Saturday, May 18, 2024

చేరికలపై ఆచితూచి…!

  • స్థానిక నాయకులకు తెలియకుండా
  • కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోరాదని టిపిసిసి ఆదేశించిన ఏఐసిసి
  • పార్టీలో చేరిన తరువాత స్థానిక నాయకుల అభ్యంతరంతో
  • ఎటూ తేల్చుకోలేకపోతున్న వివిధ పార్టీల నాయకులు

కాంగ్రెస్ పార్టీలో చేరే వారిలో చాలామంది ఆయా జిల్లాల నేతలకు తెలియకుండా పార్టీలో చేరుతుండడంతో ఏఐసిసికి భారీగా ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ చేరికల్లో భాగంగా గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి వేరే పార్టీలో చేరిన వారు కూడా ఉండడం, గత అసెంబ్లీ ఎన్నికల్లో వారు కాంగ్రెస్ అభ్యర్థులకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించడంతో ప్రస్తుతం కాంగ్రెస్ కేడర్ వారిపై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఏఐసిసికి ఫిర్యాదులు చేస్తుండడంతో ఈ చేరికల విషయంలో ఆచితూచి అడుగులు వేయాలని టిపిసిసికి ఆదేశాలు అందినట్టుగా తెలిసింది.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా టు ఉమ్మడి నల్లగొండ వరకు ఇతర పార్టీల నుంచి వచ్చే నేతల రాకను కాంగ్రెస్‌కు చెందిన స్థానిక నాయకులు అడ్డుకోవడంతో చేరికల చిచ్చు రగులుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఆదిలాబాద్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన నేతల చేరికలను ఆపివేసినట్టు గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. ఇక నుంచి పార్టీలో చేరికలన్నీ దీపాదాస్ మున్షి ఆదేశాల ప్రకారం మాత్రమే జరుగుతాయని టిపిసిసి తెలిపింది. పార్టీలో చేరాలనుకునే నేతలకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే కండువాలు కప్పుతామని జగ్గారెడ్డి సైతం స్పష్టం చేశారు.

మాజీ మంత్రి ఇంద్రకరణ్ చేరికపై డిసిసి అధ్యక్షుడి అభ్యంతరం
ఇటీవల గాంధీభవన్‌లో చేరికల కమిటీ ఆధ్వర్యంలో పార్టీలో చేరిన గండ్రత్ సుజాత, సాజిద్ ఖాన్, సంజీవరెడ్డిల చేరికను తాత్కాలికంగా నిలిపివేసినట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఆదిలాబాద్ నేతల చేరికపై ఇన్‌చార్జి కంది శ్రీనివాసరెడ్డి అసంతృప్తిని వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరాజయానికి కృషి చేసిన వారిని ఎలా చేర్చుకుంటారంటూ ఆదిలాబాద్‌లో నిరసనలు నిర్వహించడంతో పాటు ఏఐసిసికి ఫిర్యాదు చేయడం విశేషం. పదేళ్ల పాటు బిఆర్‌ఎస్‌లో ఉండి, మంత్రి పదవి అనుభవించిన ఇంద్రకరణ్ రెడ్డి అధికారం పోగానే కాంగ్రెస్‌లో చేరడాన్ని డిసిసి ప్రెసిడెంట్ శ్రీహరి రావు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కొద్ది రోజుల్లో ఆదిలాబాద్‌కు రాహుల్ గాంధీ రానున్న నేపథ్యంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క నేతృత్వంలో సన్నాహక సమావేశం జరిగింది. దీనికి డిసిసి అధ్యక్షుడు డుమ్మా కొట్టడం విశేషం.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే ఇదే తంతు…
ఇక మిర్యాలగూడ కాంగ్రెస్‌లోనూ చేరికల చిచ్చు రేగింది. బిఆర్‌ఎస్‌కు చెందిన మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ భార్గవ్, 13 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించారు. దీనికి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి సూత్రప్రాయంగా అంగీకరించారు. స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, డిసిసి చీఫ్ శంకర్ నాయక్‌లను కలవకుండానే నేరుగా హైదరాబాద్ వచ్చి, గాంధీభవన్‌లో దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి వర్గం మండిపడుతోంది. భార్గవ్ రాకను వ్యతిరేకిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు.

మిర్యాలగూడలో చెలరేగిన చేరికల చిచ్చును, చల్లార్చేందుకు పిసిసి రంగంలోకి దిగింది. మున్సిపల్ చైర్మన్ భార్గవ్, ఇతర కౌన్సిలర్ల చేరిక చెల్లదంటూ టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. భార్గవ్ చేరికను ప్రస్తుతానికి నిలిపివేసినట్లు ఆయన తెలిపారు. ఇలా పలు జిల్లాలో వేరే పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరికపై అసంతృప్తులు వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular