Friday, November 22, 2024

సర్వే సంకటం

రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న సమగ్ర కుటుంబ సర్వే అంతా ఆగమాగమవుతున్నది. ఈ సందర్భంగా -గురువారం సర్వే తీరును మంత్రి పొన్నం పరిశీలించారు. జీహెచ్​ఎంసీ మేయర్ ఇంటికి వెళ్లి సర్వే స్థితిని తెలుసుకున్న మంత్రి పొన్నం – ఆస్తుల వివరాలు వెల్లడిస్తే ప్రభుత్వ పథకాలు ఆగిపోవని భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 6 నుంచి ఇళ్ల గుర్తింపు కార్యక్రమం, అలాగే 9వ తేదీ నుంచి ఇంటింటి కుటుంబ సర్వే ప్రారంభమైంది. సర్వే మొత్తం సాఫీగానే సాగుతోంది. కానీ హైదరాబాద్​లో అక్కడక్కడ సర్వే చేస్తున్న ఎన్యూమరేటర్లను యజమానులు దూషించడం, వివరాలు ఇవ్వడం జరగదు అని చెబుతున్న కొన్ని ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఈ క్రమంలోనే సర్వేలో ఫ్రిజ్​లు, టీవీలు, ఏసీలు, కారు, ద్విచక్ర వాహనం ఇలా అన్ని వివరాలు వెల్లడిస్తే ప్రస్తుతం వస్తున్న ప్రభుత్వ పథకాలు ఆగిపోతాయని కొందరు సోషల్​ మీడియాలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇప్పుడు ఈ విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్​ క్లారిటీ ఇచ్చారు. హైదరాబాద్​ మేయర్​ గద్వాల విజయలక్ష్మి ఇంట్లో జరుగుతున్న సర్వేను పర్యవేక్షించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు.

అంతా గోప్యం
సర్వే సమాచారం గోప్యంగా రాష్ట్ర ప్రభుత్వమే సేకరిస్తుందని, ఈ సమాచారం సేకరించడంతో ఎవరికీ కూడా ఏ ప్రభుత్వ పథకాలు నిలిచిపోవని, ఇంకా అదనంగా పథకాలు ఇవ్వడానికి సేకరిస్తున్న సమాచారాన్ని ఉపయోగిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్​ వెల్లడించారు. దీన్ని రహస్యంగా ఏదో దాచిపెట్టేసేది కాదని, దీనిపై అనేక రకాలుగా అనేక వేదికలపైన చర్చ చేసి భవిష్యత్తులో ప్రజలకు ఉపయోగపడే విధంగా, పారదర్శకంగా ప్రభుత్వం సమాచారం సేకరిస్తుందన్నారు. ఈ సర్వేకు రాజకీయాలతో సంబంధం లేదని, కేబినెట్​ తీర్మానం తర్వాత శాసనసభలో ఆమోదించిన తర్వాత సర్వే చేస్తున్నామని, ఎన్యూమరేటర్లపై దూషణలకు దిగితే, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్​ తేల్చి చెప్పారు. ప్రజలను భాగస్వాములను చేసుకుని ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే జరుగుతోందని మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఈ సర్వేతో తెలంగాణ దేశానికే దిక్సూచిగా ఉండే విధంగా జరుగుతుందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 30 శాతం సర్వే జరగ్గా, జీహెచ్​ఎంసీ పరిధిలో 4.50 లక్షల ఇళ్లకు సర్వే పూర్తి అయిందని తెలిపారు. రాష్ట్రంలో 85 వేల పైగా ఎన్యూమరేటర్లు సర్వే చేస్తున్నారని చెప్పారు. ప్రధానమంత్రినే స్పందించే విధంగా ఈ కార్యక్రమం జరుగుతుందని ఆనందించారు.

బ్యాంక్​ అకౌంట్​ డీటైల్స్​ అడగం
ప్రజల బ్యాంక్​ అకౌంట్​ డీటైల్స్​ అడగడం లేదని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. బ్యాంకు ఖాతా ఉందా లేదా అని సమాచారం మాత్రమే అడుగుతున్నారని, బ్యాంక్​ ఖాతాకు ఆప్షన్​ అడుగుతున్నామని, ఆధార్​ కార్డు తప్పనిసరి కాదన్నారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమం ద్వారా తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుందని, దయచేసి అందరూ సహకరించాలని కోరారు. గతంలో సర్వే చేయాలని అనేక దీక్షలు, ధర్నాలు చేసిన వారు సైలెంట్​గా ఉన్నారని, అందరూ సర్వేను స్వాగతిస్తున్నారని, ప్రైవేటు వ్యక్తులు ఎవరూ లేరని, ఐడెంటీ కార్డు ఉంటుందన్నారు. వాళ్లు ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్వే నిర్వహిస్తున్నారని, సోషల్​ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు ఉంటాయని మంత్రి పొన్నం హెచ్చరించారు.

ఆ ఒక్కటీ అడక్కండి
ఇక, సర్వే చేస్తున్న ఎన్యుమరేటర్లకు ప్రజల నుంచి మిశ్రమ స్పందన – పట్టణాల్లో ఒకరకంగా, గ్రామీణ ప్రాంతాల్లో మరోరకంగా కొనసాగుతున్నది. ఒక్కో ఎన్యుమరేటర్‌కు 150 కుటుంబాలు కేటాయించినా సర్వే సమయంలో వాటి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. ఉదాహరణకు ఒక కుటుంబంలోని వివరాలు ఒకే ఫాంలో నమోదు చేస్తుంటే పెళ్లిళ్లు అయిన కుమారులు వేరుగా వివరాలు నమోదు చేయించుకుంటున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి అద్దెకు ఉంటున్నవారు సైతం వివరాలు రాయించుకోవడంతో కుటుంబాల సంఖ్య క్రమంగా పెరుగుతోందని ఎన్యుమరేటర్లు అంటున్నారు. సమగ్ర కుటుంబ సర్వే సాఫీగా సాగుతోందని, ప్రజలు కుటుంబ వివరాలన్నీ చెబుతున్నారని కొత్తగూడెంలోని ఓ ఎన్యుమరేటర్‌ తెలిపారు.

ఇప్పటివరకు జరిగిన సర్వేలో ఒకట్రెండు కుటుంబాలు మాత్రమే తమకు సర్వే అవసరం లేదని అన్నారని చెప్పారు. దాదాపు 90 శాతం కుటుంబాలు తమ ఆస్తుల వివరాలు మాత్రం చెప్పటం లేదని వివరించారు.
పట్టణాల్లో సర్వే ఇబ్బందిగా ఉంటోందని, తమ వివరాలు చెప్పేందుకు కొన్ని కుటుంబాలు నిరాకరిస్తున్నాయని సత్తుపల్లిలో ఓ ఎన్యుమరేటర్‌ తెలిపారు. సర్వేకు సహకరించినా అన్ని ప్రశ్నలకు వివరాలివ్వటం లేదని చెప్పారు. ఆస్తుల విషయంలో అయితే అవి మీకెందుకు అనే సమాధానమే ఎదురవుతోందని పేర్కొన్నారు. కొంతమంది అయితే సర్వే ఎందుకు ? మా వివరాలు మీకెందుకు అంటూ ప్రశ్నలతోనే సమయం వృథా చేస్తున్నారని తెలిపారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular