Friday, September 20, 2024

తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు

వైఎస్ఆర్ సీపీ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వు నూనెను ఉపయోగించారంటూ బుధవారం ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌హాల్‌లో బుధవారం ఎన్డీయే ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ పవిత్ర తిరుమల ఆలయాన్ని వైసీపీ ప్రభుత్వం అపవిత్రం చేసిందని అన్నారు. లడ్డు ప్రసాదంలో నాణ్యమైన నెయ్యికి బదులు జంతువుల కొవ్వు కలిపారంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు శ్రీవారి భక్తులనే కాదు.. అందరినీ షాక్‌కు గురిచేశాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల వేంకటేశ్వర స్వామి అన్నదానం, అలాగే శ్రీ వారి లడ్డూ తయారీలో వాడే పదార్థాల నాణ్యత విషయం రాజీపడలేదని చంద్రబాబు స్పష్టం చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
వైసీపీ  హయాంలో తిరుపతి ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వును ఉపయోగించారని తెలిసిందని ఏపీ మంత్రి నారా లోకేష్ ఎక్స్ ద్వారా పోస్ట్ చేశారు. కోట్లాది మంది భక్తుల మతపరమైన మనోభావాలను గౌరవించలేని వైఎస్‌ జగన్‌, వైఎస్సార్సీపీ ప్రభుత్వం సిగ్గుపడాలని లోకేష్ అన్నారు.
తిరుమల పవిత్రతను, కోట్లాదిమంది హిందువుల విశ్వాసాలను చంద్రబాబు తీవ్రంగా దెబ్బతీశారని వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పెద్ద పాపమన్నారు. ఆయన వ్యాఖ్యలు దురుద్దేశపూరితమైనవని అన్నారు. రాజకీయ లబ్ధికోసం చంద్రబాబు ఎంతవరకైనా దిగజారుతారని మరోమారు రుజవైందని మండిపడ్డారు. ఈ విషయంలో తాను తన కుటుంబంతో కలిసి భగవంతుడి సన్నిధిలో ప్రమాణం చేయడానికి సిద్ధమని, చంద్రబాబు కూడా అలా చేయడానికి సిద్ధమా అని సవాలు విసిరారు.
చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తిరుమల పవిత్రతకు, ప్రతిష్టకు భగం కలిగించేలా ఉన్నాయని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు.  వెంటనే ఉన్నత స్థాయి కమిటీ వేసి నిజానిజాలు బయటపెట్టాలని ఆమె డిమాండ్ చేశారు.
గత ప్రభుత్వ హయాంలో లడ్డూ ప్రసాదంలో నాణ్యత లేని నెయ్యి అనేది వాడారన్నది వాస్తవమేనని టీటీడీ మాజీ పాలకమండలి సభ్యుడు ఓవీ రమణ స్పష్టం చేశారు. కర్ణాటకలో ప్రభుత్వ సహకార సంస్థ ద్వారా ఇంతకు ముందు నాణ్యమైన ఆవు నెయ్యి వస్తోందని, మాజీ ఈవో ధర్మారెడ్డికి కావాల్సిన వారి కోసం ట్రేడర్లను తీసుకొచ్చారని తెలిపారు. ఢిల్లీలోని ఆల్ఫా సంస్థకు నెయ్యి సరఫరా టెండర్‌ను అప్పజెప్పారన్నారు. ఈ సంస్థ రకరకాల కెమికల్స్ ద్వారా ఆవు నెయ్యి సరఫరా చేసిందని ఓవీ తెలిపారు.
కాగా, ఈ ఏడాది జులైలో నాసిరకం నెయ్యిని సరఫరా చేసినందుకు ఓ కాంట్రాక్టర్‌ను టీటీడీ బ్లాక్ లిస్ట్‌లో పెట్టింది. ఆ తర్వాత బెంగళూరులోని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (కేఎంఎఫ్) లిమిటెడ్ హై-గ్రేడ్ నెయ్యిని ప్రవేశపెట్టింది. కాంట్రాక్టర్ కల్తీనెయ్యిని సరఫరా చేసినట్టు నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ ల్యాబరేటరీస్ (ఎన్‌ఏబీఎల్) నిర్ధారించింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

Lavanya Tripati New Pics

Ishita Raj Insta Hd Pics

Nabha Natash New photos