* ఈటల రాజేందర్
నిన్నటి అసెంబ్లీ సమావేశాలతో కేసీఆర్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు బాయ్ బాయ్ చెప్పారు, వీడ్కోలు ప్రకటించారని హుజురాబాద్ ఎమ్యెల్యే ఈటల రాజేందర్ అభిప్రాయపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం దీపం ఆరిపోయే ముందు వెలుగు ఎక్కువ అన్నట్లు ఉంది. కేసీఆర్ హయాంలో ఎమ్మెల్యే పదవి ప్రతిష్ఠ దిగజారిపోయింది. ఎమ్మెల్యేలను చట్టాలు చేసే వాళ్ళం అని మర్చిపోయేలా చేశారు. కేసీఆర్‌కి చట్టసభల మీద విశ్వాసం సన్నగిల్లింది. అసెంబ్లీ గొప్పగా జరిగింది అని స్పీకర్ ప్రకటించడం దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది. ముఖ్యమంత్రి స్వయంగా ఎంఐఎం మా మిత్రపక్ష పార్టీ అని చెప్పిన తర్వాత దానికి ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారు? వారి బంధం జుగుప్సాకరంగా ఉంది. అబ్ కీ సర్కార్ కిసాన్ సర్కార్.. అని కెసిఆర్ చెప్పుకుంటూ హర్యానా పంజాబ్లో డబ్బులు ఎవడబ్బ సొమ్మని పంచి పెడుతున్నారు. ప్రభుత్వం ల్యాండ్ బ్రోకర్ గా మారింది.ప్రజాసమస్యలపై ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తాం.
అసెంబ్లీ ముగిసినట్టు స్పీకర్ ప్రకటించారు. వీడ్కోలు పలుకులు పలికారు.ప్రజాసమ్యలపై చర్చా వేదికలు అసెంబ్లీ, పార్లమెంట్. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయంటే ప్రజల సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయని ఆశపడతరు. కానీ కెసిఆర్ కి చట్ట సభల మీద విశ్వాసం సన్నగిల్లింది అనడానికి సజీవ సాక్ష్యం మొన్నటి సమావేశాలు.ఈ సంవత్సరం బడ్జెట్ సమావేశాలు కేవలం 11 రోజులు మాత్రమే జరిగాయి. వర్షాకాల సమావేశాలు ఒకరోజు సంతాప ప్రకటన తీసేస్తే మూడు రోజులు మాత్రమే జరిగింది. మళ్లీ సమావేశాలు జరిగే అవకాశం లేదని స్పీకర్ చెప్పకనే చెప్పారు. ఈ సంవత్సరం శాసనసభ సిట్టింగ్ డేస్ 14 రోజులు.
* సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 31 వరకు 45 రోజులపాటు జరిగేవి. వర్షాకాల సమావేశాలు 15 రోజులు, శీతాకాల సమావేశాలు 15 రోజులు.. సంవత్సరంలో 65 రోజుల శాసనసభ సమావేశాలు జరిగేవి. మంచి ప్రణాళికలు రచించి, మంచి చట్టాలు చేసి మెరుగైన పరిపాలన అందించడమే అసెంబ్లీ లక్ష్యాలు. కానీ ముఖ్యమంత్రి 14 రోజుల మాత్రమే శాసనసభ సమావేశాలు జరిపి ఎమ్మెల్యే బాధ్యత చట్టాలు చేసే పని కాదు.. గ్రామాలలో ఉండాలి, పోలీసులకు ఆఫీసులకు ఫోన్ చేసేవారుగా.. ఇతర పార్టీల మీద విమర్శలు చేసేవారిగా తయారు చేశారు. ఇతర పార్టీల వారి మీద ఎట్లా కేసులు పెట్టాలి.. పోలీస్ స్టేషన్ లో పెట్టించాలి, ఎలా జైలుకు పంపాలి అనే పనులు చేయిస్తున్నారు. ఇతర పార్టీకి మద్దతు ఇస్తే కళ్యాణలక్ష్మి రాదు, పెన్షన్ రాదు, రైతుబంధు రాదు అనే వెకిలి చేష్టలు చేస్తున్నారు.
