- మోడీ కర్ణాటకకు ఇచ్చింది ఏమీ లేదు, ఖాళీ చెంబు తప్ప
- కరువు వస్తే కనీసం బెంగళూరుకు నీళ్లు కూడా ఇవ్వలేదు
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
కర్ణాటక నుంచి 26 మంది ఎంపిలను గెలిపిస్తే మోడీ కర్ణాటకకు ఇచ్చింది ఒకటే కేబినెట్ పదవి అని, మోడీ కర్ణాటకకు ఇచ్చింది ఏమీ లేదు, ఖాళీ చెంబు తప్ప అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. కరువు వస్తే కనీసం బెంగళూరుకు నీళ్లు కూడా ఇవ్వలేదని, నరేంద్ర మోడీ ప్రజలను నమ్మించి మోసం చేశారని, అలాంటి మోడీని ఓడించాల్సిన అవసరం ఉందని కర్ణాటకలోని గుర్మిట్కల్ ఎన్నికల ప్రచార సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కలిసి ఎన్నికల ప్రచారసభలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు. దశల వారీగా కర్ణాటకలో జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్కడ తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సిఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. ఇక్కడి నుంచి తొమ్మిదిసార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎంపిగా ఖర్గే కొనసాగారని, 1972లో మొదటిసారిగా మీరు ఎన్నుకున్న మల్లికార్జున ఖర్గే ఇప్పుడు ఏఐసిసి అధ్యక్షుడిగా ప్రస్తుతం దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని సిఎం రేవంత్ అన్నారు. గుర్మిట్కల్ ప్రజల ఆశీర్వాదం వల్లే ఆయన ఈ స్థాయికి ఖర్గే చేరుకున్నారని ఆయన తెలిపారు. మీరు ఇచ్చిన స్ఫూర్తితో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని, ఐదు గ్యారంటీలను కర్ణాటక ప్రభుత్వం అమలు చేసిందన్నారు. తెలంగాణలోనూ ఆరు గ్యారంటీల్లో ఐదు గ్యారంటీలను ఇప్పటికే అమలు చేసుకున్నామన్నారు.
పదేళ్లలో మోడీ హామీలను అమలు చేయలేదు…
పదేళ్లలో మోడీ ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటీ అమలు చేయలేదని, నల్లధనాన్ని తెచ్చి ప్రజల ఖాతాల్లో వేస్తామని మోడీ మోసం చేశారని ఆయన ఆరోపించారు. 40 కోట్ల ఖాతాలు తెరిపించిన మోడీ, ఒక్క పైసా కూడా పేదల ఖాతాల్లో వేయలేదని, నరేంద్ర మోడీ ప్రజలను నమ్మించి మోసం చేశారని, అలాంటి మోడీని ఓడించాల్సిన అవసరం ఉందని, ప్రజలకు అండగా ఉండే కాంగ్రెస్‌ను గెలిపించుకోవాలని సిఎం రేవంత్ పిలుపునిచ్చారు. సమర్ధుడు, మీ కోసం కొట్లాడే వారికే ఓటువేసి గెలిపించాలని, ఇక్కడ కాంగ్రెస్‌కు ఒక్క ఓటు వేస్తే ఇక్కడున్న ముగ్గురు నాయకులు మీకు సేవ చేస్తారని, ఎస్సీ, ఎస్టీ, ఓబిసి రిజర్వేషన్లు రద్దు చేసేందుకే మోడీ 400 సీట్లు కావాలంటున్నారని ఆయన అన్నారు. రిజర్వేషన్లు కావాలనుకుంటే కాంగ్రెస్‌కు ఓటు వేయాలని, ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్‌ను గెలిపించి, లక్ష మెజారిటీతో ఇక్కడి కాంగ్రెస్‌ను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.
బిజెపిని ప్రశ్నిస్తే నోటీసులు ఇస్తున్నారు….
కర్ణాటకలోని సేడం ఎన్నికల ప్రచార సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మోడీ విధానాలకు వ్యతిరేకంగా రాహుల్‌గాంధీ ఎంతో పోరాటం చేస్తున్నారన్నారు. ఈ పోరాటంలో కర్ణాటక నుంచి 25 మంది కాంగ్రెస్ ఎంపిలను గెలిపించి మోడీని గద్దె దించడానికి ప్రజలు సహకరించాలని సిఎం రేవంత్ పిలుపునిచ్చారు. గుజరాత్ మోడీకి అండగా ఉన్నట్లే కర్ణాటక ఖర్గేకు అండగా నిలవాలన్నారు. ఈ ఎన్నికలు కర్ణాటక వర్సెస్ గుజరాత్ అన్న విధంగా సాగుతున్నాయన్నారు. బిజెపిపై పోరాటం చేసే వారికి అమిత్ షా నోటీసులు ఇస్తున్నారని, సోషల్ మీడియాలో బిజెపిని ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రినైన నాకు, గాంధీ భవన్ నేతలకు ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇస్తున్నారని ఆయన అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా మోడీ ప్రభుత్వం ఈడీ, సీబిఐ, ఐటీ అధికారులను పంపిస్తోందని, మొన్న కర్ణాటకలో, నిన్న తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, రేపు దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని సిఎం రేవంత్‌రెడ్డి జోస్యం చెప్పారు.