-
పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు బిగ్ షాక్
-
బీజేపీలో చేరిన నలుగురు బీఆర్ఎస్ కీలకనేతలు
-
సైదిరెడ్డి, సీతారాం నాయక్, గెడం నగేష్, జలగం వెంకట్రావు జంప్
పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన తరుణ్ చుగ్
పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన నలుగురు కీలక నేతలు బీజేపీలో చేరారు. హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే శానంరెడ్డి సైదిరెడ్డి, మరో మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు, ఆదిలాబాద్ మాజీ ఎంపీ గెడం నగేష్, మహబూబాబాద్ మాజీ ఎంపీ సీతారాం నాయక్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ మేరకు ఆదివారం ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర ఇన్ చార్జ్ తరుణ్ చుగ్, ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్ ఆధ్వర్యంలో వారు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆ నలుగురు నేతలకు బీజేపీ కండువా కప్పి పార్టీలోకి తురుణ్ చుగ్ ఆహ్వానించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న సైదిరెడ్డి ఇటీవల హుజూర్ నగర్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ కీలకనేతగా పేరొందిన జలగం వెంకట్రావు 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. అప్పట్నుంచి అసంతృప్తితో ఉన్న జలగం వెంకట్రావు బీజేపీలో చేరారు.
వీరే కాకుండా రానున్న రోజుల్లో మరికొందరు బీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరనున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పని అయిపోయిందని విమర్శించారు. తెలంగాణలో గతంలో కంటే ఎక్కువ పార్లమెంట్ సీట్లను బీజేపీ కైవసం చేసుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎలాంటి ఆరోపణలు లేకుండా , అవినీతి మచ్చ లేకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశం కోసం పనిచేస్తున్నారని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పొంగులేటి సుధాకర్ రెడ్డి తదితర నేతలు పాల్గొన్నారు.