ఎమ్మెల్యే పదవి ఎంత దిగజారిపోయిందో అర్థం కావాలి. ఎన్ని రోజులు అయినా చర్చ జరగడానికి సిద్ధంగా ఉన్నాం అభ్యంతరం లేదు అని చెప్పే కేసిఆర్ ఎందుకు ఇన్ని తక్కువ రోజులు నడిపారు ప్రజానీకమంతా ఆలోచన చేయాలి. సమైక్య రాష్ట్రంలో 13, 14 పార్టీలు శాసనసభలో ఉండేవి. కానీ ఈరోజు నాలుగు పార్టీలు మాత్రమే ఉన్నాయి. టిఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్, బీజేపీ నాలుగే పార్టీలు ఉన్నాయి. పదమూడు పార్టీలు ఉన్న ఇదే శాసనసభలో అన్ని పార్టీల ప్రతినిధులను బిజినెస్ అడ్వైజర్ కమిటీ సమావేశానికి పిలిచేవారు. బీజేపీ ఒక జాతీయ పార్టీ, అనేక రాష్ట్రాల్లో అధికారాన్ని నడుపుతున్న పార్టీ, దేశాన్ని పరిపాలిస్తున్న పార్టీ కానీ ఈ పార్టీకి బిజినెస్ అడ్వైజర్ కమిటీలో స్థానం లేదు అని వెలగొట్టారు. జయప్రకాశ్ నారాయణ ఒక్కరే శాసనసభ్యులు, కిషన్ రెడ్డి కూడా ఒక్కరే అయినా బీఏసీకి పిలిచేవారు. ఇప్పుడు పిలవలేదంటే బీజేపీ పార్టీ అంటే ఎంత అక్కసు కేసీఆర్ కు ఉందో మనకు అర్థమవుతుంది.
ఇదే శాసనసభలో అప్పట్లో అందరూ మంత్రులు, అన్ని పార్టీల వారికి రూములు కేటాయించారు. కానీ ఇప్పుడు బీజేపీకి కనీసం రూమ్ కూడా ఇవ్వడం లేదు.గేట్ల బయట నిలబడాలా ? మీరు అవమానించేది మమ్మల్ని కాదు, మా ప్రజలను. స్పీకర్గా మా గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత, మా హక్కుల కాపాడాల్సిన కర్తవ్యం మీ మీద ఉంది అని వేడుకున్నప్పటికీ కూడా మాకు రూమ్ ఇవ్వలేదు.ఇలా వ్యవహరించిన గొప్పగా నడుపుతున్నామని చెప్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయి. రూల్స్ లేకపోయినా కొన్ని పద్ధతులు పాటించే సాంప్రదాయం ఉంటుంది. ఈ అసెంబ్లీలో ఈ స్పీకర్ గారు సాంప్రదాయాన్ని పాటించలేదు. అధికార పార్టీ మాట్లాడుతున్నప్పుడు ఎన్ని గంటలైనా మాట్లాడే అవకాశం ఇచ్చారు. ఎన్ని అబద్ధాలు చెప్పినా అనుమతించారు. ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్య ఉన్న నాయకులుగా ప్రతిపక్ష నేతలుగా మాట్లాడేందుకు స్పీకర్ గారు అవకాశం ఇవ్వలేదు. మాదిక్కు కన్నెత్తి కూడా చూడకుండా బెల్లు కొడుతూనే ఉంటారు. మా ఫ్లో రాకూడదు.. సమస్యలు ప్రస్తావించకూడదు.. అని నిలబడ్డాం అంటే నిమిషంలోనే బెల్లు మోగుతుంది. ముఖ్యమంత్రి గారి స్వయంగా ఎంఐఎం మా మిత్రపక్ష పార్టీ అని చెప్పిన తర్వాత దానికి ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారు? అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఈ ప్రభుత్వాన్ని పోగడనంతగా ఎంఐఎం కొనియాడారు. వారి మాటలు వారి చేష్టలు చూస్తే ఎంత జుగుప్చాకరంగా వీరి బంధం కొనసాగుతుందనేది తెలంగాణ ప్రజలుగా మీరే న్యాయ నిర్ణయితలుగా ఆలోచన చేయండి. నిజమైన న్యాయ నిర్ణీతలు ప్రజలే.
ప్రజాస్వామ్యం మీద, ప్రజల మీద, చట్టసభల మీద విశ్వాసం లేదు కాబట్టి మమ్మల్ని మాట్లాడనీయకుండా బుల్డోజ్ చేశారు. నిన్నటి అసెంబ్లీ సమావేశాలతో ఈ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు బాయ్ బాయ్ చెప్పినట్లుగా, వీడ్కోలు ప్రకటించినట్టుగా నేను భావిస్తున్నాను. వరదల వల్ల 41 మంది చనిపోతే ప్రస్తావన తేలేదు, సంతాపం ప్రకటించలేదు. అబ్ కీ సర్కార్ కిసాన్ సర్కార్.. అని కెసిఆర్ చెప్పుకుంటూ హర్యానా పంజాబ్లో డబ్బులు ఎవడబ్బ సొమ్మని పంచి పెడుతున్నారు. తెలంగాణలో రైతు చనిపోతే నాలుగు లక్షల రూపాయలు ఇస్తున్నామని కేసీఆర్ చెప్తున్నారు. అందులో 3 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. కానీ వరదల వల్ల చనిపోయిన వారికి, కౌలు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఒక రూపాయి ఇవ్వకపోవడం అంటే నీకు తెలంగాణ ప్రజల పట్ల ప్రేమ ఇదేనా అని అడుగుతున్నాను. చనిపోయిన కుటుంబాలకు 10 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి. ఇల్లు మునిగిన వారికి 25 వేలు, షాపులకు 50 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను. ప్రభుత్వం సోయి తెచ్చుకుని స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాను. వాగుల పక్కన ఉన్న భూములు తాడిచెట్టు అంతా లోతు గోతులు పడ్డాయి. ఆనవాళ్లు లేకుండా కొట్టుకుపోయాయి. డబ్బులు ఇవ్వాలని కొరితే స్పందించలేదు ప్రజలారా ఈ ప్రభుత్వానికి మన పట్ల ఎంత పట్టింపు ఉందో అర్థం చేసుకోండి.
110 సీట్లతో ముఖ్యమంత్రి గెలుస్తామని ప్రకటించిన అహంకారాన్ని చూడండి. ఓట్లు వేసి గెలిపించాల్సింది మనం. మన అంతరంగం, మన హక్కుని వారు ప్రకటించుకోవడం అంటే ప్రజల పట్ల వారికి ఏం భావన ఉంది అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. అసెంబ్లీలో ఒక రోజంతా హరీష్ మాట్లాడతారు. దేశంలో మాకంటే తెలివైన వారు లేరు అన్నట్టు మేమే అన్నిటిలో నంబర్ వన్ అని చెప్తారు. రెండోరోజు కేటీ రామారావు వచ్చి ఆయన మాట్లాడుతారు. ప్రతిపక్షంలో ఉన్నవారి వయసుకు, అనుభవానికి గౌరవం లేకుండా రాగింగ్ చేసినట్లు మాట్లాడుతారు. పెద్ద ఎత్తున ఇన్సల్ట్ చేసి మాట్లాడడాన్ని తెలంగాణ ప్రజలు గమనించమని కోరుతున్నాను. చివరి రోజు ముఖ్యమంత్రి ప్రసంగం ఇక ఏం చెయ్యడానికి లేవు అన్నీ మేమే చేశామని చెప్పుకుంటారు.
