Tuesday, December 24, 2024

Matka Review బాక్సాఫీస్‌ ముందు మట్కా మస్కా

  • కొత్తదనం లేని కథ
  • హీరోలకి కథలు ఎంచుకోవడం రావడం లేదా?
  • పైగా మెగా హీరో అయ్యిండి ఇలాంటి కథా?
  • మెగా ఫ్యామిలీకి ఇక హిట్లు లేవా?
  • గేమ్‌ ఛేంజ్‌ కూడా డవుటే అంటున్న నెటిజన్లు?
  • హిట్‌ అవుతుందనే ధీమాతో ఫ్రీ పబ్లిసిటాలా?

మెగా ఫ్యామిలీకి ఇటీవ‌ల వ‌రుస‌గా విజ‌యాలు దూరంగానే ఉంటున్నాయి. మెగా హీరో వ‌రుణ్ తేజ్‌కు మ‌ళ్లీ నిరుత్సాహ‌మే మిగిలింది. తిరుప‌తికి వెళ్లి మోక‌రిల్లినా.. స‌క్సెస్ అందుకోలేక‌పోయాడు. ప్ర‌తి సినిమా, ఇంటిలో ఏదైనా ఫంక్ష‌న్ చేసినా మెగా ఫ్యామిలీ తిరుప‌తికి వెళ్లి దండం పెట్టుకుని రావ‌డం ఆన‌వాయితీ. అయితే, చాలా రోజుల త‌ర్వాత సినీ విజ‌యానికి దూర‌మైన మెగా ఫ్యామిలీ హీరో వ‌రుణ్ తేజ్‌.. ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్‌తో ముందుకు వ‌చ్చాడు. కానీ, పాత క‌థ‌ను కొత్త‌గా చూపించ‌డంలో ద‌ర్శ‌కుడు విఫ‌లం కావ‌డంతో మ‌ట్కా.. బాక్సాఫీస్ ముందు మ‌స్కా కొట్టింది.

విజ‌యాలు, అప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా ఏదో ఓ క‌థ‌ను ప‌ట్టుకుని ముందుకెళ్తున్నహీరో వరుణ్ తేజ్‌..కొంత‌ గ్యాప్ త‌ర్వాత మట్కా చిత్రంతో బాక్సాఫీస్‌ ముందుకొచ్చారు. పలాసతో ఆకట్టుకున్న కరుణ కుమార్‌ తెరకెక్కించిన చిత్రమిది. వరుణ్‌ భిన్నమైన గెటప్పుల్లో కనిపించినా.. క‌థ‌నం మాత్రం దెబ్బ‌తీసింది. ఇప్ప‌టికే కొంత‌కాలంగా వ‌రుణ్ తేజ్‌కు స‌క్సెస్ రావ‌డం లేదు.

మ‌ట్కా క‌థ‌లోకి వెళ్తే..
బర్మా నుంచి వైజాగ్‌కు శరణార్థిగా వచ్చిన కుర్రాడు వాసు (వరుణ్‌ తేజ్‌) అనుకోని పరిస్థితుల్లో ఓ వ్యక్తిని హత్య చేసి చిన్నతనంలోనే జైలుకు వెళ్తాడు. అక్కడి జైలు వార్డెన్‌ నారాయణ మూర్తి (రవిశంకర్‌) తన స్వప్రయోజనాల కోసం వాసును ఓ ఫైటర్‌లా మారుస్తాడు. వాసు జైలు నుంచి రిలీజయ్యాక పని వెతుక్కుంటూ పూర్ణ మార్కెట్‌కు చేరుకుంటాడు. కొబ్బరికాయల వ్యాపారి అప్పలరెడ్డి (అజయ్‌ ఘోష్‌) దగ్గర పనికి చేరుతాడు. ఈ క్రమంలో చోటు చేసుకున్న ఓ గొడవలో కె.బి.రెడ్డి (జాన్‌ విజయ్‌) రౌడీ గ్యాంగ్‌ను చితక్కొట్టి అతడి ప్రత్యర్థి నానిబాబు (కిషోర్‌)కు దగ్గరవుతాడు. ఆ తర్వాత అతడి సపోర్ట్​తో పూర్ణ మార్కెట్‌కు లీడర్​గా ఎదుగుతాడు. అక్కడి నుంచి వాసు జర్నీ, ఎదురైన సవాళ్లే ఈ చిత్ర కథ.

