Friday, September 20, 2024

జమిలి ప్రభావం.. ముందుగా ఇక్కడ రద్దయ్యే రాష్ట్ర అసెంబ్లీలు ఇవే

తీవ్ర వివాదాస్పదమైన జమిలి ఎన్నికల దిశగా కేంద్ర ప్రభుత్వం బుధవారం కీలక అడుగు వేసింది. దీని అమలు తీరుపై ఎన్నో సందేహాలు ఉన్నా.. ఇదేదో చాలా సింపుల్‌ వ్యవహారంగా కేంద్రం భావిస్తున్నట్టు కనిపిస్తున్నది. వాస్తవానికి మంగళవారం మీడియాతో మాట్లాడిన కేంద్ర హోం మంత్రి అమిత్‌షా.. ఈ పదవీకాలంలోనే జమిలి ఎన్నికలను అమల్లోకి తీసుకొస్తామని ప్రకటించారు. ఆ మరుసటి రోజే కేంద్రం.. రామ్‌నాథ్‌ కోవింద్‌ కమిటీ సిఫారసులను ఆమోదించింది. 2029లో జమిలి ఎన్నికలు అమల్లోకి వచ్చిన పక్షంలో దాదాపు 17 రాష్ట్ర అసెంబ్లీల పదవీకాలం కనీసం మూడేళ్లకు ముందే ముగియనున్నది.

లోక్‌సభ, వివిధ రాష్ట్రాల అసెంబ్లీలు, దేశవ్యాప్తంగా ఉన్న స్థానిక సంస్థలకు ఏక కాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు తగిన సిఫారసులు చేయాలంటూ గత మోదీ ప్రభుత్వం కోవింద్‌ కమిటీని కోరింది. ఈ నేపథ్యంలో చర్చలు నిర్వహించిన కమిటీ.. తన సిఫారసులను గత లోక్‌సభ ఎన్నికలకు ముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది. తొలుత లోక్‌సభ, అసెంబ్లీలకు ఒక విడుతలో ఎన్నికలు నిర్వహించడం, తదుపరి వంద రోజులలోపు స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించడం ద్వారా జమిలి సాధ్యపడుతుందని కోవింద్‌ కమిటీ పేర్కొన్నది. జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగంలో పలు కీలక సవరణలు చేయాల్సి ఉంటుంది. తొలి విడుతలో లోక్‌సభ, అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడానికి రాజ్యాంగ సవరణలు అవసరమైనప్పటికీ.. పార్లమెంటు ఆమోదం పొందితే రాష్ట్రాల ర్యాటిఫికేషన్‌ అవసరం ఉండదు. అయితే.. వంద రోజుల తర్వాత నిర్వహించే స్థానిక ఎన్నికలకు మాత్రం కనీసం సగం రాష్ట్రాలు ఆమోదం తెలపాల్సి ఉంటుంది.

బీజేపీకి లోక్‌సభలో సొంతంగా 240 సీట్లు ఉన్నాయి. సొంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసుకోలేని స్థితిలో టీడీపీ, జనతాదళ్‌ (యూ), లోక్‌ జనశక్తి పార్టీ (రాంవిలాస్‌) వంటి పార్టీల మద్దతు ఆధారంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. జమిలి ఎన్నికలకు ఈ పక్షాలు మద్దతు ఇవ్వడంపై సందేహాలు ఉన్నాయి. కానీ.. బీజేపీ మాత్రం ఈ విషయంలో ఎన్డీయే పక్షాలన్నీ బీజేపీకి మద్దతుగా ఉన్నాయని, ఈ సంస్కరణల ప్రక్రియకు తమకు తగినంత సంఖ్యాబలం ఉన్నదని చెబుతున్నది.

ఇప్పటి నుంచే ఏర్పాట్లు
కేంద్రం భావిస్తున్నట్టు 2029 ఎన్నికల నాటికి జమిలి ప్రక్రియ అమల్లోకి రావాలంటే.. అందుకు ఏర్పాట్లు ఇప్పటి నుంచే మొదలు పెట్టాల్సి ఉంటుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. లోక్‌సభ, అసెంబ్లీల కాలపరిమితులను పార్లమెంటు సవరించిన తర్వాత అనేక రాష్ట్రాల అసెంబ్లీలు తమ కాలపరిమితికంటే ముందే 2029లో రద్దవుతాయి. వాటికి 2029 లోక్‌సభ ఎన్నికలతోపాటే పోలింగ్‌ నిర్వహిస్తారు.

జమిలి ఎన్నికలకు మార్గదర్శిక ప్రణాళికను ప్రతిపాదించిన కోవింద్‌ కమిటీ దీనికి ఎప్పుడు సిద్ధపడతారనే అంశాన్ని కేంద్ర ప్రభుత్వానికే వదిలిపెట్టింది. గత ఏడాది పది రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అవి మళ్లీ 2028 నాటికి ఎన్నికలకు వెళతాయి. అనంతరం ఏర్పడే కొత్త ప్రభుత్వాల పదవీకాలం సుమారుగా ఏడాదికి అటూ ఇటూగా ఉండొచ్చని తెలుస్తున్నది. వాటిలో హిమాచల్‌ ప్రదేశ్‌, మేఘాలయ, నాగాలాండ్‌, త్రిపుర, కర్ణాటక, తెలంగాణ, మిజోరం, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌ ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు మళ్లీ 2027లో నిర్వహించనున్నారు. అంటే.. ఆ రాష్ట్రాల్లో ఏర్పడే కొత్త ప్రభుత్వాలు సుమారు రెండేళ్లు అధికారంలో ఉంటాయి. ఇక పశ్చిమబెంగాల్‌, తమిళనాడు, అసోం, కేరళ అసెంబ్లీ ఎన్నికలు 2026లో నిర్వహించనున్నందున వాటి పదవీకాలం మూడేళ్లకు పరిమితమవుతుంది. అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కిం, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, హర్యానాకు మాత్రం జమిలితో ప్రభావితం కావని చెబుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular