పంచాయతీరాజ్ శాఖతో నాకు పెద్ద బాధ్యత వచ్చింది
సవాళ్లను చాలెంజ్‌గా తీసుకోవాలి
వర్క్ ప్లేస్‌లో మహిళలను వేధిస్తే సహించేది లేదు
సేప్టీ కోసం టీసేఫ్ యాప్ తెచ్చాం
స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క
గ్రామీణ ప్రాంతాలకు ఐటీని విస్తరిస్తామని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. వ్యాపారులు కేవలం పట్టణ ప్రాంతాల్లోనే పరిశ్రమల స్థాపనకు ముందుకు వస్తున్నారని, రూరల్ ఏరియాల్లో కూడా పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు స్థాపించాలని కోరారు. మహిళలకు పరిశ్రమల్లో పురుషులతో సమానంగా అవకాశాలు కల్పించాలన్నారు. గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందినప్పుడే సమాజంలో అంతరాలు తగ్గుతాయన్నారు. ఎవరి మీద ఆధారపడకుండా కష్టాన్ని నమ్ముకున్నానని, మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పడు మంత్రిగా పట్టుదలతో ప్రజలకు సేవ చేస్తున్నానని మంత్రి సీతక్క తెలిపారు. మహిళలు తక్కువ అనే ఆలోచన నుంచి బయటకు రావాలని మంత్రి కోరారు. శుక్రవారం మాదాపూర్‌లోని టెక్ మహీంద్రా క్యాంపుస్‌లో సీఐఐ ఇండియన్ ఉమెన్ నెట్‌వర్క్ తెలంగాణ 10వ వార్షిక లీడర్‌షిప్ సదస్సును సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు సమాజ సృష్టికర్తలని అన్నారు.
సమాజంలో మహిళలను చిన్నచూపు చూసే మోంటాలిటీ ఉందని, అందుకే మహిళలు ఇంకా వెనకబడే ఉన్నారన్నారు. ఎన్నో రంగాల్లో మహిళలు రాణిస్తున్నా పురుషులే గొప్ప అనే భావన ఉందన్నారు. ఆదివాసీ మహిళకు పంచాయతీ రాజ్ శాఖను ఇచ్చారని, 13 వేల గ్రామపంచాయతీలు, రెండు కోట్ల మంది ప్రజలకు సేవ చేసే బాధ్యత వచ్చిందని, అందుకే బాధ్యతగా పనిచేస్తున్నానని మంత్రి సీతక్క వెల్లడించారు. మహిళలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత తమపై ఉందని, వర్క్ ప్లేస్‌లలో మహిళలకు భద్రత లేదని, సమస్యలపై వెంటనే ప్రశ్నించడం నేర్చుకోవాలని కోరారు.
ఎదురవుతున్న సవాళ్లను తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని, మహిళల సమస్యల పరిష్కారానికి మరిన్ని చట్టాలు తీసుకువస్తామని మంత్రి సీతక్క వెల్లడించారు. మహిళలకు పరిశ్రమల్లో పురుషులతో సమానంగా అవకాశాలు కల్పించాలని, గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందినప్పుడే సమాజంలో అంతరాలు తగ్గుతాయన్నారు. పరిశ్రమలు స్థాపించాలనుకునే మహిళా పారిశ్రామిక వేత్తలను తమ ప్రభుత్వం ఎప్పుడూ ప్రోత్సహిస్తుందని మంత్రి సీతక్క చెప్పారు. మహిళల భద్రత, సాధికారత లక్ష్యంగా తమ ప్రభుత్వం కృషి చేస్తుందని, మహిళల భద్రతకోసం టీసేఫ్ యాప్ ను తీసుకువచ్చామని వివరించారు. యంగ్ ఇండియాలో నిరుద్యోగం పెద్ద సవాల్ అని, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెంచుతామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.