Wednesday, November 13, 2024

బిజెపి కులగణనకు సానుకూలమా..? వ్యతిరేకమా..?

  • ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీలకు బిజెపి వ్యతిరేకం
  • బిజెపి నేత లక్ష్మణ్ కొన్ని వర్గాలను
  • కించపరిచేలా మాట్లాడుతున్నారు
  • స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసి రిజర్వేషన్ ఉండాలా వద్దా లక్ష్మణ్ చెప్పాలి
  • బిసి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్

బిజెపి నేత లక్ష్మణ్ అంటే కొంత గౌరవం ఉండేదని, ప్రస్తుతం లక్ష్మణ్ కొన్ని వర్గాలను కించపరిచేలా మాట్లాడటం వల్ల ఆయన గౌరవాన్ని కోల్పోతున్నారని బిసి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. బిజెపి కులగణనకు సానుకూలమా..? వ్యతిరేకమా..? అన్న విషయాన్ని ప్రజలకు చెప్పాలని మంత్రి పొన్నం డిమాండ్ చేశారు. కులగణనపై కేంద్ర బిజెపి మీద ఒత్తిడి తెస్తారా లేకుంటే బలహీన వర్గాల ద్రోహిగా ఉంటారా..? తేల్చుకోవాలని మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల కోసం కులగణన జరుపుతున్నామని బిజెపి నేతలు అంటున్నారని, సర్వేను అడ్డుకోవాలని చూస్తే లక్ష్మణ్ ద్రోహిగా మిగిలిపోతారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీలకు బిజెపి వ్యతిరేకమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

గాంధీభవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి పొన్నం విలేకరులతో మాట్లాడుతూ బిజెపి నాయకులు ఎంత సేపు రాజకీయంగా మతాన్ని వాడుకోవడమే పనిగా పెట్టుకున్నారని ఆయన మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసి రిజర్వేషన్ ఉండాలా వద్దా అన్న విషయాన్ని లక్ష్మణ్ చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. బలహీన వర్గాల వ్యక్తి ప్రధాని మోడీ అని చెప్పే బిజెపి బిసిలకు ఏం లాభం చేసిందని మంత్రి పొన్నం సూటిగా ప్రశ్నించారు. రిజర్వేషన్‌లపై బిజెపిది ద్వంద్వ వైఖరి విడనాడాలని, దీనికి బిజెపి సమాధానం చెప్పాలని మంత్రి పొన్నం డిమాండ్ చేశారు. సివిల్ సొసైటీలో అందరి అభిప్రాయం తీసుకొని కులగణన చేస్తున్నామని ఆయన తెలిపారు. కులగణనకు అడ్డం పడటానికి బిజెపి చాలా ప్రయత్నాలు చేస్తుందన్నారు. ప్రభుత్వం ఏ డాక్యుమెంట్ అడగడం లేదని, సమాచారాన్ని ప్రభుత్వం గోప్యంగా ఉంచుతుందని ఆయన పేర్కొన్నారు. బిఆర్‌ఎస్ సర్వే చేపట్టలేకపోయిందని, తాము చేస్తున్నామని దీనికి సహకరించాలని మంత్రి పొన్నం సూచించారు.

బిజెపి ఎల్పీ నేత పదవి కూడా బిసికి ఇవ్వలేదు….
బిజెపికి ఉన్న బిసి అధ్యక్షుడిని తొలగించారని మంత్రి పొన్నం గుర్తుచేశారు. ఎల్పీ నేత పదవి కూడా బిసికి ఇవ్వలేదని మంత్రి పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు. కులగణన నివేదికను సకల జనుల సర్వే మాదిరిగా కోల్డ్ స్టోరేజ్ లో పెట్టమన్నారు. కుల గణనపై బిఆర్‌ఎస్ వైఖరి ఏమిటో చెప్పాలని మంత్రి పొన్నం ప్రశ్నించారు. మూసీ యాత్రలో కుల వృత్తిదారుల సమస్యలు విన్నామని మంత్రి పొన్నం తెలిపారు. మూసీ ప్రక్షాళనకు చేతనైతే సలహాలు, సూచనలు ఇవ్వాలని మంత్రి కోరారు. కెటిఆర్, హరీష్ అడిగినట్టు హైదరాబాద్‌లో మూసీ పరివాహక ప్రాంతాల్లో కూడా తిరుగుతామన్నారు. చట్టానికి లోబడి ఒప్పించి, మెప్పించి భూ సేకరణ చేస్తామని మంత్రి పేర్కొన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి ఎన్ని హామీలు అమలు చేసిందో బిజెపి తెలపాలని మంత్రి పొన్నం డిమాండ్ చేశారు.

రాష్ట్రానికి రావాల్సిన నిధులు మీరు తీసుకురావాలి…
ముందు మీ పదేళ్ల హామీలు అమలుపై చర్చ పెట్టాలని బిజెపి, బిఆర్‌ఎస్ నాయకులకు మంత్రి పొన్నం సెటైర్ వేశారు. వాళ్లని, వీళ్లని అరెస్టు చేసి బండి సంజయ్ జైల్లో పెడతా అంటున్నారని మంత్రి పొన్నం గుర్తుచేశారు. జైలు కట్టినం కెసిఆర్ కుటుంబం అంతా జైలుకే అని బండి సంజయ్ అన్నారని, కరీంనగర్ జైళ్లో రూం కట్టించాడో లేదో చూడాలని మంత్రి పొన్నం ఎద్దేవా చేశారు. కెటిఆర్, కెసిఆర్, హరీష్ రావులను అరెస్ట్ చేస్తామని తాము అనలేదని ఆయన పేర్కొన్నారు. బండి సంజయ్ వ్యక్తిగతంగా తనకు సోదరుడని, కానీ, రాజకీయంగా తమపై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కిషన్ రెడ్డి ఏవిధంగా హైదరాబాద్‌కు ఉపయోగపడుతున్నారో టవర్ సర్కిల్ దగ్గర చర్చకు సిద్ధమా అంటే సప్పుడు చేయలేదని మంత్రి పొన్నం పేర్కొన్నారు. చేతనైతే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లు కేంద్రం నుంచి అదనపు నిధులు తెప్పించాలని మంత్రి పొన్నం కోరారు. పెండింగ్ ప్రాజెక్టులకు వెంటనే ఆమోద ముద్ర వేయించాలని మంత్రి పొన్నం డిమాండ్ చేశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు మీరు తీసుకురండి, లేదంటే మమ్మల్ని తీసుకెళ్లండి అడుగుతామని ఆయన పేర్కొన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular