* సీఎం కేసీఆర్ చెప్పినా పట్టించుకోం
* స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకం
* వీళ్లకు ఓటేయమని చెబుతున్న ప్రజలు
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడానికి పెద్దగా ఏమీ కనిపించట్లేదు. ముఖ్యంగా మేడ్చల్ బహిరంగ సభలో ఆయన ప్రసంగం చాలా పేలవంగా సాగింది. తెలంగాణ వచ్చిన కొత్తలో ఆయన చెప్పిన మాటల్ని ప్రజలెంతో ఓపికగా విన్నారు.. ఓట్లు వేశారు. గెలిపించారు. గతేడాది చంద్రబాబునాయుడిని బూచిగా చూపెట్టి.. ప్రజల్ని భయపెట్టి ఓట్లు దండుకున్నాడు. అయితే, మళ్లీ అవే పాత చింతకాయ పచ్చడి మాటల్ని చెబుతుంటే విని.. మేడ్చల్ ప్రజలు పెద్దగా పట్టించుకోలేదని అర్థమైంది. గత పదేళ్లలో కేసీఆర్ రాష్ట్రానికి చేసిన మేలు కంటే.. తన సొంత కుటుంబానికి చేసిన లాభమే ఎక్కువని ప్రజలు అనుకుంటున్నారు. అందుకే, ఆయన తెలంగాణ పోరాటం గురించి చెప్పిందే చెబితే మేడ్చల్ ప్రజలు పెద్దగా పట్టించుకోవలేదు. కాంగ్రెస్ పార్టీ గురించి ఎంత తక్కువ చేసి మాట్లాడినా.. తెలంగాణను ఇచ్చింది కాంగ్రెస్సేనని ప్రజలు భావిస్తున్నారనే విషయం అర్థమైంది.
సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తానని చెప్పి.. కాంగ్రెస్‌ను దారుణంగా కేసీఆర్ మోసం చేశారని ప్రజలకు ఎప్పుడో అర్థమైంది. బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత కేసీఆర్ తెలంగాణను వదిలేసి దేశ రాజకీయాల్లోకి అడుగుపెట్టడానికి ప్రయత్నించినప్పుడే తమ ఆలోచనా విధానంలో మార్పు వచ్చిందని ప్రజలు అంటున్నారు. ఇక కేసీఆర్ ఎన్ని చెప్పినా వినిపించుకునే పరిస్థితుల్లో లేమని ప్రజలు అనుకుంటున్నారు. కాంగ్రెస్‌ను ఎన్ని తిట్టినా, తమకు వాస్తవాలు తెలుసని భావిస్తున్నారు. పాత చింతకాయ పచ్చడి మాటలు చెబితే మళ్లీ నమ్మే పరిస్థితిలో లేమని మేడ్చల్ జిల్లా వాసులు అంటున్నారు. ఇప్పుడున్న ఔటర్ రింగ్ రోడ్డు ఎప్పుడో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందనే విషయాన్ని మర్చిపోలేదని ప్రజలు చెబుతున్నారు. గత రెండు దఫాలుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ జిల్లాను దారుణంగా దోచుకున్నారని.. ఇళ్లు కట్టుకునే పేద, మధ్యతరగతి ప్రజల్ని ఇబ్బంది పెట్టారని అనుకుంటున్నారు. ముఖ్యంగా, మంత్రి మల్లారెడ్డిని ఎట్టి పరిస్థితిలో గెలిపించమని ప్రజలు ముక్తకంఠంతో చెబుతున్నారు. ఈసారి కేసీఆర్ ఎంత విన్నవించినా.. మల్లారెడ్డిని గెలిపించే స్థాయిలో తాము లేమని మేడ్చల్ బహిరంగ సభకు విచ్చేసిన ప్రజల్లో కొంతమంది టీఎస్ న్యూస్‌తో చెప్పడం విశేషం. ఈ విషయం డిసెంబరు 3న ప్రతిఒక్కరికీ అర్థమవుతుందని చెబుతున్నారు.