-
రిజర్వేషన్ల రద్దు బీజేపీ అజెండా..!
-
మీడియా సమావేశంలో బీజేపీపై సీఎం రేవంత్ రెడ్డి ధ్వజం
టీఎస్, న్యూస్:రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్ కల్పించిన రిజర్వేషన్లను రద్దు చేయడమే బీజేపీ ప్రధాన అజెండా అని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఆరెస్సెస్ తన ఈ మూల సిద్దాంతం అమలు కోసం బీజేపీను ఎంచుకుందని ఆరోపించారు. 2000లో వాజ్ పేయి ప్రధానిగా ఉన్నప్పుడే నియమించబడ్డ జస్టిస్ వెంకటాచలయ్య కమిషన్ రాజ్యంగాన్ని ఎలా సవరించాలో 2002లోనే నివేదిక ఇచ్చిందన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే కొన్ని ఆరెస్సెస్ మౌలిక సిద్ధాంతాలను ప్రధాని మోడీ, కేంద్రమంత్రి అమిత్ షా అమలు చేశారని చెప్పారు. రిజర్వేషన్ల రద్దుపై తన ప్రశ్నలకు మోడీ, షా ముందుగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతోన్న ఫేక్ వీడియోలకు తాను ఎలా బాద్యుడ్ని అవుతానంటూ నిప్పులు చెరిగిన సీఎం.. సోషల్ మీడియాలో ఎవరో పోస్ట్ పెడితే సీఎంపై కేసులు పెడుతారా? మండిపడ్డారు.
బుధవారం జూబ్లిహీల్స్ లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన సీఎం.. అబద్ధాల యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ మోడీ,రిజిస్ట్రార్ అమిత్ షా అంటూ సెటైర్లు వేశారు. సీఎంగా, ప్రెసిడెంట్ గా ఆరెస్సెస్ మూలసిద్ధాంతాలు, బీజేపీ రాజకీయ విధానాలపై నిర్దిష్టమైన స్పష్టమైన ఆరోపణలు చేశానన్న రేవంత్ రెడ్డి.. ఫేక్ వీడియోలు తయారు చేయాల్సిన అవసరం తనకు ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఓటమీ భయంతోనే తన వ్యాఖ్యలను పక్కదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. నిజాలు మాట్లాడుతున్నందుకే తనపై డిల్లీలో అక్రమ కేసులు పెట్టారని ధ్వజమెత్తారు. ఎవరో ఫిర్యాదు చేస్తే తనపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు పెట్టారని సీఎం మండిపడ్డారు. దేశ భద్రతకు ముప్పు వాటిల్లినట్లు ఆగమేఘాల మీద తనపై కేసు పెట్టారని దుయ్యబట్టిన రేవంత్ రెడ్డి.. తనపై కేసు పెట్టేందుకు ఢిల్లీ పోలీసులను ఎంచుకున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో గెలవడానికి ఈడీ, సీబీఐ,ఢిల్లీ పోలీసులను వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. పార్లమెంట్ పోరులో తనను ఎన్నికల ప్రచారం చేయకుండా బీజేపీ ప్రయత్నిస్తోందనీ, మోడీ, షా తమ పోలీసులతో తనను బెదిరించడం అసాధ్యమన్నారు.
బీజేపీ కుట్రను తిప్పికొట్టడానికి తాను కచ్చితంగా పోరాడుతానని స్పష్టం చేశారు. తాను మాట్లాడేది తన కోసమో, తన పార్టీ కోసమో కాదన్న సీఎం..ఢిల్లీ పోలీసులు వచ్చినంత మాత్రానా ఈ అంశంపై మాట్లాడడం ఆపబోనని స్పష్టం చేశారు. వాజ్ పేయి ప్రధానిగా ఉన్నప్పుడు రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ పార్లమెంటులో ప్రసంగించారని సీఎం చెప్పారు. అప్పట్లో ఆయన చేసిన ప్రసంగం సారాంశంలో రిజర్వేషన్ల రద్దు అంశం ఉందని రేవంత్ రెడ్డి తెలిపారు. అదే సమయంలో 2000లో రాజ్యాంగంపై సమీక్షించాలని గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారని తెలిపారు. అందుకోసం జస్టిస్ వెంకటాచలయ్య కమిషన్ ను ఏర్పాటు చేశారనీ, రాజ్యాంగాన్ని ఏ విధంగా సవరించాలనే దానిపై ఆ కమిషన్ 2002లో స్పష్టమైన నివేదిక ఇచ్చిందన్నారు. కానీ 2004లో దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో రాజ్యాంగాన్ని మార్చే అవకాశం బీజేపీకు లేకుండా పోయిందని చెప్పారు.ఇప్పుడు బీజేపీ మళ్లీ వ్యూహాత్మకంగా రాజ్యంగం మార్పు కోసం పావులు కదుపుతోందన్నారు.