- రిజర్వేషన్లపై బిజెపి నేతలు మాట్లాడితే తరిమికొట్టాలి
- లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు బిజెపి పార్టీకి తగిన బుద్ధి చెప్పాలి
- కురుమల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పొన్నం ప్రభాకర్
బిసిల రిజర్వేషన్‌లను బిజెపి టచ్ చేస్తే ఊరుకోమని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రిజర్వేషన్లపై బిజెపి నేతలు మాట్లాడితే తరిమికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. సోమవారం గాంధీభవన్‌లో కురుమల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమావేశంలో పొన్నం మాట్లాడుతూ బిజెపి లీడర్లు ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలని మంత్రి హెచ్చరించారు. బిజెపి కుట్రలను ప్రజలు గమనించాలని, లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని ఆయన అన్నారు. మోడీ మళ్లీ గెలిస్తే భారత్‌ను మరో పాకిస్థాన్‌గా మారుస్తారంటూ ఆయన ఆరోపించారు. బిజెపి బిసిలకు వ్యతిరేక పార్టీ అని అందుకే రిజర్వేషన్లను ఎత్తివేయాలని చూస్తుందన్నారు. బిజెపికి 400 సీట్లు వస్తే బిసిలు ఆగమేనని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. బిజెపి రాముణ్ణి నమ్ముకొని రాజకీయం చేస్తుందని ఆయన ఫైర్ అయ్యారు. బిసి వ్యతిరేక బిజెపికి ఎన్నికల్లో తగిన బుద్ధి గుణపాఠం చెప్పాలని మంత్రి పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ను అప్పట్లో యూటీ చేయాలని కొందరు అడిగితే సోనియా ఒప్పుకోలేదన్నారు. ఒక మంత్రిగా కాదు బిసి బిడ్డగా మాట్లాడుతున్నా రిజర్వేషన్లను కాపాడుకోవడానికి ప్రతి ఊర్లలో జేఎసిలు ఏర్పాటు చేసుకొని పోరాడుదాం, తెలంగాణ పోరాటం లాగా రిజర్వేషన్లు కాపాడుకునే పోరాటానికి సిద్ధం కావాలని బిసిలకు ఆయన పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ కోట్ల మంది మంగళ సూత్రాలను నిలబెట్టింది
కాంగ్రెస్ కోట్ల మంది మంగళ సూత్రాలను నిలబెట్టిందని, వాటిని మోడీ గుంజుకొని ముస్లింలకు పంచి పెడతాం అంటున్నారని మంత్రి పొన్నం ఆరోపించారు. దేశ సంపదను మోడీ, ఆదానీ, అంబానీలకు కట్టబెట్టాలని చూస్తున్నాడని ఆయన ఆరోపించారు. బిజెపి కులగగణకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు లో అఫిడవిట్ వేసిందని, మండల్ కమిషన్‌కు వ్యతిరేకంగా కమండల్ కమిషన్ తెచ్చిందన్నారు. బిజెపి ప్రభుత్వం అట్టడుగు వర్గాలకు చేసింది ఏమీ లేదని, రెండుదశల పోలింగ్ తర్వాత బిజెపికి మెజారిటీ సీట్లు రావని సర్వేలు చెబుతున్నాయన్నారు.
మోడీ, కేడీ ఇద్దరూ ఒక్కటయ్యారు: బీర్ల అయిలయ్య
ప్రధాని మోడీ, మాజీ సిఎం కెసిఆర్, గొల్ల కురుమలను మోసం చేశారని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. గొర్లు, బర్లు అని కెసిఆర్ మోసం చేశారని, బిసి అని చెప్పుకుంటూ మోడీ బిసి రిజర్వేషన్లను ఎత్తేస్తా అంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ, కేడీ ఇద్దరూ ఒక్కటై బిసిలను మోసం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మతాల పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆయన సీరియస్ అయ్యారు. మతాలు, కులాలను అడ్డుపెట్టుకొని మోడీ రాజకీయం చేస్తున్నారని, మరోసారి ఆయన అధికారంలోకి వస్తే దేశప్రజలు ఆగమేనన్నారు. గుడిలో దేవుడు ఉండాలి, భక్తి మనసులో ఉండాలని ఆయన హితవు పలికారు.
బిసిలకు ఎక్కువ సీట్లు ఇవ్వలేకపోయాం: ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్ గౌడ్
బిసిలకు ఎక్కువ సీట్లు ఇవ్వాల్సి ఉండే కానీ, అనివార్య కారణాల వల్ల ఇవ్వలేకపోయామని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. బిసి వర్గంలో కురుమ సంఖ్య పెద్దదేనని ఆయన తెలిపారు. కురుమలకు రాజకీయ అవకాశాలు రావాలన్నారు. గద్వాల్‌లో సరితకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది, కానీ, అక్కడ కొన్ని కారణాల వల్ల ఆమె ఓటమిపాలయ్యిందని ఆయన వెల్లడించారు. సరిత గెలిస్తే కురుమలకు మరింత బలం అయ్యేదన్నారు. బీర్ల ఐలయ్య గెలిచి కురుమలకు ప్రతినిధిగా నిలిచారని ఆయన తెలిపారు. కురుమలకు కార్పొరేషన్ పదవులు కూడా దక్కాలన్నారు. కురుమ కులానికి చెందిన కొల్లూరు మల్లప్ప మొట్టమొదటి సారిగా హైదరాబాద్ స్టేట్ పిసిసి చీఫ్‌గా పనిచేశారని ఆయన పేర్కొన్నారు.