Saturday, May 18, 2024

ఇక మిగిలింది వారం రోజులే…

  • జోరందుకున్న పార్టీల ప్రచారం
  • ఢిల్లీ నుంచి గల్లీలకు క్యూ కట్టిన బడా నేతలు
  • హామీలతో ప్రజలను ఆకర్శించేలా స్పీచ్‌లు

రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గరపడుతుండటంతో అన్ని పార్టీల ప్రచారం జోరందుకుంది. ఇక మిగిలింది వారంరోజులే కావడంతో ఎన్నికల ప్రచారం తుదిదశకు చేరుకుంది. ఈ నేపథ్యంలోనే జాతీయ పార్టీల ఢిల్లీ నేతలు తెలంగాణ గల్లీలకు క్యూ కడుతున్నారు. రాష్ట్రంలో ఎక్కువ సీట్లు సాధించాలన్న లక్ష్యంతో దూకుడుగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు రాష్ట్రంలో పర్యటించిన బిజెపి, కాంగ్రెస్ పార్టీల అగ్రనేతలు ఆదివారం నుంచి విస్తృతంగా పర్యటించేలా ప్రణాళికలు ఖరారు చేసుకున్నారు. ఈనేపథ్యంలో ఆయా పార్టీల కీలకనేతలందరూ ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు.

బిజెపి తరపున ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆ పార్టీ జాతీయ అధ్యకుడు జెపి నడ్డా, కాంగ్రెస్ తరపున రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తదితరులు వరుసగా రాష్ట్రంలో పర్యటిస్తారని ఆయా పార్టీల నేతలు తెలిపారు. మరో వైపు రాష్ట్రంలో కీలకమైన బిఆర్‌ఎస్ తరపున ఆ పార్టీ అధినేత కెసిఆర్ కూడా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఆదివారం (నేటి) నుంచి మొదలు ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో జాతీయ స్థాయిలో 400 సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న బిజెపి అందుకు తగినట్టుగా తెలంగాణలో మెజార్టీ స్థానాలు దక్కించుకోవాలని భావిస్తోంది. బిజెపి తరపున ఆ పార్టీ జాతీయ నేతలు నెల రోజులుగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు, ఇతర అగ్రనేతలు పలుమార్లు రాష్ట్రానికి వచ్చారు. పోలింగ్‌కు ముందు ఓటర్లను ఆకట్టుకునేందుకు మరోమారు ముందుకు వస్తున్నారు.

ఈనెల 8, 10 తేదీల్లో ప్రధాని మోడీ
ప్రధాని మోడీ ఈనెల 8, 10 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించి బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. నేడు అమిత్‌షా, ఆరో తేదీన జేపీ నడ్డాలు రాష్ట్రానికి వస్తున్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్, మల్కాజిగిరిల్లో అమిత్ షా, పెద్దపల్లి, భువనగిరి, నల్లగొండలో నడ్డా ఎన్నికల ప్రచార సభలు నిర్వహించనున్నారు.

నేటి నుంచి 10వ తేదీ వరకు సభలు, రోడ్ షోలు
కాంగ్రెస్ నుంచి అతిరథ మహారథులు లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న తరుణంలో రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ ప్రచార బరిలోకి దిగుతున్నారు. నిజానికి ఈ ఎన్నికల్లో తెలంగాణలో ప్రియాంకగాంధీ కేంద్రంగా ఎన్నికల ప్రచారం నిర్వహించాలని, వీలైనన్ని ఎక్కువసార్లు ఆమెను ప్రచారానికి తీసుకురావాలని టిపిసిసి భావించింది. కానీ, ఇతర రాష్ట్రాల ప్రచార షెడ్యూల్ కారణంగా అది సాధ్యం కాలేదు.

నేటి నుంచి 10వ తేదీ వరకు రాహుల్‌గాంధీ, ప్రియాంకలు కాంగ్రెస్ అభ్యర్థులకు మద్ధతుగా సభలు, రోడ్ షోలలో పాల్గొంటారు.
నేడు నాంధేడ్ నుంచి నేరుగా నిర్మల్‌కు రాహుల్..
నేడు ఉదయం నాంధేడ్ నుంచి నేరుగా నిర్మల్‌లో జరుగనున్న ఎన్నికల ప్రచార సభకు రాహుల్‌గాంధీ హాజరుకానున్నారు. అక్కడ అదిలాబాద్ అభ్యర్ధి ఆత్రం సుగుణకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ఆ తరువాత అక్కడి నుంచి నాగర్‌కర్నూల్ పార్లమెంటు నియోజక వర్గం పరిధిలోని అలంపూర్, ఎర్రవల్లి కూడలి వద్ద జరురగనున్న ఎన్నికల ప్రచార సభకు సాయంత్రం 5 గంటలకు రాహుల్‌గాంధీ హాజరవుతారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 9వ తేదీన ఉదయం కరీంనగర్, సాయంత్రం 5 గంటలకు సరూర్ నగర్‌లోనూ రాహుల్‌గాంధీ ఎన్నికల ప్రచారం చేయనున్నారు.

ప్రియాంక గాంధీ రాష్ట్ర పర్యటనలో స్వల్ప మార్పులు
ప్రియాంక గాంధీ రాష్ట్ర పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 6, 7 తేదీల్లో తెలంగాణకు రావాల్సిన ప్రియాంక గాంధీ రాష్ట్ర పర్యటన వాయిదా పడింది. ఈ నెల 10వ తేదీన ఎల్లారెడ్డి, తాండూర్, షాద్‌నగర్‌లలో ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారం చేయనున్నారు. వీరితోపాటు ఏఐసిఅధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఎన్నికల ప్రచారానికి హాజరవుతారని టిపిసిసి వర్గాలు తెలిపాయి.

ఈనెల 10వ తేదీ వరకు కెసిఆర్ బస్సుయాత్ర
బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ సైతం ఎన్నికల ప్రచారంలో ముందుకెళుతున్నారు. గతంలో రూపొందించిన షెడ్యూల్‌కు అనుగుణంగానే ఈ నెల 10వ తేదీ వరకు కెసిఆర్ బస్సుయాత్ర ఉంటుందని బిఆర్‌ఎస్ వర్గాలు తెలిపాయి. ఈనెల 10వ తేదీన సిరిసిల్లలో రోడ్ షో, సిద్ధిపేటలో బహిరంగ సభతో ఆయన లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముగుస్తుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular