- విద్యాశాఖ, సమగ్రశిక్షా, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ కృషికి తగిన గుర్తింపు లభించింది
- రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం ఏపీకి గర్వకారణం
- అభినందనలు తెలిపిన మానవవనరులు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్
విద్యావ్యవస్థలో దేశానికే దిక్సూచిలా నిలిచే ఆంధ్ర మోడల్ సత్ఫలితాలకు ఈ జాతీయ అవార్డు నాంది పలికిందని మానవవనరులు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దిల్లీలో మంగళవారం భారత ప్రభుత్వ సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ & దివ్యాంగ సాధికారత విభాగం (దివ్యాంగ జన్) ఆధ్వర్యంలో జరిగిన ‘నేషనల్ అవార్డ్స్ ఫర్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ 2024’ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బెస్ట్ స్టేట్ ఇన్ ఇంప్లిమెంటింగ్ ది రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ యాక్ట్ అవార్డును సాధించడం పట్ల మంత్రి సంతోషం వ్యక్తం చేశారు.
విద్యాశాఖ, సమగ్ర శిక్షా దిశానిర్దేశంలో ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ విభాగం చేసిన కృషికి తగిన గుర్తింపు లభించిందని ప్రశంసించారు. దివ్యాంగ విద్యార్థులకు డిజిటల్ విద్యా విధానం, ఇంటర్నెట్ ఆధారిత టూల్స్ ద్వారా సమానమైన విద్యా అవకాశాలను అందించేందుకు కృషి చేసి అవార్డు సాధించిన విద్యాశాఖ ఉన్నతాధికారులు, పాఠశాల విద్యాశాఖ, సమగ్రశిక్షా, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ విభాగాన్ని అభినందించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతులు మీదుగా ఏపీ తరఫున అవార్డు అందుకున్న సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావుకి శుభాకాంక్షలు తెలిపారు.