# పరామర్శల వెనుక రాజకీయ వ్యూహంపై అనుమానాలు
# సోమాజిగూడ యశోదకు లీడర్ల క్యూ
# చర్చనీయాంశంగా కాంగ్రెస్ నేతల పరామర్శ
# రాజకీయ వర్గాల్లో విభిన్న వాదనలు
రాష్ట్రంలో సరికొత్త రాజకీయ చర్చ మొదలైంది. మాజీ సీఎం కేసీఆర్‌ను పరామర్శించే వారి జాబితా ఒక్కరోజులోనే పెరిగిపోయింది. సొంత పార్టీ నేతల తాకిడి ఎలా ఉన్నా.. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నేతలు, మంత్రులు మాత్రం యశోద ఆస్పత్రికి క్యూ కట్టారు. కానీ, ఈ నెల 9న రాత్రి కాంగ్రెస్ కీలక నేత జానారెడ్డి వెళ్లి కేసీఆర్‌ను పరామర్శించడం హాట్ టాపిక్‌గా మారింది. జానారెడ్డి వెళ్లి కేసీఆర్‌ను పరామర్శించి వచ్చిన తర్వాత మరునాడు ఉదయమే సీఎం రేవంత్‌రెడ్డి హుటాహుటినా పరామర్శకు వెళ్లారు. సీఎం వెళ్లేందుకు ముందుగానే మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా వెళ్లి వచ్చారు. ఇక, సీఎం రేవంత్ వెళ్లి వచ్చిన తర్వాత కాంగ్రెస్ నేతల తాకిడి పెరిగింది. తాజాగా మాజీ సీఎం చంద్రబాబు, ఇతర నేతలు, సినీ ప్రముఖులు కూడా క్యూ కట్టారు. కాంగ్రెస్ నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సైతం పరామర్శించి వచ్చారు.
జానారెడ్డి వెళ్తే..!
కేసీఆర్కాలు గాయంతో యశోద ఆస్పత్రిలో చేరిన తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి ఆరా తీశారు. ఆ తర్వాత ఆయనకు శస్త్ర చికిత్స జరిగింది. రెండు రోజుల పాటు సైలెంట్‌గా ఉన్న నేతలు.. ఒక్కసారిగా యశోద చుట్టూ లైన్ కట్టారు. కానీ, ఈ నెల 9న రాత్రి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి వెళ్లి కేసీఆర్‌ను పరామర్శించారు. ఇక్కడే ఆసలు కథ మొదలైంది. నిజానికి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా.. మెజార్టీ మాత్రం చాలా తక్కువ. కేవలం ఐదుగురు ఎమ్మెల్యేలు మాత్రమే ఎక్కువ ఉన్నారు. ఇదే సమయంలోకాంగ్రెస్ అంటేనే వివాదాల కూపం. దీనికితోడు సీఎం కుర్చీపై చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. అందులో ముందు వరుసలో జానారెడ్డి ఉన్నారు. ఇటీవల సీఎం ఎవరనే నిర్ణయం, మంత్రివర్గ కూర్పు వంటి విషయాల్లో జానారెడ్డి సైలెంట్‌గా ఉన్నారు. కనీస సమాచారం కూడా లేదని అలిగారు కూడా. ఇలాంటి సమయంలో ఆయన ఒంటరిగా వెళ్లి కేసీఆర్‌ను కలువడం.. అటు ఏఐసీసీ వర్గాల్లో కూడా అనుమానాలు వచ్చాయి.
జానా దగ్గరకు రేవంత్
సీఎం రేవంత్ రెడ్డి సోమవారం అత్యవసరంగా జానారెడ్డి దగ్గరకు పరుగు పెట్టారు. దీనిలో ఏఐసీసీ నుంచి కీలకమైన ఆదేశాలు వచ్చాయనే ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతున్నది. జానారెడ్డి అసంతృప్తిగా ఉన్నాడని పార్టీ నేతలే చెబుతున్నారు. ఇలాంటి సమయంలో ఆయన కేసీఆర్ దగ్గరకు వెళ్లడం కూడా రాజకీయంగా కలకలం సృష్టించింది. దీంతో రేవంత్‌రెడ్డి హుటాహుటినా జానారెడ్డి దగ్గరకు వెళ్లి కలిసి వచ్చారు. ఈ పరిణామాలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.