కాగ్ రిపోర్ట్ స్పష్టంగా నివేదిక ఇచ్చింది. 2018 వరకు రెవిన్యూ సర్ప్లస్ గా ఉండే తెలంగాణ 2019 నుంచి రెవెన్యూ లోటు ఉన్న రాష్ట్రంగా మారింది అని, మరి ఎలా నెంబర్ వన్ గా ఉన్నట్టు. రుణం తీసుకున్న దానిలో క్యాపిటల్ ఎక్స్పెండెచర్ జరగటం లేదని రిపోర్ట్ చెప్పింది. వేగంగా అప్పుల్లో పోరుకు పోతున్న రాష్ట్రం తెలంగాణ ఒకటి అని చెప్పింది. ఒక రాష్ట్రం సుభిక్షంగా ఉంది అని చెప్పడానికి విద్య, వైద్యం రంగాలను పరిశీలన చేస్తారు. వైద్యంలో బడ్జెట్ పెరిగినట్లుగా కేటాయింపులు పెరగాలి. 7 వేల 12 వేల కోట్లకు పెరిగింది అని చెప్తున్నారు. కానీ బడ్జెట్ 100 నుండి 300 రెట్లు పెరిగింది. కాగ్ రిపోర్ట్ చాలా స్పష్టంగా చెప్పింది కేటాయింపులు ఉన్నాయి కానీ ఖర్చు లేదు అని. ఎంబీసీ, సంచార జాతులు కేటాయించిన బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు అంటే ఆ జాతుల పట్ల కెసిఆర్ కున్న చిత్తశుద్ధిని అర్థం చేసుకోండి. బడ్జెట్ కొండంత, ఖర్చు పెట్టేది గింతంత అని కాగ్ చెప్పింది. సెన్సిటివిటీ ఉన్న ప్రభుత్వం, మాట అంటే బాధపడే ప్రభుత్వమైతే కాగ్ రిపోర్టు మీద స్పందించాలి.
కేసీఆర్ ప్రభుత్వం దీపం ఆరిపోయే ముందు వెలుగు ఎక్కువ అన్నట్లు ఉంది. తన అమ్ములపొదలో అనేక అస్త్రాలు ఉన్నాయని కేసీఆర్ అంటున్నారు. ముఖ్యమంత్రి గారు మీరు వేసిన ఏ అస్త్రం పాస్ కాలేదు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తా అని నాలుగున్నర సంవత్సరాలు గడిచిపోయింది. ఒక్కొక్క బిడ్డకు ఇవ్వాలంటే రెండు లక్షలు ఇవ్వాలి, 30 లక్షల మందికి ఎన్ని లక్షల కోట్లు ఇవ్వాలి. 27 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తాను అని ఇచ్చింది 1200 కోట్ల రూపాయలు మాత్రమే. ఆ 27 వేల కోట్ల రూపాయలకు 11 % వడ్డీ పడింది. వేల కోట్ల రూపాయల వడ్డీ తోడైంది ఇవన్నీ ఎవరు కట్టాలి? బ్యాంకులలో రైతులకు రుణాలు దొరకకుండా చేశారు. షావుకారుల దగ్గర వడ్డీ తీసుకువచ్చే దుస్థితికి కారకులు ముఖ్యమంత్రి కాదా చెప్పాలి.
నేను ఆర్థిక మంత్రిగా పనిచేశాను. ఈ రాష్ట్రంలో నెలకు 4 వేల కోట్లు అసలు అసలు, వడ్డీ కట్టడానికి పోతాయి, నాలుగు వేల కోట్ల రూపాయలు జీతాలకు పోతాయి, మరో 4 వేల కోట్లు రైతుబంధు, ఆసరా ఫంక్షన్లో, కల్యాణ లక్ష్మి, కరెంటు బిల్లులు పోతాయి. 16 వేల కోట్ల రూపాయలు నెలకు ఆదాయం వస్తే 12 వేల కోట్ల రూపాయలు వీటికి పోతాయి. ఎలా 27 వేల కోట్ల రుణమాఫీ చేస్తారు. దీని మీద చర్చ పెడదామా? చర్చికి వస్తారా? సర్పంచులు పనిచేసిన వారికి బిల్లులు రావడం లేదు. పైరవీలు చేసుకున్న వారికి మాత్రమే బిల్లులు ఇస్తున్నారు. తాతలు సంపాదించుకున్న ఆస్తులు అమ్ముకునే మనుమళ్లను ఏమంటారు.. అని ఆనాడు అసెంబ్లీలో చెప్పాను. ఆ మాటలు చెప్పడానికి ఇప్పుడు సిగ్గు అనిపిస్తుంది. భూములు అమ్ముతున్నారు.
హైదరాబాద్ గొప్పతనాన్ని ఒప్పించడానికి 100 కోట్ల రూపాయలు ఎకరం అమ్ముడు పోయింది, రియల్ ఎస్టేట్ గొప్పగా ఉందని డబ్బా కొట్టుకోవడానికి చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. కోకాపేటలో 100 కోట్ల రూపాయలు విలువల పెరిగినప్పుడు.. గ్రామీణ ప్రాంతాల్లో కూడా 50 లక్షల రూపాయల ఎకరం పెరిగినప్పుడు.. ల్యాండ్ అక్వైర్ చేస్తున్నప్పుడు దళితుల పేదల భూమిని ఎవరబ్బా జాగీరని 20 లక్షల రూపాయలు ఇచ్చి సేకరించి కోటి రూపాయలకు అమ్ముకుంటున్నారు. ఆ భూములు తీసుకొని ఎవరికి ఇస్తున్నారు.. పెద్ద ఫార్మా కంపెనీ కోట్ల రూపాయలకి అమ్ముకుంటున్నారు. ల్యాండ్ ను అమ్ముకునే బ్రోకర్ లేరా ప్రభుత్వమే ఈ బ్రోకర్ గిరి చేయాలా? దళితులకు ఇచ్చిన భూమి ఆంధ్రప్రదేశ్ 20 సంవత్సరాకు, తమిళనాడులో 15 సంవత్సరాల తరువాత ఆ భూములు అమ్ముకునే అవకాశం ఇస్తున్నారు. కానీ ఇక్కడ మాత్రం ముఖ్యమంత్రి అసెంబ్లీ వేదిక మీద ప్రకటించిన తర్వాత కూడా ఇవ్వడం లేదు. చెప్పుకుంటూ పోతే వడవని కథ.
1954లో బండంగిపేటలో దళితులకు వ్యవసాయానికి పనికిరాని భూములను ఇస్తే రాళ్లు కొట్టుకొని, చెట్లు కొట్టుకొని, బావులు తవ్వి, కరెంటు పెట్టుకొని వ్యవసాయం చేసుకుంటూ ఉంటే 12 సంవత్సరాల దాటితే పట్టాలు ఇవ్వాలి కానీ 70 ఏళ్ళు గడిచిన తర్వాత కబ్జాకాలం తీసివేయడంతో వారి పేర్లు ధరణిలో రాలేదు.. ఆ 40 ఎకరాల మీద కన్నుబడింది ఇప్పటికే 24 ఎకరాలు గుంజుకున్నారు. మిగిలిన 16 ఎకరాలు గుంజుకుంటుంటే అడ్డంపోతే హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో పెట్టి ఇబ్బందులు పెడుతున్నారు.
ధరణి పేదల కోసం రాలేదు. ధరణి గొప్ప రీఫాం ( సంస్కరణ) కాదు. ధరణితోని వేల వేల ఎకరాల అన్ ఐడెంటిఫైడ్ ల్యాండ్స్ వీళ్ళ చేతుల్లోకి వెళ్లిపోయాయి. డిస్ప్యూటెడ్ ల్యాండ్ పేరు చెప్పి బ్రోకర్లతో మంతనాలు జరిపి భూములు స్వాధీన పరుచుకుంటున్నారు. సిగ్గులేని, హీనమైన ప్రభుత్వం ఇది. భారతీయ జనతా పార్టీగా ప్రజలకు అండగా ఉంటాము. అసెంబ్లీలో మాట్లాడనివ్వలేదు, ఈ సమస్యలను ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామని ఈటల రాజేందర్ అన్నారు.