-
ఆశించిన ఆదాయం రాబట్టని స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ
-
ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.14,483 కోట్ల ఆదాయం మాత్రమే
-
టాప్3లో నిలిచిన రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, మెదక్ జిల్లాలు
-
చివరిస్థానంలో నిలిచిన ఆదిలాబాద్
స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఈ ఆర్థిక సంవత్సరం ఆశించిన మేర ఆదాయం ఆర్జించలేదు. ఈసారి రూ.18వేల కోట్ల పైచిలుకు ఆదాయం వస్తుందని ప్రభుత్వం ఆశించగా ఆ శాఖ మాత్రం ఆశించిన మేర ఆదాయాన్ని రాబట్టలేదని గణాంకాలను బట్టి తెలుస్తోంది. 2023-, 24లో ఈ ఆర్థిక సంవత్సరం 12,01,899 డాక్యుమెంట్‌లు రిజిస్ట్రేషన్‌లు జరగ్గా రూ.11,275.17 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. దీంతోపాటు 5.91 లక్షల వ్యవసాయ భూముల డాక్యుమెంట్‌లు రిజిస్ట్రేషన్ జరగ్గా, రూ.1,564.23 కోట్ల రాబడి వచ్చింది. మొత్తం రూ.14,483 కోట్ల ఆదాయం 2023-, 24 ఆర్థిక సంవత్సరంలో సమకూరిందని స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు తెలిపారు.
గతేడాది రూ.14,291 కోట్ల ఆదాయం
గతేడాది (2022, 23) 19.44 లక్షల డాక్యుమెంట్‌ల రిజిస్ట్రేషన్ ద్వారా రూ.14,291 కోట్ల ఆదాయ రాగా, ఈ ఆర్థిక సంవత్సరం (2023, 24) రూ.14,483 కోట్ల ఆదాయం వచ్చింది. రాష్ట్రంలో భూముల క్రయ, విక్రయాలపై ఎన్నికల ప్రభావం పడింది. వ్యవసాయ రిజిస్ట్రేషన్లు భారీగా తగ్గగా, స్థిరాస్తి వ్యాపార లావాదేవీలు మాత్రం గత ఆర్థిక ఏడాది కంటే ఎక్కువే జరిగినట్లు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలో స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా 2023-, 24 ఆర్థిక సంవత్సరంలో రూ.18,500 కోట్లు రాబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. కానీ ఈ ఆర్థిక సంవత్సరంలో శాసనసభ ఎన్నికలు, ఇతర కారణాల వల్ల ప్రభుత్వ లక్ష్యం మేరకు రాబడులు రాకపోవడం విశేషం.
ఆదాయంలో రంగారెడ్డి జిల్లా టాప్
ఈ ఆర్థిక సంవత్సరం (2023, 24)లో రంగారెడ్డి జిల్లాలో 2,48,560 డాక్యుమెంట్‌లు రిజిస్ట్రేషన్‌లు జరగ్గా రూ.4,396.52 కోట్ల ఆదాయం సమకూరింది. ఇలా రిజిస్ట్రేషన్‌లలో రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రేషన్‌లలో మొదటిస్థానంలో నిలిచింది. ఇక రెండో స్థానంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 1, 59,001 డాక్యుమెంట్‌లు రిజిస్ట్రేషన్‌లు జరగ్గా రూ.2,446.85 కోట్ల ఆదాయం వచ్చింది. మూడోస్థానంలో మెదక్ నిలిచింది. ఈ జిల్లాలో 1,29,581 డాక్యుమెంట్‌లు రిజిస్ట్రేషన్‌లు జరగ్గా రూ.1,120 కోట్ల ఆదాయం వచ్చింది. తరువాతి స్థానంలో హైదరాబాద్ (సౌత్) నిలవగా ఇక్కడ 39,418 డాక్యుమెంట్‌ల రిజిస్ట్రేషన్‌లతో రూ.980 కోట్ల ఆదాయం వచ్చింది. హైదరాబాద్ జిల్లాలో 20,941 డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్‌ల వల్ల రూ.427 కోట్ల ఆదాయం వచ్చింది. తక్కువ ఆదాయం వచ్చిన జిల్లాలో ఆదిలాబాద్ నిలిచింది. ఈ జిల్లాలో 53,341 డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్‌ల వల్ల రూ.139.90 కోట్ల ఆదాయం వచ్చింది.
జిల్లాలు 2022,23లో వచ్చిన ఆదాయం 2023,24 వచ్చిన ఆదాయం
(డాక్యుమెంట్‌లు)(రూ.కోట్లలో)(డాక్యుమెంట్‌లు)(రూ.కోట్లలో)
ఆదిలాబాద్ 49,778 రూ.145.96 53,341 రూ.139.90
హైదరాబాద్ 22,336 రూ.489.66 20,941 రూ.427.40
హైదరాబాద్ (సౌత్) 40,779 రూ.936.91 39,418 రూ.980.60
కరీంనగర్ 88,655 రూ.324.25 90,621 రూ.299.95
ఖమ్మం 47,366 రూ.226.43 44,201 రూ.198.21
మహబూబ్‌నగర్ 1,02,693 రూ.259.30 99,009 రూ.248.85
మెదక్ 1,29,327 రూ.997.54 1,29,581 రూ.1,120
మేడ్చల్ మల్కాజిగిరి 1,62,443 రూ.2,404.35 1,59,001 రూ.2,446.85
నల్లగొండ 1,47,825 రూ.456.36 1,43,426 రూ.412.37
నిజామాబాద్ 64,191 రూ.191.33 67,483 రూ.188.22
రంగారెడ్డి 2,48,039 రూ.3,821.15 2,48,560 రూ.4,396.52
వరంగల్ 1,03,633 రూ.416.24 1,06,317 రూ.416.30
మొత్తం 12,07,065 రూ.10,669.46 12,01,899 రూ.11,275.17