోవడం ఖాయమని ఆయన తెలిపారు. వర్షాకాలంలో కాంగ్రెస్ అధికారంలోకి రాలేదని, వర్షాలు ఎప్పుడు వస్తాయో కూడా తెలుసుకునే తెలివి లేదా..? బిఆర్‌ఎస్ వాళ్లకు లేదా అని ఆయన ప్రశ్నించారు. అధికారం పోయినందుకు కెసిఆర్ ప్రస్టేషన్‌లో ఉన్నాడని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పాలన ఎలా ఉందో ఆర్టీసిలో ప్రయాణం చేసే మహిళలను అడిగి తెలుసుకోవాలన్నారు. ప్రజాధనం ప్రజలకే ఉపయోగపడుతుందన్నారు. పార్టీ ఫిరాయింపులపై తాను మాట్లాడలేనని, తాను పార్టీలు మారి వచ్చిన కాదని ఆయన అన్నారు.

ప్రశాంత్ కిషోర్‌పై జగ్గారెడ్డి విమర్శలు

Jaggareddy criticizes Prashant Kishore
ప్రముఖ ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్‌పై జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కేవలం బ్రతుకుదెరువు కోసమే ప్రశాంత్ కిషోర్ సర్వే సంస్థ పెట్టుకున్నారని ఆయన అన్నారు. ఆయనేం పెద్ద గొప్ప వ్యక్తి కాదన్నారు. బ్రతకడానికి ఎవరైనా ఏదో ఒక పనిచేయాలని, అందులో భాగంగా ఆయన వ్యూహాకర్తగా పనిచేస్తున్నారన్నారు. పికె ఓ సారి బిజెపి అంటాడు, ఇంకోసారి కాంగ్రెస్ అంటాడని ఆయన అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కెసిఆర్ అధికారంలోకి వస్తారని పికె చెప్పారని, కానీ, కాంగ్రెస్ గెలిచిందన్నారు. మందకృష్ణ మాదిగ బిజెపికి లాభం చేకూరేలా మాట్లాడుతున్నారని జగ్గారెడ్డి విమర్శించారు. మందకృష్ణ మాదిగ బిజెపి బౌండరీలో ఉండి మాట్లాడుతున్నారన్నారు. బంగారు లక్ష్మణ్‌ను బిజెపి నవ్వులపాలు చేసినప్పుడు మంద కృష్ణ కనీసం స్పందించలేదని జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరా కుమార్‌ను లోక్‌సభ స్పీకర్ చేసింది కాంగ్రెస్ కాదా? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. జిమ్మిక్కులతో అధికారంలోకి రావాలన్నదే మోడీ, అమిత్ షా విధానమన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీకి అవమానం తక్కువ, రాజపూజ్యం ఎక్కువ
కాంగ్రెస్ పార్టీకి అవమానం తక్కువ, రాజపూజ్యం ఎక్కువ అని కాంగ్రెస్ పార్టీ నేత జగ్గారెడ్డి అన్నారు. పార్టీకి రాజ పూజ్యం 16 ఉంటే అవమానం 2 ఉందని ఆయన చెప్పారు. కవితకు బెయిలిస్తే మొదటికే మోసం వస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కుటుంబానికి ఎల్లప్పుడు మంచి జరగాలని కోరుకుంటున్నానన్నారు. అయితే ఆ కుటుంబం అధికారం కోసం అడ్డదార్లు తొక్కలేదని ఆయన గుర్తు చేశారు. రాహుల్‌గాంధీ కుటుంబం త్యాగాల కుటుంబమని ఆయన అభివర్ణించారు. బిజెపి పదవుల కోసమే ఏర్పడ్డ పార్టీ అని ఆయన చెప్పారు.

ఎంపి అనిల్ కుమార్ యాదవ్‌కు జగ్గారెడ్డి స్పెషల్‌గిప్ట్
గాంధీభవన్‌కు వచ్చిన రాజ్యసభ ఎంపి అనిల్ కుమార్ యాదవ్‌కు కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. ఇటీవలే రాజ్యసభ ఎంపిగా ప్రమాణ స్వీకారం చేసి వచ్చిన అనిల్ కుమార్ యాదవ్ గాంధీభవన్‌లో జగ్గారెడ్డిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. అనిల్ కుమార్‌ను ఆశీర్వదించిన జగ్గారెడ్డి తన మెడలోని గోల్డ్ చైన్ తీసి అనిల్ కు అలంకరించారు. దీంతో కార్యకర్తలందరూ చప్పట్లతో జగ్గారెడ్డిని ప్రశంసించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular