Tuesday, May 21, 2024

జూన్ నెలలో చర్లపల్లి టెర్మినల్ అందుబాటులోకి…

  • సికింద్రాబాద్ స్టేషన్‌లో తగ్గనున్న రైళ్ల రద్దీ
  • 5 ప్లాట్‌ఫాంలతో సిద్ధంగా…

జూన్ నెలలో చర్లపల్లి టెర్మినల్ అందుబాటులోకి రానుంది. హైదరాబాద్‌లో ప్రస్తుతం మూడు రైల్వే స్టేషన్లు సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ అందుబాటులో ఉండగా ఈ స్టేషన్‌ల నుంచే పలు రైళ్లు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైళ్ల రద్దీని తగ్గించడానికి దక్షిణమధ్య రైల్వే చేపట్టిన మరో కొత్త రైల్వే టెర్మినల్ నిర్మాణం దాదాపు పూర్తయింది. నగరానికి నాలుగో రైల్వేస్టేషన్‌గా చర్లపల్లి సిద్ధమైంది. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఈ స్టేషన్ ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 5 ప్లాట్‌ఫాంలతో పాటు రైళ్ల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశారు. స్టేషన్ భవనంలోనే టిక్కెట్ కౌంటర్లు, కార్యాలయాన్ని సిద్ధం చేశారు. స్టేషన్‌కు ఇరువైపులా రాకపోకలు సాగించేందుకు వీలుగా రహదారుల నిర్మాణం ప్రస్తుతం జరుగుతోంది.

ముందుగా 6 ఎక్స్‌ప్రెస్ రైళ్లు…
ఇక్కడి నుంచి తొలుత ఆరు ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడపాలని వీటితో పాటు 25 జతల దూరప్రాంత రైళ్లను నడపడానికి అధికారులు నిర్ణయించారు. రూ.430 కోట్లకు పైగా వెచ్చించి ఈ రైల్వేస్టేషన్‌ను తీర్చిదిద్దుతుండగా ఇప్పటికే 24 రైల్వే బోగీలు పట్టే విధంగా 5 ప్లాట్‌ఫాంలను సైతం అధికారులు అందుబాటులోకి తీసుకువచ్చారు. మరో 4 ఎత్తైన ప్లాట్‌ఫాంలను అందుబాటులోకి తీసుకురానున్నారు. 12 మీటర్ల వెడల్పుతో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, 6 మీటర్ల వెడల్పుతో మరొకదానిని సిద్ధం చేస్తున్నారు. వీటికి అదనంగా 9 ప్లాట్‌ఫాంలలో మొత్తం 7 లిఫ్టులు, 6 ఎస్కలేటర్లను అధికారులు ఏర్పాటు చేశారు. కోచ్ నిర్వహణ వ్యవస్థతో పాటు ఎంఎంటిఎస్ రైళ్లకు ఎలాంటి ఆటంకం లేకుండా రెండు ప్లాట్‌ఫాంల నిర్మాణాలను చేపట్టారు.

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌తో సంబంధం లేకుండా…
ఈ స్టేషన్ నుంచి రైళ్లు అందుబాటులోకి వస్తే రైళ్ల ఆలస్యానికి చెక్ పడనుందని అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌తో సంబంధం లేకుండా పలు రైళ్ల ప్రయాణం సాగనుంది. భవిష్యత్‌లో లింగంపల్లి తర్వాత హైటెక్‌సిటీ రైల్వే స్టేషన్‌లో ఈ ట్రైన్లు ఆగి సనత్‌నగర్, మౌలాలి మీదుగా చర్లపల్లి చేరుకునే వెసులుబాటును అధికారులు కల్పించారు. అలాగే విజయవాడ మీదుగా వచ్చే రైళ్లు కాచిగూడ స్టేషన్‌ల మీదుగా, బెంగళూరు, కర్నూలు వైపు వెళ్లే రైళ్లు సికింద్రాబాద్ స్టేషన్‌కు చేరకుండా వెళ్లడానికి వీలు కలగనుంది. సిటీలోకి రాకుండా 50 శాతం ప్రయాణికులు ఇక్కడి నుంచి రాకపోకలు సాగించే అవకాశం ఉంది. కాచిగూడ రైల్వేస్టేషన్ నుంచి బెంగళూరు వెళ్లే రైళ్లతో పాటు విశాఖపట్నం, విజయవాడ వెళ్లే రైళ్లను కూడా అక్కడి నుంచి పంపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ఎన్నికల కోడ్ ముగియగానే జిల్లాల పునర్విభజన సరైనదేనా..?

Most Popular