ఈ క‌థ‌ను ద‌ర్శ‌కుడు ఏదో ఊహించుకుని… పుష్ప, కేజీయఫ్‌ కథ తరహాలోనే ఈ కథను తెరకెక్కించేందుకు ప్రయత్నం చేశారు. కానీ, కథలో బలమైన సంఘర్షణ కనిపించలేదు. ప్రేక్ష‌కుడికి ఎక్క‌డా ర‌స‌ప‌ట్టుగా అనిపించ‌లేదు. మట్కా ఆట చుట్టూరా సాగిన ఈ క‌థ‌లో అనామకుడైన హీరో ఈ ఆట ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థనే సంక్షోభంలోకి నెట్టగలిగేంత స్థాయికి ఎదిగాడనేదే క‌థ‌. కానీ, ఈ ఆటలో ఎలాంటి మెరుపులు కానీ, థ్రిల్లింగ్‌ మూమెంట్లు, అనుకోని అదృష్టాలేమీ కనిపించవు. దీంతో ఈ సినిమా ఏ దశలోనూ ఆసక్తి రేకెత్తించదు. సినిమా ఆధ్యంతం వచ్చే విరామ సన్నివేశాలు చ‌ప్ప‌గా.. రుచీప‌చీ లేకుండా ఏదో అలా సాగిపోయాయి.

ఇక‌, సెకండాఫ్​లో దేశ ఆర్థిక వ్యవస్థకు అడ్డంకిగా మారిన మట్కా ఆట కట్టించేందుకు, దాన్ని వెనక ఉండి నడిపించే వాసును పట్టుకునేందుకు అధికారులు, అలానే వాసుని పడగొట్టేందుకు తన ప్రత్యర్థులు వేసే ఎత్తులు ఇలా కథ అంతా సాగుతుంటుంది. అయితే ఇవన్నీ పెద్దగా గొప్పగా ఏమీ అనిపించవు. దీంతో ప్రేక్ష‌కుడు ఈ సినిమా సెకండాఫ్ మొత్తం ఇబ్బందిక‌ర వాతావ‌ర‌ణంలోనే చూస్తాడు. ఇక‌, ప్రీక్లైమాక్స్‌లో హీరో తన కూతురుకు చెప్పే మేక-నక్క కథ ప్రేక్షకుల సహనానికి ఓ పరీక్షనే చెప్పాలి. క్లైమాక్స్​లో హీరో ఆరు బుల్లెట్లున్న రివాల్వర్‌తో ఇరవై, ముప్పై మంది రౌడీల్ని చంపేయడంతో మ‌ళ్లీ ఏదో కొత్త వింత‌ను చూపించిన‌ట్లుగా ఫీల్ వ‌స్తుంది. ఫైనల్​గా సినిమాను ముగించిన తీరు కూడా ఏదో ముగిసింది అనే ఫీలింగ్ త‌ప్ప‌.. ఆసక్తిగా అనిపించదు. పాత సినిమాను మ‌ళ్లీ మ‌ళ్లీ చూస్తున్నామ‌నే ఫీలింగ్ మాత్ర‌మే మిగులుతుంది.

ఈ సినిమాలో వాసు మూడు కోణాల్లో సాగే పాత్రలో కనిపించగా.. వరుణ్ నటన ఫ‌ర్వాలేదు. వయసు పైబడిన పాత్రలో మెరుగ్గా న‌టించాడు. యాక్షన్‌ సీక్వెన్స్​లోనూ ఆకట్టుకున్నాడు. మీనాక్షి డీగ్లామర్‌ లుక్‌లో బాగానే అనిపించింది. కానీ, ఆమె పాత్రకు కథలో ప్రాధాన్యం దక్కలేదు. హీరోతో లవ్‌ట్రాక్‌ కూడా రొటీన్‌గానే సాగింది. సోఫియాగా నోరా ఫతేహి అందాల ప్రదర్శన చేసింది. కిషోర్, జాన్‌ విజయ్, నవీన్‌ చంద్ర, సలోని, అజయ్‌ ఘోష్‌ వీరి పాత్రలంతా బలంగా కనిపించలేదు. దర్శకుడు కరుణ కుమార్‌ రాసుకున్న కథలో కొత్తదనం లేదు. జీవీ ప్రకాశ్‌ సంగీతం కొంత మేర‌కు ఫ‌ర్వాలేదు.

మొత్తంగా మ‌ట్కా ఒక పాత క‌థ‌.. ఆక‌ట్టుకోలేని.. కొత్త రుచీ లేని.. మార్పులు లేకుండా ఫైట్ చేసే గ్యాంగ్‌స్టర్‌ డ్రామా!

ప్ర‌దాన వార్త‌లు

దురుద్దేశంతోనే తనపై కేసు పెట్టారన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com