- రెండు, మూడురోజుల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి పునరుద్ధరణపై
- ఆదేశాలు జారీ చేయనున్న ప్రభుత్వం
- కోడ్ నేపథ్యంలో సుమారుగా 60 వేల దరఖాస్తులు పెండింగ్…
ప్రభుత్వం ఆరోగ్య శ్రీ వంటి పథకాలు అమలు చేస్తున్నప్పటికీ కొన్ని జబ్బులు వాటి పరిధిలోకి రావు. దీంతో ప్రతిపైసా సొంతంగా ఖర్చు చేయాల్సిందే. ఇలాంటి కష్టంలో ఉన్నవారికి ఆఖరిగా కనిపించే ఆపన్న హస్తం ‘సిఎం రిలీఫ్ ఫండ్’. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగిసిన నేపథ్యంలో ఈ సిఎం రిలీఫ్ ఫండ్ పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రెండు, మూడురోజుల్లో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉన్నట్టుగా సమాచారం.
డిసెంబర్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాగానే సిఎం రిలీఫ్ ఫండ్‌కు సంబంధించిన చెక్కులను ప్రభుత్వం పంపిణీ చేయగా అనంతరం వచ్చిన పార్లమెంట్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రభుత్వం ఆపివేసింది. అప్పటి నుంచి ఇప్పటివరకు సుమారుగా 60 వేల పైచిలుకు సిఎం రిలీఫ్ ఫండ్ దరఖాస్తులు ఆగిపోవడంతో పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల కోడ్ ముగిసిన నేపథ్యంలోనే చెక్‌ల జారీకి సంబంధించిన ఉత్తర్వులు వెలువడుతాయని అధికారులు తెలిపారు. అయితే ప్రతిరోజు సిఎం రిలీఫ్ ఫండ్‌కు 200ల నుంచి 300ల దరఖాస్తులు ప్రభుత్వానికి అందుతాయి. ఈ నేపథ్యంలోనే అర్హులను గుర్తించి వారికి సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ప్రభుత్వం జారీ చేస్తుంది.
సిఎం రిలీఫ్ ఫండ్ అంటే ఏమిటీ?
కొన్నిసార్లు ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయలేని రోగాలకు అనివార్యంగా డబ్బు ఖర్చు చేసుకొని వైద్యం పొందాల్సి ఉంటుంది. ప్రాణం ముఖ్యం కావడంతో పేదలు అందినకాడికి అప్పులు తెచ్చి వైద్యం చేయిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వారికి ఆఖరి ఆశాదీపం ముఖ్యమంత్రి సహాయ నిధి. వైద్యం కోసం చేసిన ఖర్చును పరిశీలించి ఆ దరఖాస్తుకు అర్హత ఉందని భావిస్తే తగిన మొత్తాన్ని ప్రభుత్వం విడుదల చేస్తుంది. అది పూర్తిస్థాయిలో కాకపోయినా ఎంతైనా బాధితులకు ఊరటను కలిగిస్తుంది.
దీనికి ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసా..?
ప్రాణాంతక వ్యాధులు, దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న పేదలను ముఖ్యమంత్రి సహాయ నిధి (సిఎంఆర్‌ఎఫ్) ద్వారా ప్రభుత్వం ఆదుకుంటుంది. వైద్య చికిత్స కోసం కొంత మేర ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. సమాజంలోని అట్టడుగు వర్గాలు, తెల్లకార్డుదారులు, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారు ఈ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు అర్హులు. అయితే చాలా మందికి ఈ పథకం గురించి తెలియదు. కొద్దిమందికి తెలిసినా దరఖాస్తు చేసుకునే విధానం తెలియదు. ఈ పథకానికి ఎలా దరఖాస్తు ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
అర్హత ప్రమాణాలు ఇలా…
ఆరోగ్య సమస్యలతో బాధపడే పేదలు దీనికి అర్హులు. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన కుటుంబాలు కూడా.. బాధితులు తప్పనిసరిగా తెలంగాణలో శాశ్వత నివాసి అయి ఉండాలి. దీనికోసం ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ సైజు ఫొటో, వార్షిక ఆదాయ ధ్రువీకరణ పత్రం, రేషన్ కార్డు, వైద్య బిల్లులు, బ్యాంకు అకౌంట్, ఫోన్ నంబర్, ఈ-మెయిల్ ఐడీలను వెబ్‌సైట్‌లో నమోదు చేయాలి. పైన చెప్పిన డాక్యుమెంట్లతో మీ ప్రాంతంలో అందుబాటులో ఉన్న ఏదైనా మీ సేవా కేంద్రానికి వెళ్లాలి.
అక్కడ సిఎం రిలీఫ్ ఫండ్‌కు సంబంధించిన దరఖాస్తు ఫారం తీసుకొని అన్ని వివరాలను నమోదు చేయాలి. ఇప్పుడు అవసరమైన పత్రాలను దరఖాస్తు ఫారంకు జత చేసి స్కాన్ చేసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలి. దరఖాస్తు చేసిన తర్వాత ప్రింట్‌వుట్ తీసుకోవాలి. మీ అర్హతను, జబ్బు తీవ్రతను సిఎం రిలీఫ్ ఫండ్ అధికారులు పరిశీలిస్తారు. అర్హతను బట్టి తగినంత డబ్బును సిఎం రిలీఫ్ ఫండ్ నుంచి విడుదల చేస్తారు.