Sunday, May 5, 2024

కాళేశ్వరం అక్రమాలపై మీరేమంటారు..?

  • ప్రాజెక్టుపై సర్కారు ప్రజాభిప్రాయ సేకరణ
  • జ్యూడిషియల్​ విచారణ ప్రారంభం

టీఎస్​, న్యూస్: గత బీఆర్ఎస్​ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై విచారణ ప్రారంభమైంది. మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోవడంపై రాష్ట్ర ప్రభుత్వం జ్యుడిషియల్ కమిషన్ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టు లో భాగమైన మేడిగడ్డ ప్రాజెక్టు లో పిల్లరు కుంగిపోవడంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. జస్టిస్ పినాకీ ఘోష్… దీనిపై మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పినాకి ఘోష్ విచారణ జరుపుతున్నారు.

ప్రజాభిప్రాయ సేకరణ
ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నది. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై ప్రజాభిప్రాయాన్ని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. తమ ఫిర్యాదులు, నివేదనలను సాక్ష్యాధారాలతో నోటరీ ద్వారా ప్రమాణ పూర్వక అఫిడవిట్ రూపంలో సీల్డ్ కవర్లలో పంపించాలని ఈ మేరకు గురువారం రాష్ట్ర ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా ప్రకటన విడుదల చేశారు. అన్ని పనిదినాల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల సమయంలో ‘8వ అంతస్తు, డి బ్లాక్, బిఆర్కే భవనం, సచివాలయం వద్ద, హైదరాబాద్-500063′ వద్ద ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బాక్స్ లో వేయాలని సూచించారు. 31 మే 2024 లోగా ప్రజలను తమ అఫిడవిట్లను నేరుగా కానీ పోస్ట్ ద్వారా కానీ పైన పేర్కొన్న చిరునామాకు పంపవచ్చని పేర్కొన్నారు. తగిన సాక్ష్యాధారాలు లేని, నోటరీ ద్వారా పొందిన ప్రమాణ పత్రం లేని అఫిడవిట్ తిరస్కరించబడతాయని తెలిపారు.

కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్ అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వం విచారణ కమిషన్ ను ఏర్పాటు చేసిందని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో నిర్మాణ పరమైన లోపాలు, నాణ్యతా, నిర్వహణలోపాలను వెలికి తీయడం, వాటికి బాధ్యులను గుర్తించడంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టులో నిధుల దుర్వినియోగం వంటి తదితర సంబంధిత అంశాలపై ఈ కమిషన్ విచారణ చేపడుతుందని రాహుల్ బొజ్జా ఈ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, ఈ ప్రాజెక్టుపై విచారణ చేస్తున్న కమిషన్​ చైర్మన్​ జస్టిస్​ చంద్రఘోష్​ మీడియాతో మాట్లాడారు. విచారణలో భాగంగా నిపుణుల అభిప్రాయాలు తీసుకుంటామన్నారు. ఈ ప్రాజెక్టులో నిర్మాణాలు చేసిన నిర్మాణ సంస్థలను విచారణకు పిలుస్తామని తేల్చి చెప్పారు. అంతేకాకుండా రాజకీయ నాయకులను సైతం విచారణకు పిలుస్తామని, వారికి కూడా నోటీసులు ఇస్తామన్నారు. త్వరలోనే మేడిగడ్డ నుంచి క్షేత్రస్థాయి పరిశీలన చేస్తామని చంద్రఘోష్​ చెప్పారు.

కాళేశ్వరంతో పెరగనున్న రాజకీయ వేడి
ప్రస్తుతం రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ వేడి భారీగా పెరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలను ఎన్నికల్లో ఎజెండా చేస్తూ మాజీ సీఎం కేసీఆర్‌, ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావును కాంగ్రెస్‌ టార్గెట్‌ చేస్తున్న విషయం విదితమే. కాళేశ్వరం విచారణ సరిగ్గా ఎన్నికల సమయంలో ప్రారంభం కావడంతో బీఆర్‌ఎస్‌ పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా తయారైంది. ఒకవైపు కల్లకుంట్ల కవిత జైల్లో ఉండటం, జనంలో బీఆర్‌ఎస్‌ గ్రాఫ్‌ దారుణంగా పడిపోయిందనే ప్రచారం నేపథ్యంలో గులాబీ నేతలకు కంటిమీద కునుక లేకుండా ఉంది. అరోపణలు, విమర్శలతో అధికార పార్టీ కాంగ్రెస్‌పై బీఆర్‌ఎస్‌ దాడికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ, బీజేపీతో బీఆర్‌ఎస్‌కు అంతర్లీనంగా ఏదో ఉందనే ప్రచారమూ జరుగుతున్నది. కాళేశ్వరం విచారణ అంకం గురువారం నుంచి ప్రారంభం కావడటంతో బీఆర్‌ఎస్‌కు రాజకీయంగా చిక్కులను తెచ్చిపెట్టే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.

నోటీసు ఇదే, బహిరంగ ప్రకటన / పబ్లిక్ నోటీస్
నెంబరు 60/1952) ‘కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చట్టం’, 1952 (కేంద్ర ప్రభుత్వ చట్టం సెక్షన్ 3 ద్వారా సంక్రమించిన అధికారాలతో తెలంగాణ ప్రభుత్వం మాజీ సుప్రీం కోర్టు గౌరవ న్యాయమూర్తి జస్టిస్ పి సి ఘోష్ గారి అధ్యక్షతన విచారణ కమిషన్ ను ఏర్పాటు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజిలలో నిర్మాణ పరమైన లోపాలు, నాణ్యతా లోపాలు, నిర్వహణ లోపాలు తదితర కారణాలను వెలికితీయడం, వాటికి బాధ్యులను గుర్తించడం, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి పద్ధతుల వలన పైన పేర్కొన్న మూడు బ్యారేజీల నిర్మాణంలో నిధుల దుర్వినియోగం తదితర సంబంధిత అంశాలపై కమిషన్ విచారణ చేపడుతుంది.

ఈ విషయమై సమస్త ప్రజానీకానికి తెలియజేయునది ఏమనగా వారు తమ ఫిర్యాదులు, నివేదనలను సాక్ష్యాధారాలతో నోటరీ ద్వారా ప్రమాణపూర్వక అఫిడవిట్ల రూపంలో సీల్డ్ కవర్లలో అన్ని పని రోజుల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల సమయంలో 8 వ అంతస్తు, డి బ్లాక్, బి ఆర్ కే ఆర్ భవనం, సచివాలయం వద్ద, హైదారాబాద్ 500063 వద్ద ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాలయంలో అందుబాటులో ఉంచిన పెట్టెల్లో 31 మే 2024 లోగా వేయవలసిందిగా కోరడమైనది. ఆఫిడవిట్లను పోస్ట్ ద్వారా కూడా పైన పేర్కొన్న చిరునామాకు పంపవచ్చును. తగిన సాక్ష్యాధారాలు లేని, నోటరీ ద్వారా పొందిన ప్రమాణ పత్రం లేని అఫిడవిట్ తిరస్కరించబడతాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular