సిగ్నల్స్, ఇంటర్నెట్ తో అవసరమే లేదు
స్మార్ట్ ఫోన్.. ఈ ఆధునిక యుగంలో స్మార్ట్ ఫోన్ లేని ప్రపంచాన్ని అస్సలు ఊహించుకోలేము. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే. వ్యవసాయ కూలీ నుంచి మొదలు బిజినెస్ మ్యాన్ వరకు అందరూ స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్నారు.
ఐతే కొన్ని సందర్బాల్లో మొబైల్ నెట్ వర్క్ సమస్యలు ఎదురవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఇంటీరియర్స్ ప్రాంతాల్లో, కొండల్లో, అటవీ ప్రాంతాల్లో మొబైల్ నెట్ వర్క్ సిగ్నల్స్ అందవు. అంతే కాకుండా మొబైల్ ఇంటర్నెట్ కూడా ప్రతి చోటా పనిచేయదు. ఇప్పుడు దీనికి సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చేందుకు కొన్ని మొబైల్ కంపెనీలు సమాయుత్తం అవుతున్నాయి.
ప్రముఖ మొబైల్ తయారీ సంస్థలు జియోమి, హువాయ్, వీవో త్వరలో ఎలాంటి నెట్ వర్క్ లేకుండా పనిచేసే మొబైల్ ఫోన్ లను విడుదల చేయబోతున్నాయి. స్మార్ట్ ఫోన్ వినియోగదారుడు సిగ్నల్స్ లేని ఏ మారుమూలన ఉన్నా, అడవిలో ఉన్నా లేదంటే ఎత్తైన పర్వతాలపై ఉన్నా నెట్ వర్క్ అవసరమే ఉండదు. మొబైల్ నెట్‌వర్క్ లేకుండానే ఫోన్ కాల్స్ చేయడంతో పాటు ఇంటర్నెట్ ను ఉపయోగించుకోవచ్చు. జియోమి, హువాయ్, వీవో కంపెనీలు తన నెక్ట్స్ జనరేషన్ ఫ్లాగ్ షిప్ గ్యాడ్జెట్ శాటిలైట్ ఆధారిత నెట్ వర్క్ అందించడానికి రెడీ అవుతున్నాయి. స్మార్ట్ ఫోన్ ని నేరుగా శాటిలైట్‌కి కనెక్ట్ చేయడం ద్వారా కాలింగ్, డేటా సేవలను పొందే విధంగా టెక్నాలజీని అభివృద్ది చేస్తున్నారు.
దట్టమైన అడవులు, ఎత్తైన పర్వత ప్రాంతాలు, విపత్తుల సమయంలో మొబైల్ నెట్ వర్క్‌లు పని చేయని చోట కూడా ఈ శాటిలైట్ ఫోన్ నుండి కాల్స్ చేయవచ్చు. శాటిలైట్ ఫోన్‌లు ఆకాశం యొక్క స్పష్టమైన వీక్షణతో ఎక్కడైనా పనిచేస్తాయి. భూ కక్ష్యలో అత్యాధునిక ఉపగ్రహాల ద్వారా పనిచేస్తాయి. సుదూరమైన ఎడారులతో పాటు సముద్రంలో ఎక్కడైనా మొబైల్ ఫోన్ ను ఉపయోగించవచ్చు. అంతరిక్షంలో పరిభ్రమిస్తున్న శాటిలైట్ కు నేరుగా కనెక్ట్ చేయడం ద్వారా ఈ ఫోన్ పని చేస్తుంది. ఐతే ఈ శాటిలైట్ మొబైల్ టెక్నాలజీ చాలా ఖరీదైంది కావడంతో ఈ మొబైల్స్ ధర సైతం ఎక్కువగానే ఉంటుంది. ఇక ఈ మొబైల్స్ మన భారత్ కు రావడానికి మరికొంత సమయం పట్టవచ్చని అంచనా వేస్తున్నారు.