ఒడిశా లోని ప్రముఖ పుణ్యక్షేత్రం పూరీ జగన్నాథుని రత్నభాండాగారం రహస్య గదుల అన్వేషణ కొనసాగుతోంది. ఆలయం దిగువ సొరంగ మార్గం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు పూరీ క్షేత్ర యంత్రాంగం రత్న భాండాగారం తెరిపించింది. గదుల్లోని స్వామి వారి సంపద తాత్కాలిక స్ట్రాంగ్ రూంకు తరలించింది. దాని క్రింద సొరంగ మార్గంలో మరిన్ని గదులున్నాయాని అంటున్నారు. ఆ గదుల్లో స్వామికి సంబంధించి విలువైన సంపద ఉందన్న సందేహాలున్నాయి. దీంతో సొరంగ మార్గం కనుగొనే బాధ్యత ఏఎస్‌ఐకు అప్పగించారు. ఇందు కోసం హైదరాబాద్ కు చెందిన ఎన్‌జీఆర్‌ఐ నిపుణుల సాయం తీసుకోనున్నారని అధికారులు తెలిపారు.
పూరీ జగన్నాథుని రత్నభాండాగారం క్రింద ఉన్న సొరంగ మార్గం అన్వేషణ అంత ఆషామాషీకాదని నిపుణులు అంటున్నారు. రాడార్, ఇతర అత్యాధునిక యంత్రాలతో శోధన చేపట్టాల్సి ఉందని రత్నభాండాగారం అధ్యయన కమిటీ చైర్మెన్ జస్టిస్ బిశ్వనాథ్ రథ్ చెబుతున్నారు. దీంతో సొరంగం, దాని క్రింద మార్గాన్ని తెలుసుకునేందుకు ఈనెల 21 నుంచి 23 తేదీ వరకు పరిశీలన జరుపుతున్నారు. ఈ మూడు రోజుల పాటు ప్రతి రోజు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 వరకు సొరంగ అన్వేషణ పనులు జరుగుతాయి. శనివారం నుంచి సోమవారం వరకు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు జగన్నాధునికు భక్తుల దర్శనాలు నిలిపివేయనున్నప్రకటించారు. ఈ క్రమంలో పూరీ జగన్నాధ్ రత్నభాండాగారం క్రింద సొరంగంలో ఏముందన్నది సర్వత్రా ఉత్కంఠరేపుతోంది.