-
ఆ రెండు నియోజకవర్గాల్లో కమ్మ ఓట్లే కీలకం ..!
-
‘చే’జారకుండా సిఎం రేవంత్ వ్యూహాలు
-
మల్కాజిగిరి అభ్యర్థిగా సీనియర్ పాత్రికేయుడు,
-
చేవెళ్ల అభ్యర్థిగా రంజిత్రెడ్డి..?
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు దక్కించుకునే వ్యూహాంతో సిఎం రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా మల్కాజిగిరి, చేవెళ్ల ఎంపి సీటు విషయంలో అభ్యర్థి ఎంపిక విషయంలో సిఎం రేవంత్రెడ్డి ఆచితూచి అడుగు వేస్తున్నారు. దేశంలోనే అతి పెద్ద పార్లమెంట్ నియోజకవర్గం మల్కాజిగిరి కావడం, 33 లక్షల పైచిలుకు ఓటర్లు ఉండడం, దీంతోపాటు వివిధ కులాల, మతాల, వివిధ రాష్ట్రాలకు చెందిన ఓటర్లను ఆమోదయోగ్యమైన అభ్యర్థి నిలబెట్టడంతో పాటు ఆ అభ్యర్థిని గెలిపించుకోవాలన్న వ్యూహాంతో సిఎం ముందుకెళుతున్నట్టుగా పిసిసి వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే ఈ నియోజకవర్గం నుంచి సినీ హీరో అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి, మధు యాష్కీ గౌడ్, మైనంపల్లి హనుమంతరావు, నిర్మాత బండ్ల గణేష్, బరిలో ఉన్నారని ప్రముఖంగా పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో మైనంపల్లి హనుమంతరావు మెదక్ సీటుపై ప్రధానంగా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ నుంచి కొత్తగా మరో వ్యక్తికి ఈ నియోజకవర్గ సీటును కేటాయించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. ఈ కొత్త అభ్యర్థిని పోటీలో దింపి గెలిపించుకోవాలని సిఎం రేవంత్ భావిస్తున్నట్టుగా తెలిసింది. ఈ అభ్యర్థి మల్కాజిగిరి నియోజకవర్గానికి చెందని వారని, ఆయన ప్రముఖ దినపత్రికలో చాలా ఏళ్లుగా పనిచేస్తున్నట్టుగా సమాచారం. ఈ అభ్యర్థి బిసి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం, వీరి సామాజిక వర్గానికి ఈ నియోజకవర్గంలో సుమారుగా 3 లక్షల పైచిలుకు ఓట్లు ఉండడం, ప్రముఖులు, విద్యావంతులతో ఆయనకు పరిచయాలు ఉండడం కూడా ఈయన వైపు సిఎం రేవంత్ దృష్టి సారించినట్టుగా తెలిసింది.
కమ్మ ఓట్లు 3 నుంచి 4 లక్షలు
ఈ నియోజకవర్గంలో కీలకమైన కమ్మ సామాజిక వర్గం ఓట్లు 3 నుంచి 4 లక్షల వరకు ఉంటాయి. దీంతోపాటు స్థానిక బిసి కులానికి చెందిన వ్యక్తి కావడంతో ఆయన గెలుపు సునాయాసం అవుతుందని సిఎం భావిస్తున్నట్టుగా తెలిసింది. అందులో భాగంగానే ప్రముఖ దినపత్రిక చైర్మన్ను సిఎం కలవడంతో మల్కాజిగిరి, చేవెళ్ల నియోజకవర్గాల్లోని కమ్మ ఓటర్లకు సంబంధించి చర్చించినట్టుగా తెలిసింది. దీంతోపాటు ఆయా ప్రాంతాల్లోని టిడిపి ఓటర్లను కూడా తమవైపు తిప్పుకునేలా సిఎం రేవంత్ వ్యూహాలను రూపొందిస్తున్నట్టుగా సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల్లో 10 లక్షలకుపైగా కమ్మ ఓట్లు ఉన్నాయి. ఆయా ఓటర్లను తమవైపు తిప్పుకునేలా సిఎం పక్కా ప్రణాళికతో ముందుకెళుతున్నట్టుగా పిసిసి వర్గాలు పేర్కొంటున్నాయి.
గత ఎన్నికల్లో 6 లక్షల మెజార్టీతో….
మల్కాజిగిరి ఎంపిగా అభ్యర్థిగా బిజెపి నుంచి ఈటల రాజేందర్కు కేటాయించారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నుంచి బిసి అభ్యర్థికి టికెట్ ఇవ్వాలని సిఎం రేవంత్ కూడా నిర్ణయించినట్టుగా తెలిసింది. గత ఎన్నికల్లో మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుంచి రేవంత్రెడ్డి ఆరు లక్షల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం దక్కించుకోవడంతో అంతే బలమైన వ్యక్తిని ఇక్కడ రంగంలోకి దింపాలన్న రాజకీయ చతురతతో సిఎం రేవంత్ ముందుకు సాగుతున్నారని తెలెలుస్తోంది. ఇక రెండో స్థానంలో నిలిచిన మర్రి రాజేశేఖర్ రెడ్డికి 5 లక్షల 93 వేల ఓట్లు వచ్చాయి. దీంతో ఈ స్థానాన్ని సిఎం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని తెలుస్తోంది.
రంజిత్రెడ్డికి అనుకూలంగా సర్వేలు…
ఇక చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రస్తుతం నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ తరపున చేవెళ్ల అభ్యర్థిగా పట్నం సునీతా మహేందర్ రెడ్డి పేరు ప్రచారంలోకి వచ్చినా చివరినిమిషంలో అది ఆగిపోయినట్టుగా తెలిసింది. ప్రస్తుతం బిఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపిగా ఉన్న రంజిత్రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావాలని ఆ పార్టీ పెద్దలు ఆలోచిస్టున్నట్టుగా సమాచారం. ఇప్పటికే బిజెపి అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్ రెడ్డిని ఆ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నుంచి సునీతా మహేందర్ రెడ్డి కంటే రంజిత్రెడ్డి అయితే బాగుంటుందని కాంగ్రెస్ చేపట్టిన సర్వేలో తేలినట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆయన్ను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చేలా కొందరు కాంగ్రెస్ పెద్దలు ఆయనతో చర్చలు జరుపుతున్నట్టుగా తెలిసింది. అయితే ఈ విషయాన్ని బిఆర్ఎస్ ఎంపి రంజిత్రెడ్డి మాత్రం ఖండిస్తున్నారు. తనకు పార్టీ మారే ఆలోచన లేదని ఆయన పేర్కొంటుండడ విశేషం.