ధరణి సమస్యల కారణంగా అనేక మంది రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే స్పెషల్ డ్రైవ్ నిర్వహించాం
ఆల్ పార్టీ సమావేశానికి రాని పార్టీలు
సలహాలు, సూచనలు రెవెన్యూ శాఖ సెక్రటరీకి రాతపూర్వకంగా పంపించాలి
కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి
ధరణి సమస్యల పరిష్కారం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకోబోతుందని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి అన్నారు. ధరణి సమస్యల కారణంగా అనేక మంది రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని తాము అధికారంలోకి వచ్చాక స్పెషల్ డ్రైవ్ నిర్వహించి దాదాపు 2 లక్షల దరఖాస్తులను పరిష్కరించగలిగామన్నారు.
ఆల్ పార్టీ మీటింగ్ అనంతరం ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ఈ విషయంలో ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహిస్తే బిజెపి, బిఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీలు రాలేదని ఆయన విమర్శించారు. ఆ పార్టీలు సమావేశానికి రాకపోయినా పర్వాలేదు కానీ, మీ పార్టీ సలహాలు, సూచనలు రెవెన్యూ శాఖ సెక్రటరీకి కనీసం రాతపూర్వకంగానైనా పంపించి సహకరించాలని ఆయన కోరారు. ఇది ప్రజలకు ఉపయోగపడే అంశమని అందువల్ల అందరూ సహకరించాలని ఆయన కోరారు. గతంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కావద్దన్నదే తన ప్రయత్నం అని చెప్పారు.
కొత్త రెవెన్యూ చట్టంపై గురువారం అఖిలపక్ష సమావేశం
కొత్త రెవెన్యూ చట్టంపై గురువారం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. హైదరాబాద్ ఫతే మైదాన్ క్లబ్‌లో ఈ పార్టీ సమావేశం జరిగింది. ధరణి అధ్యయన కమిటీ కన్వీనర్ కోదండరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి సిపిఐ, సిపిఎం, టిజేఎస్ పార్టీలతో సహా ధరణి సమస్యలపై పోరాటం చేసిన నేతలు, మేధావులు హాజరయ్యారు. కొత్త చట్టంలో ఉండాల్సిన అంశాలపై నేతలు, మేధావుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. ఈ అఖిల పక్ష సమావేశానికి బిఆర్‌ఎస్, బిజెపి, ఎంఐఎం పార్టీలు దూరంగా ఉన్నాయి.