Friday, November 15, 2024

తేమ, తాలు పేరుతో ఇబ్బంది పెట్టే మిల్లర్లపై కఠిన చర్యలు

  • సన్న వడ్ల కొనుగోలుకు ప్రత్యేక కొనుగోలు కేంద్రాలపై ఆరా
  • పౌరసరఫరాల శాఖ కాల్ సెంటర్లు రైతులకు 24 గంటలు అందుబాటులో ఉండాలి
  • ధాన్యం కొనుగోళ్లపై మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట కలెక్టర్లతో మంత్రి సురేఖ వీడియో కాన్ఫరెన్స్

వరి ధాన్యం కొనుగోళ్లలో తేమ, తాలు పేరుతో ఇబ్బంది పెట్టే మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ కలెక్టర్లను ఆదేశించారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వమ, ఇచ్చిన మాటకు కట్టుబడి రైతు రుణమాఫీ, సన్నాలకు ఎంఎస్‌పికి అదనంగా ఒక్కో క్వింటాల్ కు రూ.500 బోనస్ ఇచ్చి చేతల ప్రభుత్వంగా నిరూపించుకుందని అన్నారు. ధాన్యం కొనుగోలు తీరుతెన్నులపై ఉమ్మడి మెదక్ జిల్లా మంత్రి హోదాలో హైదరాబాద్‌లోని సచివాలయం సమావేశ మందిరంలో మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట కలెక్టర్లతో మంత్రి సురేఖ గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట జిల్లాల కలెక్టర్లు రాహుల్ రాజ్, వల్లూరు క్రాంతి, మిక్కిలినేని మను చౌదరి ఈ వీడియా కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఈ సీజన్‌లో రికార్డు స్థాయిలో 80 లక్షల టన్నుల ధాన్యం సేకరణను ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని స్పష్టం చేశారు.

దీని వల్ల ప్రత్యేక కార్యాచరణతో ధాన్యం కొనుగోళ్ళను చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించారు. రోజువారీ ధాన్యం సేకరణ, సేకరించిన దొడ్డు రకం, సన్న రకం ధాన్యం వివరాలు, కొనుగోలు కేంద్రాలు, రైతులు, రైతులకు చేసిన చెల్లింపుల వివరాలతో కూడిన సమగ్ర నివేదికను ఏ రోజుకారోజు తన కార్యాలయానికి పంపాలని మంత్రి సురేఖ కలెక్టర్లను ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకాల మేరకు ధాన్యం కొనుగోళ్ళు జరుగుతున్నాయా లేదా అని కలెక్టర్లను ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు తీరుతెన్నులపై మంత్రి ఆరా తీశారు. ధాన్యం కొనుగోళ్ళతో బాటు రైతుల ఖాతాల్లో డబ్బులు ఎన్ని రోజుల్లో జమ అవుతున్నాయని కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మద్దతు ధర, బోనస్ చెల్లింపులు ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు రైతులకు అందుతున్నదీ లేనిది నేరుగా రైతులతో మాట్లాడి, క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకోవాలని మంత్రి సురేఖ అధికారులను ఆదేశించారు.

సేకరించిన ధాన్యాన్ని మిల్లర్లతో మాట్లాడి వీలైనంత త్వరలో మిల్లులకు తరలించాలని కలెక్టర్లను ఆదేశించారు. ధాన్యం నిల్వలకు సంబంధించిన సమస్యలుంటే తన దృష్టికి తేవాలని మంత్రి సురేఖ కలెక్టర్లకు సూచించారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు సన్న వడ్ల కొనుగోలుకు ప్రత్యేక కొనుగోలు కేంద్రాలు, ప్రత్యేక కాంటాలు వుండేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్లు మంత్రి సురేఖకు తెలిపారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి ధాన్యం రాష్ట్రంలోకి అక్రమంగా ప్రవేశించకుండా తీసుకుంటున్న చర్యలపై మంత్రి సురేఖ కలెక్టర్లను ప్రశ్నించారు. పోలీస్, రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ అధికారుల సమన్వయంతో ధాన్యం అక్రమంగా రాష్ట్రంలోకి ప్రవేశించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్లు మంత్రికి వివరించారు. పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో నడిచే కాల్ సెంటర్లు 24 గంటల పాటు రైతులకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని మంత్రి కలెక్టర్లకు సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు భోజనాలు అందించే అంశాలను పరిశీలించాలని మంత్రి సూచించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular